ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు నినాదాల సీజన్ నడుస్తోంది. సోషల్ మీడియాలోనే కాదు.. బయట కూడా. క్యాచీగా ఉండే నినాదాలు పెట్టుకుని.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తాపత్రయ పడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం… ఈ విషయంలో కొద్ది రోజులుగా దూకుడుగా వ్యవహరిస్తోంది. ” మళ్లీ నువ్వే రావాలి” అంటూ.. ఓ క్యాప్షన్ రెడీ చేశారు. ఓ కార్యక్రమంలో చంద్రబాబుతో ఓ వృద్ధురాలిని.. “చంద్రబాబు నీకేం కావాలమ్మా” అని అడిగారు. దానికి ఆమె నాకేం వద్దు బాబూ.. “మళ్లీ నువ్వే రావాలి” అని కోరుకుంది. న్యూస్ పేపర్లలో వచ్చిన ఈ వార్తను.. టీడీపీ సోషల్ మీడియా విభాగం అంది పుచ్చుకుని.. “మళ్లీ నువ్వే రావాలి” అనే క్యాంపెయిన్ ప్రారంభించింది. ఊరూవాడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలని క్యాడర్‌కు సూచించింది. ఇది ప్రజల్లోకి వెళ్లింది.
“మళ్లీ నువ్వే రావాలి” రియాక్షన్ అటు చంద్రబాబుతో పాటు.. ఇటు జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా వచ్చింది. పార్టీ నేతల సమావేశంలోనే.. ఇదేదో బాగుంది.. ప్రజల్లోకి బాగా వెళ్లింది.. మరింత బాగా ప్రచారం చేయమని…చంద్రబాబు ప్రొత్సహించారు. అదే జగన్మోహన్ రెడ్డి.. ” మళ్లీ ఎవరు రమ్మన్నారయ్యా..నిన్ను…” పాదయాత్రలో ఓ రోజు విమర్శలు చేసి పడేశారు. ఆ తర్వాత… టీడీపీ నారా “హమారా – టీడీపీ హమారా” క్యాంపెయిన్ చేసింది. ముస్లింలను ఇది కూడా గట్టిగానే తాకింది. త్వరలో బీసీ సదస్సు నిర్వహించబోతోంది. దానికి ‘దేశంలో సగం-తెలుగుదేశంతో మనం’ అనే క్యాప్షన్ రెడీ చేసుకున్నారు.
ఈ విషయంలో తాము వెనుకబడిపోతున్నామని… వైసీపీ నేతలు భావించారేమో కానీ.. వెంటనే… కౌంటర్‌గా” జగన్ రావాలి – జగన్ కావాలి” క్యాప్షన్‌తో ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. గతంలో ” అన్నొస్తున్నాడు..” అనే ట్యాగ్‌లైన్‌ను విస్త్రతంగా ప్రచారం చేశారు. కానీ అది ప్రజల్లోకి వెళ్లలేదు. ఇప్పుడు దానికి బదులుగా ” జగన్ రావాలి – జగన్ కావాలి” నినాదాన్ని ఎత్తుకుంటున్నారు. ఈ రోజు నుంచి నియోజకవర్గాల వారీగా గడప గడపకూ వైసీపీని తీసుకెళ్లి ఈ నినాదాన్ని వినిపించబోతున్నారు. ఈ విషయంలో పార్టీ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం జరిగిపోయింది. ఇక ఏపీ మొత్తం హోరెత్తించడమే మిగిలింది.