ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు.,. మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు.. ఏకంగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం సంచలనం సృష్టిస్తోంది. చంద్రబాబు అంత తప్పు ఏం చేశారన్న భావన ప్రజల్లో ప్రారంభమయింది. ప్రజాసమస్యల కోసం.. నేతలు పోరాడటం సహజమే. అలాంటి సమయంలో వారిపై ఎన్నో కేసులు నమోదవుతూ ఉంటాయి. కానీ చంద్రబాబును మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారన్నది ఇప్పుడు ఎవరికీ అర్థం కావడం లేదు. కృష్ణా జిల్లా కలెక్టర్ చొక్కా పట్టుకున్న కేసులోనే ప్రతిపక్ష నేత జగన్‌కు ఇంత వరకూ ఒక్కసారి కూడా కోర్టులు హాజరైన దాఖలాలు లేవు. మరి 144 సెక్షన్ ఉల్లంఘించడం, నిషేధాజ్ఞాలు దాటి ముందుకెళ్లడం లాంటి కేసులకే… నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసేస్తారా..?
చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. బాబ్లీ ప్రాజెక్ట్ ను మహారాష్ట్ర అక్రమంగా నిర్మిస్తోందని .. పోరు బాట పట్టారు. ఆ ప్రాజెక్ట్ గేట్లను.. సుప్రీంకోర్టు వద్దని చెప్పినా.. మహారాష్ట్ర పెట్టింది. దాంతో ఆ ప్రాజెక్ట్ వద్దకు.. చంద్రబాబు ఎమ్మెల్యేలతో బయలుదేరారు. మహారాష్ట్ర బోర్డర్ జిల్లా నాందేడ్‌లోని ధర్మాబాద్ చేరుకునేసరికి అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. బాబ్లీ ప్రాజెక్ట్‌ను చూస్తామని.. చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. అయితే… పోలీసులు ఎమ్మెల్యేలపై లాఠీచార్జ్ చేసి.. ఓ కాలేజీకి తీసుకెళ్లి నిర్బంధించారు. కేసులు పెట్టారు. బెయిల్ తీసుకుని వెళ్లిపోమని.. అక్కడి పోలీసులు సూచించారు. కానీ ఎవరూ బెయిల్ తీసుకోలేదు. చివరికి వాళ్లే బలవంతంగా విమానం ఎక్కించి పంపించేశారు. అక్కడి పోలీసులు బలవంతంగా వాళ్లే పంపిచేసి.. ఇప్పుడు మళ్లీ వారెంట్ పేరుతో.. కొత్త గేమ్ ప్రారంభించారు.
నిజానికి ఈ కేసు ఎలా మళ్లీ బయటకు వచ్చిందో.. ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉంది. కొన్నాళ్ల క్రితం.. ఓ వ్యక్తి మహారాష్ట్ర కోర్టులో పిటిషన్ వేశాడు. చంద్రబాబు అండ్ కో.. ఆందోళన చేసిన కేసులో.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ పిటిషన్ సారాంశం. దానిపై పోలీసులకు కోర్టు వరుసగా నోటీసులు జారీ చేస్తూ ఉంది. అది టీడీపీ నేతలెవరికీ తెలిసినట్లు లేదు. ఎనిమిది నెలల కిందట.. కోర్టు వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచీ ఈ వారెంట్ పెండింగ్ లో ఉంది. మళ్లీ పిటిషన్ వేసిన వ్యక్తి పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని.. కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు వారెంట్ ఎందుకు అమలు జరపడంలేదని పోలీసులను ప్రశ్నించింది. దీంతో .. బయటకు వచ్చింది. ఈ అంశంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం అందింది. ఎలా వ్యవహరించాలన్నదానిపై ప్రభుత్వం న్యాయపరమైన సలహాలు తీసుకుంటోంది.
ధర్మాబాద్ కోర్టుకు చంద్రబాబు హాజరవుతారా..?
ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిపై… ఇతర రాష్ట్రంలోని నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం.. ఇటీవలి కాలంలో జరిగి ఉండదమో..?. నేరుగా… చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేస్ అని చెప్పి మరీ వారెంట్‌ను జారీ చేశారు. ఇదేమంత పెద్ద కేసా..? రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద.. ఇలా 144 సెక్షన్ ను అధిగమించడం.. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ముందుకెళ్లడం లాంటి కేసులు పదుల సంఖ్యలో ఉంటాయి. అలాంటిది ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునే … టార్గెట్ చేసి… ఇప్పుడు నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేయించడానికి కారణం ఏమిటి..?. కోర్టుకు చంద్రబాబు హాజరవుతారా..?
హెచ్‌సీఎల్ స్టేట్ స్ట్రీట్ కంపెనీ ప్రారంభోత్సవ సమయంలో… మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు.. మంత్రి లోకేష్… ధర్మాబాద్ కోర్టు నోటీసులపై స్పందించారు. మరాఠీ పత్రికల్లో వచ్చిన వార్తల నేపధ్యంలో..ఆయనను మీడియా ప్రశ్నించడంతో కోర్టు నోటీసులు అంటూ వస్తే.. చంద్రబాబు కచ్చితంగా కోర్టుకు హాజరవుతారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు కూడా… దీన్ని జాతీయ అంశంగా మార్చాలంటే… కచ్చితంగా కోర్టుకు హాజరయితనే మంచిదని భావిస్తున్నారు. కేంద్రానికి ఎదురు తిరిగినందుకు.. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా.. ఓ చిన్న కేసులో.. కోర్టుకు లాగే ప్రయత్నం చేస్తున్నారని.. అదీ కూడా.. ప్రత్యేకమైన ఎజెండా పెట్టుకుని..ఈ పని చేస్తున్నట్లు జాతీయ స్థాయిలో ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనే భావనలో.. తెలుగుదేశం పార్టీ వ్యూహకర్తలు ఉన్నారు. దీనిపై ఎలాంటి వ్యూహం అమలు చేయాలన్నదానిపై… అగ్రనేతలు మంతనాలు జరుపుతున్నారు.
చంద్రబాబు ధర్మాబాద్ కోర్టుకు హాజరవ్వాలని నిర్ణయించుకుంటే మాత్రం .. అది కచ్చితంగా జాతీయ అంశం అవుతుంది. జాతీయ మీడియాఅంతా.. ఆ రోజు అక్కడే కొలువు దీరే అవకాశం ఉంది. ఎందుకంటే.. చంద్రబాబుకు జారీ అయిన నాన్ బెయిలబుల్ వారంట్ కేసులో.. ఎనిమిదేళ్లుగా కదలిక లేదు. ఇప్పుడు హఠాత్తుగా.. ఎందుకు వారెంట్ జారీ చేయాల్సి వచ్చిందనేది ప్రధానంగా అందిరకీ వచ్చే సందేహం. ఈ విషయంలో తనకు మద్దతుగా నిలబడే ఇతర పార్టీల నేతల్ని కూడా చంద్రబాబు సంప్రదించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. జాతీయ దర్యాప్తు సంస్థల్ని ఉపయోగించుకుని… రాజకీయ ప్రత్యర్థుల్ని వేటాడుతున్నారనే అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నాయి. దీన్ని మరింత బలంగా.. ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇదో గొప్ప అవకాశంగా ఉపయోగించుకునేలా.. చంద్రబాబు ధర్మాబాద్ కోర్టుకు హాజరయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.