విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నాయి. విజయవాడ సిటీలోటిక్కెట్ ఇచ్చేది లేదని… వైసీపీ నేతలు.. వంగవీటి రాధకు తేల్చి చెప్పారు. విజయవాడ సెంట్రల్ సీటు నుంచి పోటీ చేయడానికి.. .వంగవీటి రాధా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ అక్కడ మల్లాది విష్ణును నిలబెట్టాలని.. జగన్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు.. గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని… మల్లాది విష్ణునే చేపట్టాలని.. జగన్ ఆదేశించారు. జోక్యం చేసుకోవద్దని వంగవీటి రాధాకు తేల్చి చెప్పారు. దీంతో ఆయన… అంతర్గతంగా జరిగిన సమావేశం నుంచి.. అర్థాంతరంగా కోపంగా వెళ్లిపోయారు. కృష్ణా జిల్లాకు వైసీపీ తరపున ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న పెద్దెరెడ్డి రామచంద్రారెడ్డి… వంగవీటి రాధకు సర్ది చెప్పాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. మచిలీపట్నం పార్లమెంట్ సీటు ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని.. ఆవేశపడవద్దని కోరినా… సమావేశం నుంచి వరంగవీటి రాధ బయటకు వెళ్లిపోయారు.
నిజానికి గత రెండేళ్లుగా.. వంగవీటి రాధాకృష్ణ వర్గాన్ని జగన్ దూరం పెడుతూ వస్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లకు… రాధ వర్గీయులే… అధ్యక్షులుగా ఉండేవారు. కానీ ఆరు నెలలకు ఒకరి చొప్పున తొలగిస్తూ.. వచ్చారు. ఇప్పుడు ఒక్క డివిజన్‌కు కూడా వంగవీటి వర్గీయులు అధ్యక్షులుగా లేరు. కొన్ని రోజుల క్రితం… వైసీపీ నేత, వైఎస్ జగన్ దగ్గర బంధువు గౌతంరెడ్డి.. వంగవీటి రంగాపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆయనను పార్టీ నుంచి తొలగించాలని… వంగవీటి రాధా డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాపుల్లో ఆగ్రహం రావడంతో.. అప్పటికప్పుడు సస్పెన్షన్ వేటు వేశారు కానీ.. మళ్లీ వెంటనే తీసేశారు. ఇప్పుడు టిక్కెట్ ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నారు. దీంతో వంగవీటి వర్గీయుల్లో అసహనం పెరిగిపోతోంది.
నిజానికి చాలా కాలంగా.. వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీలో చేరినా టిక్కెట్ దొరుకుతుందనే గ్యారంటీ లేదు. నియోజకవర్గాల వారీగా.. టీడీపీలో పాతుకుపోయిన నేతలున్నారు. వారిని కాదని.. వంగవీటి రాధకు టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదు. కొన్నాళ్ల కిందటే.. రాధా-రంగా మిత్రమండలి బాధ్యతలు చూస్తున్న వంగవీటి రంగా బావమరిది చెన్నుపాటి శ్రీనివాస్ టీడీపీలో చేరిపోయారు. పెద్దిరెడ్డితో జరిగిన సమావేశం నుంచి వంగవీటి రాధా కోపంగా బయటకు వెళ్లిపోయిన తర్వాత ఆయన టీడీపీలో చేరుతాడన్న ప్రచారం సహజంగానే ప్రారంభమయింది. ఇప్పటికైతే ఇది గాసిప్పేననుకోవాలి. జగన్‌తో అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్న కొడాలి నాని కూడా.. ఆప్తమిత్రుడైన… వంగవీటి రాధ కోసం ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు లేవు. అందుకే వంగవీటి ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.