సినిమా అన్న తర్వాత, అందులో కామెడీ అన్నతరువాత.. ఎవరిమీదో ఒకరి మీద వెటకారం చేస్తూ.. అందులో కామెడీ పండించడానికి ప్రయత్నించడం సహజం. అయితే అలా కామెడీ కోసం చేసే వ్యాఖ్యలను కూడా సీరియస్‌గా తీసుకుని స్పందిస్తే దాన్ని ఏం అనుకోవాలి? సదరు వ్యక్తులకు జోకును జోకులాగా రిసీవ్ చేసుకోగల స్టోర్టివ్ స్పిరిట్ లేదని జాలిపడడం తప్ప వేరేచేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో రేగిన ఒక వివాదాన్ని పరిశీలించినప్పుడు కూడా అదే సంగతి అర్థమవుతోంది.
బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా విడుదలకు సిద్ధం అవుతున్న స్పీడున్నోడు చిత్రానికి సంబంధించిన సాంగ్స్, ట్రైలర్స్ ఇటీవల రిలీజ్ అయ్యాయి. అందులోని ఒక పాటలో ‘వర్మలాగా రోజుకో సినిమా తీయడం కాదు.. రాజమౌళి లాగా రెండేళ్లకు ఒక సినిమా తీసినా హిట్ కొట్టాలి’ అన్నట్లుగా ఒక వాక్యం ఉంది. పాటలో భాగంగా వచ్చే ఈ వాక్యం రాంగోపాల్‌వర్మ కోటరీ వారికి చాలా బాధ కలిగిస్తున్నట్లుంది.
వర్మ తరఫున.. ఐస్‌క్రీం సిరీస్ చిత్రాల నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ విషయంలో చాలా ఆవేదన చెందుతూ.. వాట్సప్ గ్రూపుల్లో పరిశ్రమలోని వారికి కామన్ మెసేజీలు షేర్ చేయడం విశేషం. ఇందులో ఆయన ‘స్పీడున్నోడు’ దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు వైఖరిని తప్పుపట్టారు. రాంగోపాల్‌వర్మ సర్కార్, రంగీలా వంటి చాలా గొప్ప చిత్రాలు చేశారు. ఆయన రోజుకో సినిమా తీస్తాడంటూ జోకులేయడం చాలా తప్పు అంటూ తుమ్మలపల్లి ఆవేదన చెందిపోయారు. ఆ మాటకొస్తే.. అప్పల్రాజు సినిమాలోనే వర్మ తన పేరు మీద తనే వెటకారపు జోకులు రాయించుకున్నాడు. అలాంటిది.. ఇప్పుడు ఇంత సింపుల్ సెటైర్ వేస్తే తుమ్మలపల్లి రామసత్యనారాయణకు అంత కోపం బాధ ఎందుకు కలుగుతున్నాయో అర్థం కావడం లేదని టాలీవుడ్లో అనుకుంటున్నారు.
తాను మాత్రం ‘సూటిగా మాట్లాడడం’ అనే ముసుగులో ఎవరి మీద ఎంతటి నిందలు వేయడానికైనా, ఎవరిని నొప్పించే ఎలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడానికైనా వెనుకాడని రాంగోపాల్ వర్మ… తన మీద వెబ్సైట్లలో చిన్న విమర్శ వచ్చినా గతంలో చాలా తీవ్రంగా స్పందించేవారు. ఇప్పుడు తాను స్పందించడం మానేసి.. తన కోటరీలోని వారి ద్వారా ప్రతివిమర్శలు చేయిస్తున్నాడా? సాధారణంగా పాలిటిక్స్‌లో మాత్రమే కనిపించే గేంప్లాన్ను అనుసరిస్తున్నాడా? అని పలువురు అనుకుంటున్నారు.