కర్ణాటక రాజకీయాల్లో మొదటి నుంచి ఉన్న విభిన్న పరిస్థితులు మళ్లీ పునరావృతం అవుతున్నాయి. జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు బీజేపీ చాలా రోజులుగా పావులు కదుపుతోంది. ఇప్పుడు అవి ఓ కొలిక్కి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నాలుగు నెలల ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ‘అక్రమ, రాజ్యాంగ వ్యతిరేక’ విధానాలకు పాల్పడుతోందని జేడీఎస్ అగ్రహంగా ఉంది. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు పెద్దమొత్తంలో సొమ్ములు, మంత్రి పదవులు ఇస్తామన్న ఆఫర్ను బీజేపీ చూపుతోంది. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత సిద్ధరామయ్య రెండువారాల యూరప్ పర్యటన ముగించుకుని ఆదివారం బెంగళూరు తిరిగి వచ్చారు. ఆ వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా జేడీఎస్ సారథ్యంలోని ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్న పార్టీ ఎమ్మెల్యేలతో పలుమార్లు సమావేశాలు జరిపారు.
డబ్బు కోసమో, పదవుల కోసమే బీజేపీ వలలో పడవద్దని అసంతృప్తులను సిద్ధరామయ్య బుజ్జగించారు. 15 మంది కాంగ్రెస్, జేడీయూ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవాలన్నది బీజేపీ టార్గెట్గా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి బలాన్ని 222 నుంచి 207కు తగ్గించేందుకు వ్యూహం సిద్ధం చేసింది. అయితే ఈ ప్రయత్నాలు చేసిన బీజేపీకి.. కుమారస్వామి షాక్ ఇచ్చారు. 5 నుంచి ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలు తనతో సంప్రదింపులు జరుపుతున్నారని కొద్ది రోజుల కిందట ప్రకటించారు. దీంతో ఎందుకైనా మంచిదని .. బీజేపీ.. తమ ఎమ్మెల్యేలపై ఓ కన్నేసి ఉంచింది.
అయితే లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీ కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేయకపోవచ్చన్న ప్రచారం కూడా ఉంది. ప్రభుత్వ మార్పిడి జరిగితే.. పదవి కోల్పోయిన వారి పట్ల ప్రజల్లో సానూభూతి ఉంటుంది. అది తమకు మైనస్ అవుతుందని బీజేపీ భావింవచ్చు. అయితే.. కర్ణాటకలో అధికారంలోనే ఉంటే.. పార్లమెంట్ ఎన్నికల్లో మ్యాగ్జిమం సీట్లు సాధించగలమన్న.. అంచనా.. బీజేపీలో ఉంది. అందుకే ఎలాగోలా అధికారాన్ని దక్కించుకోవాలనే ప్రయత్నాన్ని కూడా… బీజేపీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కర్ణాటకలో మాత్రం.. చాలా భిన్నమైన రాజకీయం నడుస్తోంది. అది దిన దిన గండం .. నూరేళ్లాయుష్షు లాంటిది.