ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తెరాస కొత్త ఆరోపణకు దిగుతోంది..! ఎన్నికలు దగ్గర పడుతుండటంతో… రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు నిఘా వేయించారని తెరాస నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ నర్సింహన్, డీజీపీ మహేందర్ రెడ్డిని కోరుతున్నారు. తెలంగాణలో దొడ్డిదారిన రాజకీయాలు చెయ్యాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనీ, ఈ రాష్ట్రంలో వారికి ఇలాంటి పనెందుకు అంటూ తెరాస నేతలు బాల్క సుమన్, గట్టు రామచంద్రరావులు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్ లో ఉన్న ఏపీ డీజీపీ ఆఫీస్ ద్వారా ఇక్కడి రాజకీయ పరిస్థితిపై చంద్రబాబు నిఘా పెట్టించారన్నది వారి ఆరోపణ! తెలంగాణలో రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు ఈ కార్యాలయం నివేదికల రూపంలో చంద్రబాబుకు అందజేస్తోందని బాల్క సుమన్ అంటున్నారు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిని సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనీ, అందుకే తాజాగా నిఘా వర్గాలతో ఈ రాష్ట్రంలో సర్వేలు కూడా చేయించారని ఆరోపిస్తున్నారు. ఇదే అంశమై డీజీపీకి, గవర్నర్ కు ఫిర్యాదులు చేశామనీ, వారు స్పందించకపోతే తెరాస కార్యకర్తలు పోరాటం చేస్తారన్నారు! హైదరాబాద్ లో ఉన్న ఏపీ డీజీపీ ఆఫీస్ ఇలాంటి పనులు మానుకోవాలనీ, వెంటనే వారిని ఆంధ్రాకి పంపించాలని తెరాస నేతలు డిమాండ్ చేశారు.
వీటికి ధీటుగా టీడీపీ కూడా ఘాటుగానే స్పందించింది. తెలంగాణలో తెలుగుదేశం పనైపోయిందని కేసీఆర్ స్వయంగా చెబుతుంటారనీ, అలాంటప్పుడు తమ గురించి బెంగపడాల్సిన అవసరం ఏముందని టీడీపీ నేతలు తిప్పి కొట్టారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు కొనసాగుతుందని విభజన చట్టంలో ఉందనీ, రెండు రాష్ట్రాల మధ్యా జరగాల్సిన పంపకాలు చాలా ఉన్నాయనీ, ఉమ్మడి రాజధానితో తమ కార్యాలయాలు ఉండకూడదని చెప్పడం సరికాదంటూ అధికార ప్రతినిధి దినకర్ అన్నారు.
నిజానికి, తెలంగాణ రాజకీయ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు అనూహ్యమైన పాత్ర పోషించేస్తాం అని టీడీపీ నాయకులే అనుకోవడం లేదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఉనికి నిలుపుకుంటే చాలు అనుకుంటున్నారు. ఓ పాతిక సీట్లు వచ్చినా చాలన్నట్టుగానే ఆ పార్టీ వ్యూహం కనిపిస్తోంది. అలాంటప్పుడు, ఎప్పటికప్పుడు నిఘా పెట్టించి మరీ నివేదికలు తెప్పించుకోవాల్సిన అవసరం ఏముంటుంది..? ఇలాంటి ఆరోపణలు ద్వారా ప్రత్యేకంగా తెరాస సాధించేదేమీ ఉండదు. ఇలా ప్రాంతాలూ హక్కులూ అనే నినాదాలను మళ్లీ బయటకి తీయడం వల్ల అన్ని వర్గాలనూ ఆకర్షించాలన్న తెరాస లక్ష్యానికి వారే అడ్డంకులు స్రుష్టించుకున్నట్టు అవుతుంది కదా!