తెలంగాణలో మహాకూటమి ఏర్పడబోంది. ఈ కూటమిలో కాంగ్రెస్, టీడీపీ ఉంటున్నాయి. దీంతో వివిధ రాజకీయ పార్టీలు కాంగ్రెస్, టీడీపీ పొత్తులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నైతికంగా ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు మాత్రమే కాదు.. చివరికి మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ కూడా.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీతో ఎలా కలుస్తారని విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ కూడా..కాంగ్రెస్‌తో టీడీపీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ దేశంలో ఏ పొత్తు నైతికం..? ఏ పొత్తు అనైతికం..? ముందు ఏది నైతికమో తెలిస్తే.. అనైతికమో కాదో తర్వాత తేల్చుకోవచ్చు..!
ఏ పొత్తుల్లో నైతికత ఉంది..?
భారత దేశ రాజకీయ రాజకీయ వ్యవస్థలో… రాజకీయ పార్టీల మధ్య పొత్తులు.. నైతికం అంటే.. నైతికం.. అనైతికం అంటే అనైతికం.. అవకాశ వాదం అంటే.. అవకాశవాదం… అంతే. మనం ఎలా చూస్తే పొత్తులు ఉంటాయి. 2004లో టీఆర్ఎస్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. సమైక్యవాద పార్టీ అయిన సీపీఎంతో కలిసి మహాకూటమిలో ఉంది. ఫలితాలు రాక ముందే.. వెళ్లి కేసీఆర్ ఎన్డీఏలో కలిసేందుకు ప్రయత్నించారు. ఇది నైతికమా..? అనైతికమా..? అంతకు ముందు టీడీపీ.. బీజేపీతో పొత్తు పెట్టుకుంది.. వామపక్షాలతో పొత్తు పెట్టుకుంది. మధ్యలో గోద్రా అల్లర్లు జరిగినప్పుడు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించారు. 2009లో బీజేపీతో మళ్లీ కలవబోమని చెప్పి విడిపోయారు. 2014లో మళ్లీ పొత్తు పెట్టుకున్నారు. ఈ రాజకీయాలను చూస్తే..ఏ పొత్తలోనైనా అనైతికం ఉంటుందా..?
దేశంలో పార్టీల పొత్తుల్లో సిద్ధాంతం ఉందా..?
ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశం మొత్తం చూసినా.. అలాంటి పొత్తులే ఉన్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ పోటీ పడ్డాయి. ఒకరినొకరు.. తిట్టుకున్నారు. ఎన్నికల తర్వాత రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇక తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు.. ఎవరితో ఎవరు కాపురం చేస్తారో తెలియదు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మాయావతి ఒకప్పుడు వాజ్ పేయి కేబినెట్లో మంత్రి. ఇప్పుడు బీజేపీని వ్యతిరేకిస్తున్న అతిపెద్ద పార్టీల్లో ఒకరు. అలాగే.. బీహార్‌లో జేడీయూ. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిచారని.. కూటమి నుంచి వెళ్లిపోయి… కాంగ్రెస్ తో జట్టుకట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మళ్లీ ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఈ పొత్తులు నైతికమా..? బీజేపీ, పీడీపీ పొత్తు కశ్మీర్లో నైతికమా..? ఈ రెండు పార్టీలవి..కశ్మీర్ విషయంలో పూర్తి పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలు. ఈ పొత్తుల్లో ఏదైనా నైతికం ఏదైనా ఉందా..? 2004లో లెఫ్ట్ పార్టీలు.. గెలిచిన 60కిపైగా సీట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపైనే గెలిచారు. అయినా యూపీఏ -1కి కాంగ్రెస్‌కి మద్దతిచ్చారు. వీపీ సింగ్ ప్రభుత్వానికి బీజేపీతో పాటు.. లెఫ్ట్ కూడా మద్దతిచ్చాయి. ఇవన్ని నైతికమా..? అనైతికమా..?
రాజకీయ ప్రయోజనాల కోసమే పొత్తులు పెట్టుకుంటారా..?
