uturn telugu movie review
తెలుగు360 రేటింగ్: 3/5
రీమేక్ అంటే కాపీ చేయడమే కదా… అనుకోవడం పొరపాటు.
చక్కటి చిక్కటి కాఫీ కలిపినంత పనితనం దాగుంది అందులో.
పాలు, పంచదార, కాఫీ పొడి… అన్నీ ముందే ఉంటాయి.
పాలు ఎంత వరకూ మరగబెట్టాలో
అందులో కాఫీ పొడి ఎప్పుడు కలపాలో
ఎన్ని చంచాలు పంచదార వేయాలో.. తెలియడమే ఆర్ట్.
రీమేక్ కథ కూడా అంతే.
కథ, పాత్రలు, మలుపులు అన్నీ ముందే ఉంటాయి.
వాటిని ఎంత వరకూ వాడుకోవాలో తెలిసుండాలి. రీమేక్ ని ఎప్పుడూ ఓ `సేఫ్ గేమ్`గానే భావిస్తారు చిత్ర రూపకర్తలు. ఉన్నది ఉన్నట్టుగా దించేస్తే చాలని వాళ్ల నమ్మకం. కానీ ట్రూ కాపీ పేస్ట్ సినిమాలెప్పుడూ ఆడిన దాఖలాలు లేవు. ఆడినా తమకంటూ ఓ స్థానం సంపాదించుకోలేకపోయాయి. ‘యూటర్న్’ కూడా ఓ రీమేక్ సరుకే. కన్నడలో మంచి విజయాన్నీ, విమర్శకుల ప్రశంసల్నీ అందుకున్న ఈ చిత్రం.. తెలుగులోనూ అలానే మెరిసిందా? ఇదీ కపీ సరుకేనా, లేదంటే.. చిక్కటి కాఫీ తాగిన ఫీలింగ్ కలిగిందా?? ఇలాంటి విషయాల్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
కథ
రచన (సమంత) హైదరాబాద్‌లోని ఓ ఆంగ్ల పత్రికలో ట్రైనీ రిపోర్టర్‌గా పనిచేస్తుంటుంది. ఆదిత్య (రాహుల్ రవీంద్రన్) అదే పత్రికలో క్రైమ్ రిపోర్టర్‌గా పనిచేస్తుంటాడు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ఓ ఆర్టికల్‌ను రాయాలనే ఉద్దేశంతో రచన ఆర్.కె.పురం ఫ్లైఓవర్‌పై డివైడర్ బ్లాక్‌లు తీసివేసి రాంగ్‌సైడ్‌లో వెళ్లే వాహనాల వివరాల్ని సేకరించి వారిని ఇంటర్వ్యూ చేయాలనుకుంటుంది. అయితే అనూహ్యంగా అక్కడ యూ టర్న్ తీసుకుని వెళ్లే వాహనదారులు ఆత్మహత్య చేసుకొని చనిపోతుంటారు. ఈ మరణాల వెనకున్నమిస్టరీ ఏమిటి? రచన తన పరిశోధనలో వాటి రహస్యాన్ని ఎలా ఛేదించింది? పోలీసాఫీసర్ నాయక్ (ఆది పినిశెట్టి) ఆమెకు ఏ విధంగా సహాయపడ్డాడు? ఈ పరిశోధనలో రచన తెలుసుకున్న నిజాలేమిటి? అన్నదే చిత్ర కథ
విశ్లేషణ..
