తెలంగాణలో ఇప్పుడు టీఆర్ఎస్, ప్రతిపక్షాల మధ్య.. ఎలాంటి ఉద్విగ్న పూరితమైన వాతావరణం కనిపిస్తోందో.. టీఆఎస్‌లో హరీష్ రావు – కేటీఆర్ వర్గాల మధ్య అలాంటి వాతావరణమే కనిపిస్తోందన్న అభిప్రాయాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా హరీష్ రావు ప్రతి కదలికపై.. ప్రగతి భవన్ నిఘా పెట్టిందనే వార్తలు.. తెలంగాణ మొత్తం చక్కర్లు కొడుతున్నాయి. అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత కేసీఆర్ 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. కానీ అనూహ్యంగా… దాదాపుగా సగానిపైగా నియోజకవర్గాల్లో… అసంతృప్తి జ్వాలలు ఎగసి పడుతున్నాయి. ఒక చోట బుజ్జగించేలోపు..మరో చోట ఎగసి పడుతున్నాయి. దీనికి టీఆర్ఎస్‌లోని ముఖ్యనేతల హస్తం ఉందంటూ.. కొద్ది రోజుల క్రితం.. ఓ ప్రముఖ దినపత్రిక కథనం ప్రచురించింది. సహజంగానే.. అందరి చూపు హరీష్ రావు వైపు వెళ్లింది.
నాలుగున్నరేళ్ల క్రితం.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు.. కేసీఆర్ తర్వాత హరీష్ రావు ఉండేవారు. పార్టీ నేతలు, క్యాడర్ హరీష్ ఎలా చెబితే అలా నడుచుకునేవారు. కానీ కేసీఆర్.. తన వారసుడిగా కేటీఆర్ మాత్రమే ప్రొజెక్ట్ అవ్వాలనుకున్నారు. దాంతో మెల్లగా… హరీష్‌కు ప్రాధాన్యం తగ్గిపోయింది. హరీష్ రావు మనుషులుగా పేరు పడిన వాళ్లు మెల్లగా వెనక్కి వెళ్లిపోయారు. కేటీఆర్‌తో సన్నిహిత సంబంధాలున్న నేతలు.. పార్టీలో కీలకంగా మారిపోయారు. ఇది ఎంతగా మారిందంటే.. ప్రగతి నివేదన లాంటి అతి భారీ సభ నిర్వహణలో హరీష్‌కు కనీస బాధ్యత కూడా లేకుండా చేశారు. హరీష్.. కేసీఆర్ మాట ధిక్కరించేందుకు సిద్ధంగా లేరు. అందుకే పరిస్థితిని గమనించి.. సందర్భం వచ్చిన ప్రతీసారి.. కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా తనకు సమ్మతమేనని… ధిక్కరించబోనని చెప్పుకునేందుకు తంటాలు పడుతున్నారు. గతంలో ఇలానే.. ప్లీనరీ జరుగుతున్న సందర్భంలో కేటీఆర్‌ను వారసుడిగా కేసీఆర్ ప్రకటించబోతున్నారని ప్రచారం జరిగిన సమయంలో.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ.. ఓపెన్ హార్ట్ ఇంటర్యూకు వచ్చి… కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యమని ప్రకటించారు. రెండు రోజుల క్రితం..ఈనాడు పత్రికకు ఇదే తరహా ఇంటర్యూ ఇచ్చి.. కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా.. తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
తాను ఎంతగా శీలపరీక్షకు నిలబడుతున్నా.. టీఆర్ఎస్ అధినేతలో మాత్రం.. కేటీఆర్‌కు రాజకీయ వారసత్వం అందించడంపై టెన్షన్ పడుతున్నారట. దానికి కారణం.. హరీష్‌తో గత అనుభవాలేనని.. కొంత మంది చెప్పుకొస్తున్నారు. వైఎస్ హయాంలో.. ఓ సారి సందర్బంలో హరీష్ తిరుగుబాటుకు సిద్ధమయ్యారని కూడా చెప్పుకున్నారు. అలాంటిది ఇప్పుడైమైనా ఉందా అన్నదానిపై… కేసీఆర్ మథనం కావొచ్చంటున్నారు. ఎందుకంటే.. ఇప్పుడు తెలంగాణలో ఏ రాజకీయ నేత రహస్యంగా ఎవరితో మాట్లాడినా..అది కేసీఆర్‌కు చేరిపోతుంది. అలాంటి నెట్‌వర్క్ ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత ఏర్పాటు చేసుకున్నారు. ఈ నెట్‌వర్క్ ఇప్పుడు హరీష్‌రావుపై దృష్టి పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏం జరుగుతందో కాలమే నిర్ణయించాలి.. !