మెగాస్టార్ చిరంజీవి ‘మహానటి’ చూసి చిత్రబృందాన్ని ఇంటికి పిలిచారు. ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా దర్శకుడు నాగఅశ్విన్ ప్రతిభను మెచ్చుకున్నారు. అదే సమయంలో చిరంజీవితో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ వంటి ఎవర్గ్రీన్ హిట్ సినిమా తీసిన నిర్మాత, నాగ అశ్విన్ మామగారు సి. అశ్వనీదత్ ఓ ఆకాంక్షను వ్యక్తం చేశారు. చిరంజీవి హీరోగా అల్లుడు దర్శకత్వంలో ఒక సినిమా తీయాలని వుందని! అప్పటికి టైమ్ మెషీన్ కాన్సెప్ట్‌తో నాగ అశ్విన్ ఒక కథ సిద్ధం చేస్తున్నారని తెలిపారు. అది గతం! వర్తమానానికి వస్తే… చిరంజీవి హీరోగా ఆ సినిమా తెరకెక్కుతుందా? లేదా? అనేది చెప్పలేనని అన్నారు.
‘చిరంజీవితో నాగ అశ్విన్ సినిమా అన్నారు. ఏమైంది?’ అని అశ్వనీదత్‌ని ప్రశ్నించగా…. ‘‘నాగి (నాగ అశ్విన్) కథ రాయడం ప్రారంభించారు. దాన్ని ఎటువైపు తీసుకువెళ్లాలనేది నాకూ తెలియడం లేదు. కాకపోతే.. ఆ సినిమా భారీగా ఉంటుంది. చూడాలి’’ అని సమాధానం ఇచ్చారు. ‘చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని ఆ కథ సిద్ధం చేయడం లేదా?’ అని ప్రశ్నిస్తే… ‘‘నేను అనుకోవడం లేదు సార్! నాగి ఒక స్టేజిలో చెప్పినప్పుడు… చిరంజీవిగారికి యాప్ట్‌గా వుంటుందని అనుకున్నాను. అతను కూడా అప్పట్లో అదే ఫీలయ్యాడు. డెవలప్‌మెంట్స్‌లో అది ఎలా వెళ్తుంది? ఏంటి? అనేది ఇప్పుడే చెప్పలేం. అదీ కాకుండా… కథ ఒక షేప్‌కి వచ్చాక, చిరంజీవిగారికి వినిపించాలి. ఆయన, దర్శకుడు ఇష్టపడితేనే కదా? సినిమా పట్టాలు ఎక్కుతుంది!’’ అని తెలిపారు. అంటే… మెగాస్టార్‌తో మహానటి దర్శకుడి సినిమా ఇంకా ఖరారు కాలేదన్నమాట!!