తెలుగు రాష్ట్రాల్లోని మెట్రోపాలిటన్ సిటీల్లో ప్రేక్షకులకు హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ సుపరిచితుడే! సల్మాన్‌ఖాన్ ‘భజరంగీ భాయిజాన్’, ‘కిక్’ వంటి సినిమాల్లో ఇతను నటించాడు. అంతకు ముందు ‘గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్’, ‘బద్లాపూర్’ వంటి సినిమాల్లో మెప్పించాడు. లేటెస్టుగా వెబ్ సిరీస్ ‘సెక్రేడ్ గేమ్స్’లో నటించాడు. ఒకానోక సమయంలో ఇతను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ బయోపిక్‌లో కేసీయార్గా నటించే అవకాశాలు వున్నాయని ప్రచారం జరిగింది. కేసీయార్ జీవితం మీద దర్శక నిర్మాత ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి ఓ సినిమా తీయాలనుకున్నారు. కేసీయార్ పాత్రకు నవాజుద్దీన్ సిద్దీఖీని తీసుకోవాలని అనుకుంటున్నట్టు లీకులు ఇచ్చారు. హైదరాబాద్ వచ్చిన అతణ్ణి ఈ విషయమై ప్రశ్నించగా… తనకు అటువంటి ప్రతిపాదన ఏదీ రాలేదన్నారు. కేసీయార్ తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం పోరాటం చేసిన నాయకుడని, అవకాశం వస్తే ఆయన బయోపిక్ తప్పకుండా చేస్తానని తెలిపాడు.