తన చుట్టూ లాలూచీ రాజకీయాలు, కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో జరిగిన జలసిరికి హారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబ్లీ గురించి మాట్లాడుతూ… 2010లో బాబ్లీకి వెళ్లాననీ, ఆ ప్రాజెక్టు వల్ల మొత్తం ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందనీ, ఆరు జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళన జరిగిందన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడిగా గట్టిగా డిమాండ్ చేశాననీ, అసెంబ్లీలో పోరాటం చేశామనీ, ఆ తరువాత బాబ్లీ చూడ్డానికి తాము వెళ్లామన్నారు. ఆరోజున మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి, నానా ఇబ్బందులూ పెట్టారనీ, ఆంధ్రాలో స్పందన చూసి భయపడి, ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లో తీసుకొచ్చి వదిలేశారన్నారు.
2010లో జరిగిన దానికి ఇప్పుడు అరెస్టు వారెంట్ పంపించారనీ, ఈ లింకులన్నీ చూస్తుంటే ఏం కుట్రలో తనకు అర్థం కావడం లేదని సీఎం వ్యాఖ్యానించడం గమనార్హం! ‘నాకు కుట్రలూ కుతంత్రాలూ తెలీవు. తప్పుంటే తప్పుని చెప్తా. ఎవరైనా సరే అన్యాయం చేస్తే రాజీలేని పోరాటం చేస్తా’ అన్నారు. ఎనిమిదేళ్ల కిందటి కేసును ఇప్పుడు తిరగతోడితే… మీ ప్రభుత్వంలో మీకు తెలీదా అంటూ భాజపాని ప్రశ్నించారు. ప్రధానికి వ్యతిరేకంగా ఎవ్వరూ మాట్లాడకూడదనీ, మాట్లాడితే ఇలాంటి తప్పుడు కేసులు పెడతామంటే భయపడేది లేదన్నారు.
ప్రతిపక్ష నేతను ఉద్దేశించి మాట్లాడుతూ… బీజేపీతో కలిసి నాటకాలాడుతున్నారనీ, ఈరోజున ఓ సర్వే చేయించుకున్నారనీ, ఆ నాయకుడు పెద్ద ఉద్ధరిస్తారనీ, ఓట్లన్నీ ఆయనకి పడిపోతాయని రాయించుకున్నారన్నారు! ఏం చేశారూ ఏం అనుభవం ఉంది మీకూ అని అడుగుతున్నా అని ప్రశ్నించారు సీఎం. ఎప్పుడన్నా ఏమైనా చేశారా, ఎక్కడైనా చేసిన చరిత్ర ఉందా, తండ్రిని అడ్డం పెట్టుకుని దొంగ లెక్కలు రాసి అడ్డంగా దొరికిపోయారే తప్ప, ఇప్పుడు ఏమీ చెయ్యలేరని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మాటలు చెప్పడం చాలా సులువనీ, పనులు చేసి చూపించడం చాలా కష్టం అంటూ వ్యాఖ్యానించారు.
బాబ్లీ పోరాటానికి సంబంధించి జారీ అయిన సమన్లు రాజకీయ కుట్రలో భాగమేననీ, భాజపా కుట్రలో భాగమే అన్నట్టుగానే చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ఏదో కుట్ర జరుగుతోందన్న ఆందోళన కూడా సీఎం మాటల్లో చాలా స్పష్టంగా వ్యక్తమవడం గమనార్హం. ఇక, జగన్ విషయానికొస్తే… అనుభవాన్ని ప్రశ్నిస్తూనే, ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న రాష్ట్రానికి మరోసారి టీడీపీ నాయకత్వం అవసరం అనే అంశాన్ని చెప్పే ప్రయత్నం చేశారు.