2010 నాటి బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన ఇప్పుడు మళ్లీ తెరమీదికి వచ్చింది. అప్పట్లో ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోపాటు పలువురు ప్రముఖులు ఆందోళనలో పాల్గొన్నారు. ఆ సందర్బంగా నాటి కాంగ్రెస్ సర్కారు అనుసరించిన తీరు చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఆ కేసు విచారణకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ధర్మాబాద్ కోర్టు నుంచి త్వరలో నోటీసులు వచ్చే అవకాశం ఉన్నట్టు కొన్ని కథనాలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఏపీ సీఎం కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉందనే కథనాలూ వినిపిస్తున్నాయి.
నిజానికి, టీడీపీ సాగించిన పోరాటాల్లో బాబ్లీ వ్యతిరేక పోరాటం చెప్పుకోదగ్గదే. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తెలంగాణ ప్రాంతం తీవ్రంగా నష్టపోతుందంటూ టీడీపీ ఆందోళనకు దిగింది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుతోపాటు కొంతమంది టీడీపీ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. 2010లో ధర్మాబాద్ లో జరిగిన ఆ పోరాటం అప్పట్లో జాతీయ స్థాయిలో సంచనలమైంది. ఆ సందర్భంగా చంద్రబాబును అరెస్టు చేయడం, పోలీసులతోపాటు నాటి అధికార కాంగ్రెస్ పార్టీ అనుసరించిన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉందనేది తాజా కథనాల సారాంశం.
అయితే, ఈ అంశమై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాపాడటం కోసమే నాడు చంద్రబాబు పోరాటం చేశారనీ, అన్యాయంగా అరెస్టులు చేసి బెయిల్ ఇచ్చేందుకు కూడా నిరాకరించారని లోకేష్ అన్నారు. ఈ పోరాటం టీడీపీ చరిత్రలోనే చిరస్థాయిగా నిలుస్తుందనీ, తెలంగాణ ప్రయోజనాలకు పార్టీ ఎప్పుడూ కట్టుబడే ఉందని చెప్పడానికి నాటి పోరాటమే ఉదాహరణ అని లోకేష్ చెప్పారు. తాజా కథనాల నేపథ్యంలో ఒకవేళ కోర్టు నుంచి నోటీసులు వస్తే హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా మంత్రి అభిప్రాయపడ్డారు.
అయితే, తెలంగాణలో ఎన్నికలకు రంగం సిద్ధమౌతున్న సమయంలో ధర్మాబాద్ అంశం తెరమీదికి రావడం టీడీపీకి ఒక రకంగా ప్లస్.. మరో రకంగా మైనస్ కూడా ..! తెలంగాణ ప్రయోజనాల కోసం టీడీపీ ఎప్పుడూ పోరాడుతూనే ఉందని, బాబ్లీ పోరాటాన్ని ప్రజలకు మరోసారి గుర్తు చేసి, సానుకూల భావనను కలిగించేందుకు ఈ అంశం ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. కరెక్ట్ టైమ్ లో టీ టీడీపీకి దొరికిన మంచి ప్రచారాస్త్రం ఇది. నాణానికి మరోవైపు ఏంటంటే… నాడు చంద్రబాబుపై అనుచితంగా వ్యవహరించింది కాంగ్రెస్ పార్టీ కావడం! ఇప్పుడు అదే పార్టీతో మహాకూటమిలో కలిసి తాజా ఎన్నికలకు టీడీపీ వెళ్తున్న పరిస్థితి ఉంది! ఈ పాయింట్ మీద విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితీ వస్తుందేమో..!