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రాల్లో కథ ముందుగానే తెలిసిపోతే సన్నివేశాల్లో ఉత్కంఠ మిస్ అవుతుంది. అయితే ఈ సినిమా విషయంలో అలా అనిపించదు. సినిమా ఆరంభమైన మొదటి ఇరవై నిమిషాల్లోనే కథేమిటో ప్రేక్షకులకు తెలిసిపోతుంది. పోలీస్ అధికారి నాయక్‌తో కలిసి రచన చేసే పరిశోధనలోనే హత్యల వెనక ఏదో మిస్టరీ ఉందనే విషయం ప్రేక్షకులకు అవగతమవుతుంది. అయితే ఈ ప్రిడిక్టబుల్ స్టోరీని మంచి ఆసక్తికరమైన కథనం, సన్నివేశాల కూర్పుతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడిపించారు. ప్రథమార్థం కథ మెల్లగా టేకాఫ్ అవుతుంది. రచన, ఆదిత్య మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు అనవసరమనిపిస్తాయి. ఎప్పుడైతే ఓ కేసు విషయంలో రచనను సస్పెక్ట్‌గా భావించి పోలీస్‌లు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినప్పుడే అసలు కథ మొదలవుతుంది. రోడ్డు పక్కన మరుగుజ్జు యాచకుడికి రచన డబ్బులు ఇస్తూ యూ టర్న్ చేస్తున్నవారి వివరాలు సేకరించడం, లాయర్ ఆత్మహత్య చేసుకొని పోలీస్ జీప్‌మీద పడటం, ప్రీ ఇంటర్వెల్ ముందు వచ్చే పోలీస్ సెల్‌లో హత్య, ఆత్మహత్య ఎపిసోడ్ ఉత్కంఠను పంచింది. అయితే ద్వితీయార్థంలోనే కథ ఊపందుకుంది. ఈ ఆత్మహత్యల వెనక మిస్టరీ ఉందనే రచన మాటల్ని నాయక్ నమ్మడం, కేసును ఛేదించాలని నిర్ణయించుకోవడంతో కథాగమనంలో స్పీడ్ పెరుగుతుంది. ప్రీ క్లైమాక్స్ ఘట్టాల్ని అనూహ్య మలుపులతో ఆవిష్కరించారు. మాయ (భూమిక) ఎంటరవడంతోనే కథ మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. మర్డర్ మిస్టరీ అంశానికి ఆత్మ ఎలిమెంట్‌ను జోడించి గతంలో అనేక థ్రిల్లర్ సినిమాలొచ్చాయి. ఇదీ ఆ జోనర్ కథనే. అయితే అందరిని తెలిసిన రోడ్డులోని యూ టర్న్‌ను ప్రధాన ఇతివృత్తంగా ఎంచుకోవడం కొత్తగా అనిపిస్తుంది.
నటీనటులు పనితీరు..
యూ టర్న్ కథ సింహభాగం సమంత, ఆది పినెశెట్టి, రాహుల్ రవీంద్రన్ చుట్టూ నడుస్తుంది. రచన పాత్రలో సమంత చక్కటి నటన కనబరచింది. ఈ తరహా పాత్ర చేయడం సమంత కెరీర్‌లో ఇదే మొదటిసారని చెప్పొచ్చు. తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పడం ఆకట్టుకుంది. ఇక ఆది పినిశెట్టి పోలీసాఫీసర్ పాత్రలో తనదైన నటనను కనబరిచాడు. ఇలాంటి పాత్రలకు ఆది ది బెస్ట్ ఛాయిస్ అని మరోమారు నిరూపించుకున్నాడు. రాహుల్ రవీంద్రన్ పాత్ర బాగుంది. ఇక భూమిక పాత్రను బాగా డిజైన్ చేశారు. క్లైమాక్స్ ఘట్టాల్లో ఆమె పాత్ర ఉత్కంఠను పంచింది. నికేత్ బొమ్మి ఛాయాగ్రహణం సన్నివేశాల్ని ఎలివేట్ చేసింది. కొన్ని ఎపిసోడ్స్‌లో లోలైట్ కెమెరా వర్క్ బాగుంది. పూర్ణచంద్ర తేజస్వి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏమంతగా ఆకట్టుకోలేదు. ఇలాంటి థ్రిల్లర్ చిత్రాల్లో మూడ్ ఎలివేట్ కావాలంటే నేపథ్య సంగీతంపై ఇంకాస్త దృష్టిపెట్టాల్సి ఉంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సమంత, ఆది, రాహుల్‌రామకృష్ణ వంటి తారాగణం ఈ కథకు మరింత బలం చేకూర్చారు. ముఖ్యంగా సమంత కెరీర్‌లో ఎప్పటికి గుర్తుంచుకునే పాత్ర అవుతుంది. ఓ చిన్న పాయింట్‌తో తయారుచేసుకున్న ఈ కథను ఆద్యంతం ఉత్కంఠభరితంగా, భావోద్వేగభరితంగా నడిపించడంలో దర్శకుడు పవన్‌కుమార్ సఫలీకృతుడయ్యాడు.
తీర్పు..
మిస్టరీ థ్రిల్లర్ చిత్రాల్ని ఇష్టపడే వారిని యూ టర్న్ తప్పకుండా మెప్పిస్తుంది. కథలోని కొత్తదనం, కథనంలోని భావోద్వేగం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. సమంత వంటి అగ్ర నాయిక ఈ సినిమాలో ముఖ్య పాత్రధారి కావడం ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు.
తెలుగు360 రేటింగ్: 3/5