మహబూబ్ నగర్ సభలో బహిరంగ సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ… దేశంలోని పంతొమ్మిది రాష్ట్రాలు భాజపా నేతృత్వంలో అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయనీ, ఆ జాబితాలో తెలంగాణా చేరాలా వద్దా అని ప్రజలను ప్రశ్నించారు. ఒకే దేశం ఒకే ఎన్నికల నినాదంలో ప్రధాని మోడీ ప్రయత్నించారనీ, కానీ లోక్ సభ కంటే ముందుగా అసెంబ్లీ ఎన్నికలకు కేసీఆర్ వెళ్తూ ఖర్చు పెంచారని అమిత్ షా అభిప్రాయపడ్డారు. మేలో ఎన్నికలు జరిగితే మరోసారి గెలుస్తామనే నమ్మకం కేసీఆర్ కి లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ విమోచన దినాన్ని కేసీఆర్ ఎందుకు జరపడం లేదనీ, ఒవైసీకి భయపడుతున్నారని అన్నారు. విమోచన దినాన్ని జరపడానికి భయపడే కేసీఆర్, ఇక తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఎలా కాపాడగలరన్నారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఇతర అణగారిన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.
దేశంలో చొరబాటుదారులు పెరిగిపోయారనీ, ఎన్.ఆర్.సి.లను సరిహద్దులు బయటకి పంపించాలన్నది తమ సంకల్పమని అమిత్ షా అన్నారు. హైదరాబాద్, నిజామాబాద్ లలో కూడా చాలామంది అలాంటివారున్నారనీ, వారిని ఓటర్ల జాబితా నుంచి తప్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో నిధులు వస్తుంటే… వాటిని తమ గొప్పగా కేసీఆర్ చెప్పుకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర పథకాలను యథాతథంగా అమలు చేస్తే… ఆ ఘనత మోడీకి దక్కుతుందనే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరించారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడ్డాక దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పిన కేసీఆర్, వారికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. రైతుల, దళితులు, మహిళలపై రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయనీ… భాజపా సర్కారు అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం జరుగుతుందన్నారు.
ఇక, కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ… తెలంగాణలో అధికారంలోకి వస్తామని రాహుల్ గాంధీ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. మోడీ ప్రధాని అయిన తరువాత ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ దుకాణం మూసేస్తోందనీ, భాజపా గెలుస్తూ ఉందని అమిత్ షా చెప్పారు. మోడీ ఎక్కడికి వస్తే అక్కడ కాంగ్రెస్ పోవడం ఖాయమన్నారు. దేశ భద్రతను కాపాడటం కోసమే మోడీజీ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించారనీ, సరిహద్దుల్లో శతృవుల ఆటకట్టించి, భారతమాతకు సేవల చేశారని మెచ్చుకున్నారు! దేశాన్ని అన్ని రకాలుగా రక్షించి, రాష్ట్రాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయగలిగే మోడీ ప్రభుత్వం మరోసారి రావాలా వద్దా అని ప్రజలను ప్రశ్నించారు..?
మొత్తానికి, అన్ని రకాల సెంటిమెంట్లను తెలంగాణలో వాడేసే ప్రయత్నం చేశారు అమిత్ షా! మతం, కులం, ప్రాంతం మొదలుకొని దేశ సరిహద్దుల వరకూ అన్ని అంశాలనూ ప్రస్థావించే ప్రయత్నం చేశారు. విచిత్రం ఏంటంటే… కేంద్ర పథకాలు ఏ ఒక్కటీ కేసీఆర్ అమలు చేయలేదని గడచిన నాలుగున్నరేళ్లలో ఎప్పుడూ భాజపా ఇలా మాట్లాడలేదే మరీ..? అసెంబ్లీ రద్దు చేయడానికి కొన్ని రోజుల ముందు, ఢిల్లీలో కేసీఆర్ హడావుడి చేస్తున్నప్పుడు కూడా ఇవేవీ గుర్తుకు రాలేదా..? ఏపీ సీఎం చంద్రబాబుతో పోల్చుతూ కేసీఆర్ ని ప్రధాని పార్లమెంటులో మెచ్చుకున్నప్పుడు ఇవేవీ గుర్తులేవా..? ఇప్పుడు అమిత్ షా వచ్చి, తమ పోరాటం తెరాసతోనే అంటూ శంఖారావం పూరించడం.. విచిత్రమే…! ఓవరాల్ గా అమిత్ షా ప్రసంగం సోసోగానే సాగింది. మరి, దీని ప్రభావం భాజపా శ్రేణులపై ఎంత తీవ్రంగా ఉంటుందో, తెరాసతో ధీటుగా పోరాటం చేసేందుకు ఎంతవరకూ ఉత్సాహాన్నిస్తుందో అనేది వేచి చూద్దాం.