ముందస్తు ఎన్నికలకు వెళ్లి, మరోసారి అధికారం దక్కించుకుంటామన్న ధీమాతో తెరాస ఉన్న సంగతి తెలిసిందే. అయితే, గడువుకు ముందుగా అసెంబ్లీ ఎందుకు రద్దు చేశారనే కారణాన్ని బలంగా చెప్పలేకపోతున్నారనే చెప్పాలి..! కాంగ్రెస్ వల్లనే ఎన్నికలకు వెళ్లాల్సి వస్తోందని పదేపదే చెబుతున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మళ్లీ ఇదే వాదనను వినిపించే ప్రయత్నం చేశారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సిద్ధమని కాంగ్రెస్ నేతలు ప్రగల్బాలు పలికారనీ, తీరా ఎన్నికల సంఘం ప్రతినిధుల ముందుకు వచ్చేసరికి తొందరేముంది అన్నారని విమర్శించారు. ఎన్నికలంటే కాంగ్రెస్ భయపడుతోందనీ, కేసీఆర్ పెట్టిన ఈ పరీక్షను ఎలా ఎదుర్కోవాలని టెన్షన్ పడుతున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ కారణంగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారనీ, కేసులు పెడుతున్నారనీ, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి వైఖరి సరైందో అనేది ప్రజలు తేల్చి చెబుతారని కేటీఆర్ అన్నారు. అందుకే అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లామన్నారు. దాదాపు ఎనిమిది నెలల ముందుగా అధికారాన్ని తమ పార్టీ త్యాగం చేసిందనీ, తెలంగాణలో కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మహా కూటమి వల్ల తెరాసకు మేలే జరుగుతుందనీ, వ్యతిరేక శక్తుల్నీ ఒక చోట చేరడం వల్ల ప్రజలకు మరింత స్పష్టత వస్తుందని అభిప్రాయపడ్డారు. విచిత్రం ఏంటంటే… కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో గెలవలేదని వారే చెబుతున్నారు కదా, అలాంటప్పుడు ఆ పార్టీని మరో ఎనిమిది నెలలు తట్టుకోలేరా అనే అనుమానం కలగడం సర్వసాధారణం కదా.
ఇక, భాజపా గురించి విమర్శిస్తూ… ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా ఖర్చు పెంచారంటూ అమిత్ షా అభిప్రాయపడ్డారనీ, గుజరాత్ లో సీఎంగా మోడీ కూడా ముందస్తుకు వెళ్లారు కదా అన్నారు కేటీఆర్. బీజేపీని భారతీయ ఝూటా పార్టీగా అభివర్ణించారు. తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయమని అమిత్ షా కలలు కంటున్నారనీ, వచ్చే ఎన్నికల్లో ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే వారికి కష్టమని ఎద్దేవా చేశారు. భాజపా పాలనలో ప్రజలు పడ్డ ఇబ్బందులు గతంలో ఎన్నడూ పడలేదన్నారు. అమిత్ షా ని బ్రమిత్ షా అంటూ… తెలుగు రాష్ట్రాలకు వారు చేసిందేం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో తమ పోటీ కాంగ్రెస్ తో మాత్రమేననీ భాజపాతో కాదని కేటీఆర్ అన్నారు. విచిత్రం ఏంటంటే… మోడీ నిర్ణయాలకు నిన్నమొన్నటి వరకూ కేసీఆర్ వత్తాసు పలుకుతూ వచ్చారు. ఇప్పుడేమో, మోడీ నిర్ణయాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడిపోయారని మంత్రి కేటీఆర్ విమర్శిస్తున్నారు! ఇన్నాళ్లూ ఈ విమర్శలు ఏమయ్యాయి..?