లేడిపై పులి దాడి చేస్తుంది గానీ… ఎక్కడైనా, ఎప్పుడైనా పులిపై లేడి పడుతుందా? ఇటువంటి పద ప్రయోగం చేయడానికి ఎంతమంది రచయితలు సాహసిస్తారు? ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి తప్ప! ఒకవేళ రచయిత ప్రయోగం చేసినా…. ఎంతమంది దర్శకులు దాన్ని ఆమోదించే సాహసం చేస్తారు? త్రివిక్రమ్ శ్రీనివాస్ తప్ప! యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి మాస్ హీరో ఇమేజ్‌కి తగ్గట్టు ‘చీకటిలాంటి పగటిపూట… కత్తులాంటి పూలతోట!’ అంటూ పాటను ప్రారంభించిన సిరివెన్నెల… దర్శకుడు త్రివిక్రమ్ అభిరుచికి తగ్గట్టు ‘జరిగిందొక్క వింత వేట… పులిపై పడిన లేడి కథ వింటారా?’ అని వెనువెంటనే వినిపించారు. ఈ సాహిత్యం ఇంతిలా ప్రేక్షకులకు చేరువ కావడానికి ముఖ్య కారణం ఎస్.ఎస్. తమన్ సంగీతమందించిన బాణీ! ఈ మెలోడియస్ బాణీ విన్న వెంటనే ప్రేక్షకులు ప్రేమలో పడతారు. సాంగులో ఇన్స్ట్రుమెంటేషన్ చాలా బావుంది. ఎన్టీఆర్ చేత కత్తి పట్టించి… ఆరు పలకల దేహంతో రౌడీ మూకల వెంట పరిగెట్టించి… మాసీగా టీజర్ కట్ చేసిన త్రివిక్రమ్, మాంచి మెలోడీని ముందుగా విడుదల చేశారు. పాటలో సాహిత్య పరిమళాలు పౌర్ణమి వెన్నెల వలే వెలిగింది. త్రివిక్రమ్ అభిరుచి కనిపించింది. రెగ్యులర్ ఎన్టీఆర్ పాటలకు భిన్నంగా సాగిందీ మెలోడీ!! ‘తొలిప్రేమ’ తరవాత మరోసారి తమన్ క్లాసీ మెలోడీతో ప్రేక్షకుల మనసు దోచారు.