ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత .. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అంతర్థానమైపోయింది. పూర్తిగా డిపాజిట్లు గల్లంతయ్యాయి. చరిత్రలో తొలిసారిగా.. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దీనంటికి కారణం రాష్ట్ర విభజనే అందరికీ తెలుసు. రాష్ట్రాన్ని విభజించడం.. సీమాంధ్రులకు ఇష్టం లేదు. తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షలు తీర్చుదామని కారణం కావొచ్చు..! లేకపోతే.. ఏపీలో ఎలాగూ ఓడిపోతాం కాబట్టి.. తెలంగాణలో అయినా ఓట్లు సాధిద్దామనే కారణం కావొచ్చు.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించింది. ఈ కారణంగా.. ప్రజలు కాంగ్రెస్ పార్టీని శిక్షించారు.
“ప్రత్యేకహోదా” కాంగ్రెస్ ఎదగాలనుకుంటోందా..?
నవ్యాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదు. దాదాపుగా పార్టీ నేతలంతా.. ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఎన్ని సంవత్సరాలకైనా మళ్లీ కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం పొందుతుందన్న నమ్మకం కాంగ్రెస్ పార్టీ నేతల్లోనే లేదు. తమిళనాడులోలా కాంగ్రెస్ పార్టీ మిగిలిపోతుందన్న అంచనాలు వచ్చాయి. కామరాజ్నాడార్ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఉండేది. ఆ తర్వాత తుడిచిపెట్టుకుపోయింది. అక్కడ డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే పోరు నడిచింది. ఏపీలోనూ అలాంటి పరిస్థితే ఉంటుందని అంచనా వేశారు. కనీసం .. అధికారం సాధించే పార్టీలకు జూనియర్ పార్టనర్‌గా ఉండేంత బలం కూడా ఉండదు. అయినా కానీ.. కాంగ్రెస్ పార్టీ నేతలు.. నిరాశ పడకుండా.. బలోపేతం అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో గుంటూరులో.. ఇప్పుడు.. కర్నూలులో రాహుల్ గాంధీతో సభలు నిర్వహింపచేశారు. ప్రత్యేకహోదా అంశంతో ప్రజల్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తోంది. నిజానికి ప్రత్యేకహోదా అంశంలో.. కాంగ్రెస్ పార్టీకి ఓ నైతిక హక్కు ఉంటుంది. రాష్ట్ర విభజన సమయంలో… ప్రత్యేకహోదాను… ఏపీకి హామీ ఇచ్చింది.. కాంగ్రెస్ పార్టీ. అప్పటి ప్రధాని మన్మోహన్ ఏపీకి ఈ హామీ ఇచ్చారు. కాబట్టి.. కాంగ్రెస్ పార్టీకి ఈ హామీని చెప్పుకోవడానికి నైతిక హక్కు ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీ మాత్రమే హోదా ఇచ్చే పరిస్థితుల్లో ఉందా..?
అయితే చాలా మంది.. కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో… ప్రత్యేకహోదాని ఎందుకు పెట్టలేదు..?. ఇలా ఎవరూ అడగలేదు. విభజన చట్టం సవరణలో ప్రత్యేకహోదాను పెట్టుకోవాలనే చొరవను … ఏ రాజకీయ పార్టీ కానీ.. ఏ ఎంపీ కానీ చూపించలేదు. కానీ సవరణ చేస్తే.. అది మళ్లీ పార్లమెంట్లో ఓటింగ్‌కు వస్తుంది. అదే జరిగితే ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో..అప్పట్లో.. ప్రత్యేకహోదాను హామీకే పరిమితం చేశారు. అయితే ఈ పరిమితులు.. ఎన్ని ఉన్నా.. కాంగ్రెస్ ప్రత్యేకహోదాను హామీ ఇచ్చింది. విభజన వల్ల రాజధానిని కోల్పోతున్న ఆంధ్రప్రదేశ్ భారీగా ఆదాయాన్ని కోల్పోతుంది. ఆ ఆదాయాన్ని కల్పించడానికి.. ప్రత్యేకహోదా ఉపయోగపడుతుంది. ఈ ప్రత్యేకహోదాను.. బీజేపీ అడిగింది. కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అడిగిన బీజేపీ… ఇప్పుడు హ్యాండిచ్చింది. ఇక ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే మిగిలింది. వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా వస్తుంది. లేదంటే సంకీర్ణ ప్రబుత్వం అధికారంలోకి రావాలి. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీల కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఒక వేళ వచ్చినా.. ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాకపోవచ్చు. ప్రాంతీయ పార్టీలకు.. ప్రాంతీయ ఆలోచనలు ఉంటాయి కాబట్టి.. ప్రత్యేకహోదాను సాధించడం సాధ్యం కాకపోవచ్చు.
