వంద సీట్లలో గెలవడం ఖాయమని సీఎం కేసీఆర్ ఎప్పట్నుంచో చెబుతున్న సంగతి తెలిసిందే! అది కూడా అత్యంత సునాయాసంగా గెలుచుకుని తీరతామని చాలా ధీమాగా చెబుతూ ఉంటారు. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఈ 100 నంబరే తలనొప్పిగా మారబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ గెలవడం ఖాయమనీ, కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలోకి రాబోతున్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, తెరాసకు ధీటుగా వంద సీట్లు సాధిస్తామని ప్రచారం చేసుకునే పరిస్థితి ఇప్పుడు టి. కాంగ్రెస్ నేతలకు లేకుండా పోతుందా అనేదే చర్చ! ఢిల్లీ వెళ్లొచ్చిన టి. కాంగ్రెస్ సీనియర్ల మధ్య ఇదే చర్చ తాజాగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
మహా కూటమిలో వివిధ పార్టీలతో కలిసి పోటీ చేసేందుకు అధ్యక్షుడు రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, పొత్తులో భాగంగా కాంగ్రెస్ గెలిచే స్థానాలను మాత్రం వదులుకోవద్దని చెప్పారు కదా! దాంతోపాటు, తెలంగాణలో కాంగ్రెస్ 100 స్థానాల్లో పోటీ చేయాలని కూడా చెప్పారు. గతం కంటే తెలంగాణలో పార్టీ పరిస్థితి బాగుందనీ, కాబట్టి ఆ నంబర్ కి తగ్గకుండా కాంగ్రెస్ సొంత అభ్యర్థులు ఉండాలనేది హై కమాండ్ సలహా! ఇదే ఇప్పుడు కాంగ్రెస్ కి సమస్యగా మారుతోంది. పొత్తులో భాగంగా కొన్ని సీట్లు వదులుకోవాలి. రాష్ట్రంలో ఉన్నవే 119 అసెంబ్లీ స్థానాలు. మహాకూటమిలో భాగంగా ఇతర పార్టీలకు సీట్లు ఇవ్వాలి కదా! నిజానికి, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలంటే కాంగ్రెస్ 61 స్థానాలు దక్కినా సరిపోతుంది.
తెలంగాణ జన సమితి అధినేత కోదండరామ్ కనీసం ఓ డజను సీట్లు ఆశిస్తున్నారు! సీపీఎం ఓ అరడజను సీట్లపై కన్నేసింది. తెలుగుదేశం పార్టీ కనీసం ఓ పాతిక స్థానాల్లోనైనా పోటీ పడాలని భావిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో టిక్కెట్లు బాగానే ఆశిస్తోంది. ఇక్కడికే లెక్క 40 దాటేసింది. అంటే, ఎటొచ్చీ కాంగ్రెస్ ఎంత పట్టుబట్టినా మహా అయితే దాదాపుగా 80 స్థానాలకు మించి సొంతంగా పోటీ చేయగలిగే పరిస్థితి కనిపించడం లేదు. ఈ లెక్కన రాహుల్ సూచించినట్టు వంద సీట్లలో పోటీ చెయ్యాలంటే టి. కాంగ్రెస్ కు సాధ్యమయ్యే పనేనా..? మహా కూటమి నుంచి బయటకి వచ్చేస్తే సొంతంగా అన్నిచోట్లా పోటీకి దిగే అవకాశం ఉంటుంది. కానీ, ఆ పరిస్థితి ఉండదు. కూటమితో ముందుకెళ్లాల్సిన అవసరం కాంగ్రెస్ కి ఉంది. సరే, పరిస్థితి ఇలా ఉంది కాబట్టి… రాహుల్ కి వివరించి చెప్పుకోవచ్చు. కానీ, వంద సీట్లలో పోటీ చేయలేని కాంగ్రెస్ పరిస్థితిపై తెరాస విమర్శలు చేసే అవకాశం ఉంటుంది.