హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి పేరుతో ఫేస్ బుక్ ఖాతా సృష్టించి, తద్వారా డబ్బులు గుంజుతున్న ఓ మోసగాడి భాగోతం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే… సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న రవికిరణ్ అనే యువకుడు శ్రీనివాసరెడ్డి అనే పేరుతో ఓ ఫేస్ బుక్ ఖాతా సృష్టించాడు. గత కొంత కాలంగా శ్రీనివాసరెడ్డికి సంబంధించిన సమాచారాన్ని అందులో పోస్ట్ చేస్తున్నాడు. శ్రీనివాసరెడ్డి పేరుతోనే అందరితోనూ చాటింగులు చేస్తున్నాడు. కేరళలో సంభవించిన వరదల దృష్ట్యా, అక్కడి వాళ్లని ఆదుకోవాలని, అందుకోసం కనీసం రూ.5 వేలు తగ్గకుండా విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చాడు. ఓ బ్యాంకు ఖాతాని కూడా సృష్టించాడు. దాంతో కొంతమంది ఆ ఖాతాకు విరాళాలు పంపారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసరెడ్డి.. సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడ్ని పట్టుకున్నారు. శ్రీనివాసరెడ్డికి క్షమాపణలు చెప్పి, తన ఖాతాలో మళ్లించిన డబ్బుని వెనక్కి ఇచ్చేయడంతో ఈ వివాదం ముగిసింది.