హోదాపై మోడీలా చేయబోనంటున్న రాహుల్..!
ప్రత్యేకహోదా ఇవ్వాలంటే.. బీజేపీ లేదా కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాలే ఇవ్వాలి. ఇప్పుడు బీజేపీ సంకీర్ణం కాదు.. సంపూర్ణ ప్రభుత్వమే ఉంది. ఇవ్వాలని అనుకుటే.. బీజేపీకి అడ్డుపడే అవకాశం లేదు. కారణాలు ఏమైనా.. ఏపీకి ప్రత్యేకహోదాను.. మోడీకి ఇవ్వదల్చుకోలేదు. దానికి 14వ ఆర్థిక సంఘాన్ని కారణంగా చూపిస్తున్నారు కానీ.. అది నిజం కాదు. రేపు బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చినా ప్రత్యేకహోదా ఇవ్వదు. ప్రాంతీయ పార్టీల కూటమి అధికారంలోకి కాదు. అంటే.. ఇచ్చే అవకాశం ఉన్న ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ. సరిగ్గా ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. మోడీలా.. తాను మోసం చేయనని.. నమ్మమని.. రాహుల్ గాంధీ చెబుతున్నారు. అంటే.. ఈ అంశం ద్వారా.. కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనానికి ప్రయత్నిస్తోంది.
హోదాతో పాటు రుణమాఫీతో గాలం వేస్తున్నారా..?
రుణమాఫీ హామీని కూడా… రాహుల్ గాంధీ ఇస్తున్నారు. నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం.. తెలుగు రాష్ట్రాల రైతులు.. అత్యంధిక రుణభారం ఉన్న రాష్ట్రాలు. బీజేపీ రుణమాఫీ చేస్తామని చెప్పడం లేదు. గతంలో యూపీఏ రూ. 72 వేల కోట్ల రుణమాఫీ చేశారు. అప్పట్లో ఏపీ రైతులు బాగా లబ్ది పొందారు. మోడీ సంపన్నులకు.. రుణాలు మాపీ చేస్తారు. కానీ కాంగ్రెస్ మాత్రం.. రైతులకు రుణమాఫీ చేస్తానని… రాహుల్ గాంధీ చెబుతున్నారు. ఇలాగే.. తెలంగాణలో టీడీపీతో కలిసి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. అక్కడి పొత్తు ప్రజాభిమానం పొందితే… ఏపీలో వ్యతిరేకత లేకపోతే… ఏపీలో కూడా పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ ముందుకు రావొచ్చు. ఓ వైపు ప్రత్యేకహోదా , రుణమాఫీ హామీలు..మరో వైపు రాజకీయ ఎత్తుగడతో.. కేంద్రంలో అధికారంలోకి రావాలనేది.. కాంగ్రెస్ ఆలోచన. కనీసం… మెరుగైన స్థాయిలో సీట్లు సంపాదించుకోవాలనేది.. కాంగ్రెస్ ప్రయత్నం.
ప్రధానిగా రాహుల్ కావాలని ఉన్నా కాంగ్రెస్‌కు ఓట్లు వేయరా..?
ఓ రాజకీయ విశ్లేషకుడిగా.. నేను ఏపీ పరిస్థితులను ఎసెస్మెంట్ చేస్తే… కచ్చితంగా బీజేపీ పట్ల…మోడీ పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. దేశ ప్రధానిగా ఎవరు ఉండాలి అని మోడీ, రాహుల్‌లను చాయిస్లుగా ఇస్తే… మెజార్టీ ప్రజలు రాహుల్ గాంధీ కావాలని కోరుకుంటారు. అలా కోరుకునేవాళ్లు కాంగ్రెస్‌కి ఓటేయరు. ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి.. టీడీపీకో…వైసీపీకో వేస్తారు. జమిలీ ఎన్నికలు జరిగినప్పుడు.. 77 శాతం మంది ఓటర్లు ఒకే పార్టీకి ఓటు వేస్తారు. ఈ లెక్కలు చూస్తే.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ కాస్త పెరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే మాత్రం.. కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమిస్తారా అన్నది సందేహమే. రాష్ట్ర విభజన చేయడం వల్లనే ప్రత్యేక హోదా విషయం వచ్చింది. రాష్ట్ర విభజన వల్ల.. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో కోపం తగ్గలేదు. అందుకే హోదా అన్నా… రుణమాఫీ అన్నా.. ప్రజలు ఆదరించే పరిస్థితి లేదు. వీటన్నిటిని బట్టి చూస్తే.. పార్లమెంట్ ఎన్నికల్లో కొద్దిగా ఓటింగ్ పెరుగుతుంది కానీ.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రజలు క్షమించే అవకాశం లేదు.