ఒక నిర్దిష్టమైన రాజకీయ ప్రయోజానాన్ని ప్రకటించి…ఆ రాజకీయ ప్రయోజనం కోసం పొత్తులు పెట్టుకోవడం వ్యూహాత్మకమవుతోంది. ఏ రాజకీయ ప్రయోజనం లేకపోయినా… ఎవరు ఎక్కువ సీట్లు ఇస్తే..వారితో పొత్తు పెట్టుకుంటామనే రాజకీయపార్టీలను కూడా మనం చూస్తున్నాం. నిర్దిష్ట రాజకీయ ప్రయోజనం ప్రకటించకుండా.. ఇష్టం వచ్చినట్లు పొత్తులు పెట్టుకుంటే.. అవకాశవాదం అంటారు. ఓ నిర్దిష్టమైన రాజకీయ ప్రయోజనం ప్రకటించి.. అంటే… తెలంగాణ కోసం అంటూ టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం, బీజేపీని అధికారంలోకి రాకుండా చేసేందుకే కాంగ్రెస్‌కు మద్దతిచ్చామని లెఫ్ట్ చెప్పుకోవడం, రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని మళ్లీ గెలకుండా చేయడానికే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని టీడీపీ చెప్పడం.. ఓ రకంగా.. రూల్స్ ప్రకారం ఉన్నట్లే. అది అవకాశవాదం కాదా..అంటే అవకాశవాదమే. రాజకీయాల్లో అవకాశవాదం లేదని చెప్పడం సాధ్యం కాదు. ఆ మాటకొస్తే.. ఏ పార్టీలో అయనా పార్టీ మారని నేతలు ఉన్నారా..? ఎక్కడ అవకాశం వస్తే.. ఆ పార్టీలోకి వెళ్తున్నారు. తెలంగాణ వాదులపై.. తుపాకులు ఎక్కుపెట్టిన వారు.. తెలంగాణ ఉద్యమ పార్టీల్లో లేరా..? ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారు మంత్రులుగా లేరా..?. అందువల్ల రాజకీయాల్లో నైతికమా..? అనైతికమా..? అనేది ఏదీ లేదు. రాజకీయ పార్టీలు.. తాము ఓ రాజకీయ ప్రయోజనం కోసం పొత్తు పెట్టుకోవడం సహజం. అది నైతికమా.. అనైతికమా..అవకాశవాదమా.. అన్నది విషయం కాదు.
బీజేపీకి వంగి ఉండటం ఢిల్లీకి మోకరిల్లడం కాదా..?
తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడిన పార్టీలో ఢిల్లీ ముందు మోకరిల్లుతుందా.. అని విమర్శలు చేస్తున్నార. ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ ఎక్కడుంది..?. మళ్లీ కాంగ్రెస్ వస్తుందన్న గ్యారంటీ లేదు. అలాంటప్పుడు.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం.. ఢిల్లీ ముందు మోకరిల్లడం ఎలా అవుతుంది..?. ఇవాళ ఢిల్లీలో ఉన్నది బీజేపీ. మళ్లీ బీజేపీ వస్తుందని కూడా కొంత మంది చెబుతున్నారు. అలాంటప్పుడు.. బీజేపీతో పోరాటం.. కాంగ్రెస్ ముందు మోకరిల్లడం అవుతుందా..?. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే గులాంగిరీ అవుతుంది. నిజానికి.. ఢిల్లీతో కేసీఆర్ సత్సంబంధాలు నిర్వహిస్తున్నారు. మోడీని వ్యతికేరిస్తామని… కేసీఆర్ ఎక్కడా చెప్పడం లేదు. అలాగే తెలంగాణ వద్దన్న ఓవైసీతో… టీఆర్ఎస్ అవగాహనకు రావడం నైతికమవుతుందా..?.
రాజకీయ పొత్తుల్లో వాస్తవాలను అంగీకరించాల్సిందే..!
అందుకే పొత్తులపై రాజకీయ పార్టీలకు ఓ అవగాహన ఉండాలి. రాజకీయ పార్టీలు .. వారి వారి అవసరాల మేరకే పొత్తులు పెట్టుకుంటారు. ఇవాళ మారిన పరిస్థితుల్లో ఏపీలో అసలు కాంగ్రెస్ పార్టీలో ఉనికి లేదు. అంటే టీడీపీకి ప్రధాన శత్రువు కాదు. తన ప్రధాన శత్రువును ఓడించడానికి… ఇతరులను కలుపుకోవడం.. సహజంగా జరిగే ప్రక్రియ తెలంగాణలో టీడీపీకి ప్రధానశత్రువు టీఆర్ఎస్ , కాంగ్రెస్ కి కూటా టీఆర్ఎస్సే. అందుకే.. మహాకూటమిగా ఏర్పడే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో పూర్తిగా.. ఎలక్టోరల్ అర్థమెటికే తప్ప.. సిద్ధాంతాలు లేవు.. రాద్ధాంతాలు లేవు. ఇవే పొత్తులు ఉంటాయని…చెప్పలేం. రాజకీయాల్లో నైతికత్వం గురించి.. విలువల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే.. అంత మేలు. రాజకీయాల్లో గెలుపే.. అంతిమ లక్ష్యం…! అంటే.. ఈ పొత్తుల రాజకీయాలను.. విలువల్లేని రాజకీయాలను అంగీకరించడం కాదు. వాస్తవాలు మాత్రమే చెప్పుకుంటున్నాం.