అనంతపురం జిల్లా తాడిపత్రిలో మూడు రోజుల నుంచి అంతకంతకూ పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితి.. అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. తాడిపత్రితో ఏమైనా ఉద్రిక్తత అంటూ ఏర్పడితే.. అది ఫ్యాక్షన్ గొడవల వల్లేనని అందరూ భావిస్తారు. కానీ హఠాత్తుగా.. ప్రబోధానంద అనే స్వామిజీ, ఆయన అనచరులు రేపిన అలజడి కారణంగా.. ఉద్రిక్తత ఏర్పడింది. అది అంతకంతకూ పెరుగుతోంది. కానీ తగ్గడం లేదు. ప్రబోధానంద అనుచరులు.. ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఏకంగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపైనే దాడికి ప్రయత్నించారు. దీంతో తాడిపత్రి నిప్పుల మీద ఉన్నట్లయింది.
ఇప్పుడంతా.. అసలు ఈ ప్రబోధానంద స్వామి ఎవరు..? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి..? ఆయన ఆశ్రమంలోకి పోలీసుల్ని కూడా ఎందుకు అడుగు పెట్టనివ్వడం లేదు..?. రాళ్లలు, కర్రలు భారీగా ఎందుకు అందుబాటులో ఉంచుకుంటారు..? ఇలాంటి ప్రశ్నలన్నీ ప్రజల్లో సహజంగానే వస్తున్నాయి. వీటన్నింటికీ.. అందరికీ తెలిసిన సమాధానం… ” ఏమీ తెలియదనే..”. తాడిపత్రి సమీపంలోని చిన్నకొడిమాల అనే గ్రామం సమీపంలో ఉన్న ప్రబోధానంద స్వామి ఆశ్రమానికి ఆ గ్రామస్తులు ఎవరు వెళ్లరు. కానీ… ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూంటారు. భారీ భవంతులతో ఉండే ఆశ్రమంలో.. కనీసం నాలుగు వందల మంది ఉంటారని ప్రచారం జరుగుతోంది. అసలు ప్రబోధానంద స్వామి ఎలా ఉంటారన్న విషయం ఎవరికీ తెలియదు. ఆయన మొహం పోలీసులు కూడా చూడలేదు.
వినాయక నిమజ్జనం సందర్భంగా.. చిన్నకొడిమాల గ్రామస్తులతో.. ప్రబోధానంద స్వామి అనుచరులు గొడవ పడ్డారు. నిమజ్జానికి వెళ్తున్న వారిపై దాడులకు పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో దాడులు చేశారు. గ్రామం మీద పడి పెద్ద ఎత్తున ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో.. ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటనపై. పోలీసు ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించారు. ఒక రోజంతా.. ఆశ్రమంలోకి వెళ్లడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. అంతగా రహస్యంగా ఉంటాల్సిన విషయాలు ఆశ్రమంలో ఏమున్నాయన్న అనుమానాలు అంతకంతకూ బలపడుతున్నాయి. ఈ ఆశ్రమం వ్యవహారాన్ని ఎంపీ జేసీ ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు.
అసలు ఈ డేరాబాబా ఎవరు..? దేవుడి ప్రార్థనాలు చేసుకునే మనుషులు.. ఇంత హింసాత్మకంగా ఎలా ఉంటారు..? భక్తులు ఎక్కడ్నుంచి వస్తున్నారు..? ఆశ్రమం లోపల ఎం జరుగుతోందన్న విషయాన్ని కనుక్కునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాలు తెలిస్తే అసలు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..!