పచ్చకామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని ఒక సామెత ఉంది! సాక్షి పరిస్థితి కూడా దాదాపు అలానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మహారాష్ట్ర కోర్టు నుంచి సమన్లు రావడంపై ఓ కథనం ప్రచురించింది. ‘బాబు బాబ్లీ డ్రామా’ అంటూ కేసు, వారెంట్లు, విచారణ, అక్యూజ్డ్ వన్… ఇలా వీటి చుట్టూ మాత్రమే ఆ కథనం అల్లుకుంది! విచారణకు పలుమార్లు గైర్హాజరు అయ్యారంటూ మొదలుపెట్టారు. కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కాకపోవడంతోనే చంద్రబాబుకి నోటీసులు ఇచ్చారన్నారు. ఈ వ్యాఖ్యానాల మధ్య సాక్షి వినిపిస్తున్నది ఏంటయ్యా అంటే… వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావడం అనేది చాలా మంచిపనీ అని!
ఈ కథనంలో మరో యాంగిల్… భాజపా తీరును వెనకేసుకొస్తూ, ఆ పార్టీ తరఫున వివరణ ఇస్తున్నట్టుగా ఉండటం! వారెంట్ పై మాట్లాడం మానేసి, ప్రధానమంత్రిపై టీడీపీవారు విమర్శలకు దిగుతూ ఉండటం సరికాదన్నట్టు రాశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆందోళనలు చేసే నాయకులపై ఇలాంటి కేసులు సర్వసాధారణమన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తుంటే… చాలా కేసులు పెట్టారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి కేసులు ఉన్నాయన్నారు. అయితే, నోటీసులు అందుకున్నవారంతా కోర్టులకు వెళ్లారని చెప్పుకొచ్చారు. ఈ కేసు నేపథ్యంలో సానుభూతి కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని విశ్లేషించారు.
ఈ కథనంలో చాలా కంఫర్టుగా అసలు విషయాలను సాక్షి వదిలేసింది! ఒకటీ… ఈ కేసు అంత తీవ్రమైనదే అయితే, ఛార్జి షీటు దాఖలైన నాలుగేళ్ల తరువాత ఇప్పుడే ఎందుకు నోటీసులు ఇచ్చినట్టు..? ఈ ప్రయత్నమేదో ఇన్నాళ్లూ ఎందుకు చెయ్యనట్టు..? బాబ్లీ కేసు ఏమైందని ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించడం ద్వారా ఇప్పుడీ నోటీసులు ఇచ్చారు అంటున్నారు. అంటే, న్యాయ వ్యవస్థ తీరును ఎవ్వరూ తప్పుబట్టడం లేదు. వాస్తవానికి, ఇది ఒక పెట్టీ కేసు. లక్షల కోట్ల అవినీతి జరిగిపోయిందనో, ఇంకేదో భారీ నష్టం వాటిల్లిందనో కాదు కదా! ఈ విషయాన్ని సాక్షి ప్రస్థావించలేదు. ఇప్పుడు కేసు తీవ్రతపై ఎక్కడా చర్చ జరగడం లేదు. ఇన్నాళ్లూ లేనిది, ఇప్పుడే ఎందుకింత తీవ్రంగా స్పందిస్తున్నారూ అనే చర్చే జరుగుతోంది. సాక్షికి ఇది ప్రధానాంశంగా కనిపించలేదు!
అక్యూజ్డ్ వన్, కోర్టు హాజరు కావాలి, విచారణకు సహకరించాలి… ఇలాంటి పదాలకే ప్రాధాన్యత ఇస్తూ రాశారు. తాజా నోటీసుల నేపథ్యంలో ఈ కేసును సానుభూతి కోసం టీడీపీ ఎంతగా వినియోగించుకుంటుందో తెలీదుగానీ… సాక్షి మాత్రం బాగానే వినియోగించుకుంటోందని అనిపిస్తోంది. ప్రతీ శుక్రవారం జగన్ కోర్టుకి వెళ్లడం, ఆయనపై ఉన్న కేసులు… ఇవన్నీ సర్వసాధారణమైన అంశంగా చెప్పే ప్రయత్నం అంతర్లీనంగా మొదలుపెట్టేసిందని ప్రజలకు అర్థం కాకుండా ఉంటుందా..? బాబ్లీ కేసు నేపథ్యంలో వాటి తీవ్రతను తగ్గించుకునే ప్రయత్నం చేస్తోందనీ అనిపిస్తోంది.