మరోసారి ఉద్యమ పంథాను అందుకున్నారు తెలంగాణ ఆదివాసీలు! ఆ మధ్య, లంబాడాలను ఎస్టీ జాబితాల నుంచి తప్పించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో తమ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఆదివాసీలకు మాత్రమే సీట్లు కేటాయించాలంటూ తీర్మానించారు. తెలంగాణలో తాము ఉంటున్న ప్రాంతంలో తమకే రాజ్యాధికారం కావాలంటూ నినదిస్తున్నారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లాలో ఐక్య ఆదివాసీ సంఘం ఒక సభ ఏర్పాటు చేసుకుని తీర్మానం చేసింది. తమ ప్రాంతంలో ఇప్పటికే తెరాస ప్రకటించిన అభ్యర్థులను నిరసిస్తూ… తమ ప్రాంతంలో అభ్యర్థులను తామే ఎంపిక చేసి చెప్తామని అంటున్నారు.
బోధన్, ఆసిఫాబాద్, ఖానాపూర్ స్థానాలను తమకే ఇవ్వాలంటూ ఐక్యవేదిక ప్రధానంగా డిమాండ్ చేసింది. ఇప్పటికే, ఈ మూడు చోట్లా అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించేశారు. బోధన్ నుంచి రాథోడ్ బాబూరావ్, ఆసిఫాబాద్ నుంచి కోవ లక్ష్మి, ఖానాపూర్ నుంచి రేఖా నాయక్ లు ఎన్నికల బరిలో దిగుతున్నట్టుగా కేసీఆర్ ప్రకటించేశారు. అయితే, ఈ మూడు నియోజక వర్గాల పరిధిలో ఆదివాసీలే ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి, వీటిని తమకే కేటాయించాలన్నది వీరి డిమాండ్. తమతో సంప్రదించకుండా ఇలా టిక్కెట్లు ప్రకటించేయడంతో తెరాస తమను మరోసారి మోసం చేస్తోందని ఐక్యవేదిక నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ నియోజక వర్గాల్లో ఇతర పార్టీలు ఇంకా టిక్కెట్లు ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే తెరాస ప్రకటించిన అభ్యర్థులను మార్చాలనీ, లేదంటే తమ సత్తా ఏంటో చూపిస్తామంటూ ఐక్య వేదిక నేతలు హెచ్చరించారు.
ఆదివాసీలు తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి… ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేసే అవకాశం ఉంది! ఆ మూడు నియోజక వర్గాల టిక్కెట్ల విషయమై ఆదివాసీల డిమాండ్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే.. తమకు మేలు జరుగుతుందనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, పొత్తుల విషయమై ఇంకా ఎటూ తేల్లేదు కాబట్టి, ఈ అంశంపై కొంత ఆలస్యంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక, తెరాస విషయానికొస్తే… ఈ మూడు చోట్లా వ్యక్తమౌతున్న తీవ్ర నిరసనను తగ్గించుకునే దిశగా పార్టీలో ఇప్పటికే కొంత చర్చ మొదలైనట్టు సమాచారం. అయితే, అభ్యర్థుల మార్చాల్సిన పరిస్థితి ఉంటుందా, లేదా ఆయా ప్రాంతాల్లో పార్టీ పెద్దలు పర్యటించడం ద్వారా ఆదివాసీలకు స్పష్టమైన హామీలు ఇచ్చి బుజ్జగించే ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూడాలి. ఏదేమైనా, ముందుగా టిక్కెట్లు ప్రకటించడం వల్ల తెరాసకు కొన్ని సైడ్ ఎఫెక్ట్ లు తప్పడం లేదు.