ఇప్పటికే, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానంపై వైకాపాలో నిరసనలు వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం ఒక కొలీక్క రాకముందే… గుంటూరు ఎంపీ స్థానం విషయమై కొత్తగా మరో వివాదం తెరమీదికి వచ్చింది. విజ్ఞాన్ రత్తయ్య కుమారుడు క్రిష్ణదేవరాయలు, కిలారు రోశయ్యల వర్గాల మధ్య ఈ టిక్కెట్టు అంశమై కొంత రగడ మొదలైనట్టు సమాచారం. నిజానికి, గత ఎన్నికలకు ముందే రత్తయ్య వైకాపాలో చేరారు. ఆ సమయంలో కూడా వారు సీటు ఆశించారుగానీ, బాలశౌరికి వైకాపా టిక్కెట్ దక్కింది. అయితే, ఆ తరువాత బాలశౌరి నియోజక వర్గంలో పార్టీపరంగా ఏమంత క్రియాశీలంగా లేరు! దీంతో 2019 ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని కృష్ణదేవరాయలు పార్టీ శ్రేణుల్ని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. పార్లమెంటు నియోజక వర్గం పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల్లో గడచిన నాలుగేళ్లుగా ఆయన క్రియాశీలంగా ఉంటూ వచ్చారు.
ఇప్పుడు వైకాపా అధినాయకత్వం వైఖరిలో వచ్చిన మార్పు ఏంటంటే… గుంటూరు ఎంపీ స్థానాన్ని కాపు సామాజిక వర్గానికి చెందినవారికి ఇవ్వాలని అనుకోవడం! ఈ నేపథ్యంలో వైకాపాలో సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారు రోశయ్యను గుంటూరు నుంచి బరిలోకి దింపాలని పార్టీ ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం. కుల సమీకరణాల రీత్యా రత్తయ్య కుటుంబానికి చెందినవారికి నర్సారావుపేటలో ప్రాధాన్యత కల్పించాలనీ, ఈ మేరకు ఆ కుటుంబంతో వైకాపా అధిష్టానం కూడా చర్చలు ప్రారంభించిందనే కథనాలు వినిపిస్తున్నాయి.
అయితే, గుంటూరు ఎంపీ స్థానం రోశయ్యకు ఇవ్వాలనే ప్రతిపాదనపై రత్తయ్య కుటుంబంతోపాటు, అభిమానులూ చాలా గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతానికి ఎక్కడా బయటపడకపోయినా… వైకాపా అధినాయకత్వంపై లోలోపల తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతున్నట్టుగా చర్చ జరుగుతోంది. పార్టీ సూచించినట్టుగా నర్సారావు పేటకు వెళ్లేందుకు రోశయ్య ఏమాత్రం సుముఖంగా లేరనే సమాచారం తెలుస్తోంది! పార్టీ అంతర్గతంగా నిర్వహించిన సర్వేల ఫలితంగానే ఇలా కొంతమంది అభ్యర్థులను వివిధ స్థానాలకు పంపించాలనే నిర్ణయం అధినేత జగన్ తీసుకున్నారనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తూ ఉండటం గమనార్హం. అయితే, కృష్ణదేవరాయలను నర్సారావు పేటకు పంపిస్తే… గుంటూరులో వైకాపా అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉండవని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆయనకి తప్ప, గుంటూరు నుంచి ఎవరు పోటీకి దిగినా సహకారం నిరాకరణ తప్పదనే నిరసన సొంత పార్టీ వర్గాల నుంచే వ్యక్తమౌతోంది. అయితే, వీటిని పార్టీ అధినాయకత్వం ఇంతవరకూ పరిగణనలోకి తీసుకున్నది లేదనే తెలుస్తోంది.