తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పొత్తులపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్తో పొత్తు ఉండదని చెబుతూంటే… ఒక్క పార్టీ నేత కూడా నమ్మకపోవడంతో.. ఆయన శివసేనతో పోల్చారు. మహారాష్ట్రలోనే శివసేనతోనే తెగ తెంపులు చేసుకున్నాం.. అంత కంటే టీఆర్ఎస్ ఒకలెక్కా అన్నట్లుగా మాట్లాడారు. దీంతో.. పొత్తులు ఉండబోవని… తెలంగాణ బీజేపీ నేతలకు క్లారిటీ వచ్చిటన్లయింది.
శివసేన కన్నా బీజేపీ మిత్రపక్షాలన్నీ గొప్పవేనా..?
శివసేన కన్నా టీఆర్ఎస్ గొప్పదా.. అని అమిత్ షా అన్నారు. మరి శివసేన కన్నా.. జేడీయూ గొప్పదా..? మరి జేడీయూతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు..?. శివసేన కన్నా.. ఉత్తరప్రదేశ్ లో ఆప్నాదళ్ గొప్పదా..? శివసేన కన్నా.. అకాలీదళ్ గొప్పదా..? .. శివసేన కన్నా.. బీజేపీకి అనేక మిత్రపక్షాలు ఉన్నాయి. అవన్నీ శివసేన కన్నా గొప్పవా..?. సైద్ధాంతిక సారూప్యం లేని ఎన్నో పార్టీలతో బీజేపీ పొత్తులు పెట్టుకుంది. పొత్తులు పెట్టుకునే పార్టీ గొప్పదా.. పెద్దదా.. చిన్నదా అన్నది కాదు. మహారాష్ట్ర రాజకీయాలకు.. తెలంగాణ రాజకీయాలకు పోలిక లేదు. మహారాష్ట్రలో దశాబ్దాల కాలంగా.. శివసేన – బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కలిసి ఉన్నారు. ఒకప్పుడు శివసేన బీజేపీ కన్నా.. పెద్ద పార్టీ. తర్వాత తగ్గిపోయింది. ముఖ్యంగా బాల్ ధాకరే మరణానంతరం… ఉద్ధవ్ ధాకరే, రాజ్ ధాకరే మధ్య విబేధాలొచ్చి.. శివసేన బాగా బలహీనపడింది. దేశవ్యాప్తంగా.. బీజేపీ ప్రభంజనం పెరగడంతో.. బీజేపీ బలపడుతూ వచ్చింది. శివసేన బలహీన పడుతూ వచ్చింది.
మహారాష్ట్రలో మేజర్ పార్టనర్ పోస్టు కోసమే ఘర్షణ..?
అయితే మారిన పరిస్థితులను గుర్తించడానికి శివసేన నిరాకరిస్తోంది. గతంలో మేము మేజర్ పార్టనర్లం కాబట్టి.. ఇప్పుడు అలాగే ఉండాలంటోంది. కానీ… అలయెన్స్‌లో మేజర్ పార్టనరా..? జూనియర్ పార్టనరా..? అనేది చరిత్ర నిర్ణయించదు. వర్తమానమే నిర్ణయిస్తుంది. మా తాతలు నేతులు తాగారు.. మా మూతులు వాసలు చూడండి.. అన్నట్లుగా.. శివసేన వ్యవహరిస్తోంది. బీజేపీ మేజర్ పార్టనర్ అయిందని గుర్తించడానికి శివసేన సిద్ధపడటం లేదు. కానీ బీజేపీ.. మాది ఇప్పుడు పెద్ద పార్టీ కాబట్టి… తమ ఆధిక్యాన్ని అంగీకరించాలని చెబుతోంది. విడిగా పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించింది. అయినా సరే శివసేన మాత్రం అంగీకరించడం లేదు. బీజేపీ ప్రజాక్షేత్రంలో తన బలం చూపించింది. అయినప్పటకీ.. శివసేన అంగీకరించలేకపోతోంది. ఇదే.. శివసేన – బీజేపీల మధ్య ఘర్షణ. అంతే కానీ.. సిద్ధాంతపరంగా..సైద్ధాంతిక పరంగా.. రెండు పార్టీల మధ్య ఎలాంటి ఘర్షణ లేదు.
కాంగ్రెస్‌ను ఓడించడానికి టీఆర్ఎస్కు బీజేపీ మద్దతు ఇస్తోందా..?
కానీ తెలంగాణలో పరిస్థితి వేరు. ఇక్కడ టీఆర్ఎస్కు ఎవరూ మేజర్ పార్టనర్ లేరు. మహారాష్ట్రలోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం లేదు. ఇప్పుడు ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేల్ని నిలబెట్టుకోవడమే సాధ్యం కాదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవకూడదనేదే బీజేపీ వ్యూహం. శివసేన కన్నా.. టీఆర్ఎస్ గొప్పదా.. చిన్నదా.. అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. తెలంగాణలో కాంగ్రెస్ గెలవకడదనేది బీజేపీ వ్యూహం. కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేది బీజేపీ నినాదం. టీఆర్ఎస్ ముక్త్ భారత్ అని బీజేపీ నినాదం ఇవ్వదు. మహారాష్ట్రలోనే కాంగ్రెస్ ముక్త్ భారత్.. బీజేపీతో సాధ్యమవుతుంది. ఆ పార్టీని ఓడించి… ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ తెలంగాణలో.. ఆ ధీమ్‌ను అమలు చేయలేదు. ఇక్కడ టీఆర్ఎస్ ద్వారా.. ఆ లక్ష్యాన్ని సాధిస్తుంది. ఇక్కడ టీఆర్ఎస్తో నేరుగా పొత్తు పెట్టుకుంటే.. అది టీఆర్ఎస్కు ఎంఐఎంతో ఇబ్బందికర పరిస్థితులను తెచ్చి పెడుతుంది. కాంగ్రెస్ బలపడే అవకాశం ఉంటుంది.
టీఆర్ఎస్కి బీజేపీ సహజ మిత్రపక్షమా..?
ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ వైఖరి సుస్పష్టం. టీఆర్ఎస్ వ్యతిరేకత వైఖరితో ఉంటూ.. విమర్శలు చేస్తూ.. పోరాడుతున్నట్లు కనిపిస్తుంది. దీని వల్ల… ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలుస్తుంది. అయితే ఇది టీఆర్ఎస్పై అభిమానంతో కాదు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే లక్ష్య సాధనలో.. తాము చేయలేని పనిని టీఆర్ఎస్ చేస్తుందనే ఉద్దేశంతో… సాయం చేస్తోంది. ఒక్క… టీఆర్ఎస్ విషయంలోనే కాదు.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏ ప్రాంతీయ పార్టీ ఉన్నా.. ఆ పార్టీకి బీజేపీ మద్దతుగా నిలబడుతోంది. ఏపీలో ఆ పరిస్థితి లేదు. అక్కడ రెండు ప్రాంతీయ పార్టీలు పోరాడుతున్నాయి. టీడీపీ పోతే వైసీపీ కలసి వస్తుంది కనుక… సులువైన రాజకీయాలు చేస్తున్నారు. అంటే… దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా ప్రాంతీయ పార్టీ ఉంటే… ఆ పార్టీకి బీజేపీ సహజమైన మిత్రపక్షంగా వ్యవహరిస్తుంది. ఇలా బీజేపీ తన లక్ష్య సాధనలో భాగంగా వ్యవహరిస్తుంది కానీ.. ఆయా ప్రాంతీయ పార్టీలపై అభిమానంతో కాదు.