వేలికి అంటుకున్నదాన్ని ముక్కుకు అంటించుకున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెజవాడ రాజకీయాలను డీల్ చేస్తోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సీటును మల్లాది విష్ణుకు ఇవ్వాలని నిర్ణయించుకున్న వైసీపీ అధిష్టానం.. ఆ విషయాన్ని వంగవీటి రాధాకృష్ణకు చెప్పడంలో.. చిత్రమైన రాజకీయం చేసింది. జగన్ మీడియాలో సెంట్రల్ టిక్కెట్ మల్లాది విష్ణుకు ఖరారు చేశారని… వంగవీటి రాధాకృష్ణకు.. తూర్పు టిక్కెట్ లేదా.. మచిలీపట్నం పార్లమెంట్ టిక్కెట్ ఇవ్వబోతున్నారని ప్రచారం చేశారు. దీంతో వంగవీటి వర్గీయులకు మండిపోయింది. గత నాలుగేళ్లుగా సెంట్రల్ నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్న వంగవీటి రాధాకృష్ణ. మొన్న పాదయాత్రకు వచ్చినప్పుడు కూడా.. సెంట్రల్ లో వంగవీటి రాధాకృష్ణనే పోటీ చేస్తారని జగన్ అందరికీ చెప్పారు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో బ్రాహ్మణులు ఎక్కువగా ఉన్నారని మల్లాది విష్ణుకు టిక్కెట్ ఇస్తామని తేల్చి చెప్పారు.
మరి వంగవీటి రాధాకృష్ణ పరిస్థితేమిటని… ఆయన అనుచరుల్లో అలజడి రేగింది. కాపులు ఎక్కువగా ఉంటారు కాబట్టి విజయవాడ తూర్పు నియోజకవర్గం టిక్కెట్ ఇస్తామని.. అదీ వద్దంటే.. మచిలీపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేయవచ్చునని… జగన్ మీడియాలో కథనాలు రాయించారు కానీ.. ఆ సీట్లపైనా గ్యారంటీ ఇవ్వలేదు. వంగవీటి వర్గం రెండు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా… వైసీపీ అగ్రనేతలెవరూ.. రాధాకృష్ణను బుజ్జగించే ప్రయత్నం చేయలేదు. మిత్రుడైన కొడాలి నాని వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వైసీపీ నేతలు మరింత రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. సర్వేల్లో మెరుగైన ఫలితం రాకపోతే.. తనకు కూడా టిక్కెట్ ఇవ్వరని పార్థసారధి.. చెప్పుకొచ్చారు. అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి… వంగవీటి రాధాకృష్ణకు అన్యాయం చేయబోమని.. ఆయనకు విజయవాడ తూర్పు టిక్కెట్ ఇస్తామని హైకమాండ్ చెప్పిందని… ప్రకటించేశారు.
దీంతో తూర్పు నియోజకవర్గంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎందుకంటే.. విజయవాడ తూర్పు నియోజకవర్గం టిక్కెట్ ఇస్తామంటూ.. పాదయాత్ర సమయంలోనే తెలుగుదేశం పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవిని పార్టీలో చేర్చుకున్నారు. ఆయనను సమన్వయకర్తగా నియమించారు. ఇప్పుడు ఆ టిక్కెట్ ను అక్కడ కాపులు ఎక్కువగా ఉన్నారన్న కారణం చూపుతూ… వంగవీటి రాధాకు ఆఫర్ చేసేశారు. దీంతో రవి అనుచరులు ఆందోళనకు సిద్ధమయ్యారు. విజయవాడ సెంట్రల్ టిక్కెట్ ఇవ్వకపోతే జగన్ తో తాడో పేడో తేల్చుకోవడానికి వంగవీటి రాధా సిద్ధమయ్యారు. ఈ మంటను చల్లాచుకోవడానికి.. తూర్పు టిక్కెట్ ఆశ చూపించి.. అక్కడా మంట రాజేసుకున్నారు వైసీపీ నేతలు. ఇప్పుడు మచిలీపట్నం పార్లమెంట్ టిక్కెట్ పై ఆశ పెట్టుకున్న వాళ్లు కూడా బయటకు రావడానికి సిద్ధమయ్యారు. ఇలా ఒక చోట అసంతృప్తిని చల్లార్చడానికి మరో చోట అంటించుకుంటూ పోతోంది వైసీపీ నాయకత్వం.