రాజకీయాల్లో సమీకరణాలు ఎప్పుడూ విచిత్రంగా ఉంటాయి. ఒకరి ముందడుగు.. మరొకరికి కిరీటం తెచ్చి పెట్టవచ్చు. లేకపోతే.. ఉన్నదాన్ని తీసి పడేయవచ్చు. ప్రస్తుతం… ఏపీలో ఇలాంటిదే జరుగుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీ పర్యటనకు.. అదీ కూడా.. కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్నారు. దీని వల్ల… కాంగ్రెస్ పార్టీ బావుకునేది ఏమీ ఉండకపోవచ్చు కానీ.. తెలుగుదేశం పార్టీకి మాత్రం కాస్త సంతృప్తికరమైన మ్యాటరే కనిపిస్తోంది. దానికి కారణం రాయలసీమ రాజకీయాలే..!. రాహుల్ గాంధీ.. ఏఐసిసి అధ్యక్షుడయిన తర్వాత తొలిసారి ఏపీ టూర్ కి వస్తున్నారు. రాయలసీమ ఓటర్లను టార్గెట్ చేశారు.
రాయలసీమలో కాంగ్రెస్ పార్టీకి ఘనమైన చరిత్ర ఉంది. దశాబ్దాలుగా.. ఆ పార్టీకి రాయలసీమ వెన్నుదన్నుగా నిలిచింది. వైఎస్ హయామే కాదు.. అంతకు ముందు కూడా.. రాయలసీమలో కాంగ్రెస్ కు తరగని ఆదరణ ఉంది. అయితే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత … ఆ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. కొద్ది మంది సీనియర్ నేతలు పార్టీలో ఉన్నా… పార్టీని క్రియాశీలం చేయలేకపోయారు. దానికి కారణం క్యాడర్ సహా..అందరూ వైసీపీకి మళ్లడమే. అయితే ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీకి ఓ అవకాశం వచ్చింది. ప్రత్యేకహోదా అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి.. దాన్ని ఇవ్వబోయేది తామేనని చెప్పి… పూర్వ వైభవాన్ని తెచ్చుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇది ప్రజల్లోకి వెళ్తే.. కాంగ్రెస్ ఓటు బ్యాంక్…మళ్లీ… కాంగ్రెస్ దగ్గరకే చేరుకుంటుంది.
జాతీయ రాజకీయాల్లో వచ్చిన మార్పులతో.. తెలుగుదేశం పార్టీ .. బీజేపీకి బద్ద శత్రువుగా మారింది. ఆ పార్టీని మళ్లీ అధికారంలోకి రానివ్వకూడదన్న పట్టుదలతో టీడీపీ అధినేత ఉన్నారు. అందు కోసం కాంగ్రెస్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. కర్నూలు టూర్లో … రాహుల్ ఎవర్ని టార్గెట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. వైసీపీ ఓటు బ్యాంక్ మొత్తం కాంగ్రెస్ పార్టీదే. వైసీపీ ఎంత బలహీనం అవుతుందో.. కాంగ్రెస్ పార్టీ అంత బలం పుంజుకుంటుంది. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలందరికీ క్లారిటీ ఉంది. అందుకే రాహుల్ ఏపీ కాంగ్రెస్ నేతలతో ఎప్పుడు సమావేశం అయినా.. జగన్ విషయంలో కానీ.. వైసీపీ విషయంలో కానీ మెతగ్గా ఉండవద్దని చెబుతూంటారు. అలాంటిది..ఇప్పుడు రాహుల్ గాంధీనే నేరుగా..ఏపీ పర్యటనకు వస్తున్నారు. మరి రాహుల్ .. వైసీపీ విమర్శలు చేయకుండా ఉంటారా..?. ప్రధానంగా.. బీజేపీతో కుమ్మక్కయిన విధానం.. ప్రతిపక్షంగా విఫలమైన వ్యవహారాన్ని.. రాహుల్ ప్రస్తావించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.