“మాట తప్పను..మడమ తిప్పను.. అన్నాడు ఇప్పుడు చేస్తుందేమిటి..? నమ్మితే ఘోరంగా మోసం చేయడమేనా ఆయన నీతి..” .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత.. వైఎస్ జగన్పై.. ఓ వంగవీ రంగా అభిమాని వ్యక్తం చేసిన ఆక్రోశం ఇది. మూడు రోజుల నుంచి వంగవీటి రాధాకృష్ణ ఇంటి వద్ద.. ఆయన అభిమానులు గుమికూడి ఉన్నారు. జగన్పై ఇలాంటి శాపనార్ధాలు పెడుతూనే ఉన్నారు. వైసీపీ సభ్యత్వ నమోదు పుస్తకాలు తగులబెడుతనే ఉన్నారు. ఇలాంటి ఆక్రోశం… ఒక్క వంగవీటి రాధాకృష్ణ అనుచరుల్లోనే కాదు.. దాదాపుగా 130 నియోజకవర్గాల్లో వైసీపీని నమ్ముకున్న పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉంది. చిత్తూరులో సీకే బాబు దగ్గర్నుంచి… భీమిలిలో .. కర్రి సీతారం అనే నేత వరకూ.. అనేక మంది నేతల అనుచరులు.. జగన్ మాట తప్పడాన్ని.. మడమ తిప్పడాన్ని చూశారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో ఇవి మరింత ఉద్ధృతంగా కనిపిస్తున్నాయి.
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, చిలుకలూరిపేటలో మర్రి రాజశేఖర్, విజయవాడలో వంగవీటి రాధాకృష్ణ, విశాఖ దక్షిణలో కోలా గురువులు.. ఈ పది, పదిహేనుల్లో … జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి గురైన ప్రముఖులు. వీళ్లంతా నిన్నామొన్నా.. వైసీపీలోకి వచ్చిన వారు కాదు. ఉన్న పార్టీని వదిలి.. జగన్తో పయనం ప్రారంభించిన వారే. గత నాలుగేళ్ల నుంచి వీళ్లందరికీ… టిక్కెట్ మీకే.. టిక్కెట్ మీకే అని చెప్పి… తీరా ఇప్పుడు… మీ దగ్గర సామాజిక బలం లేదు.. ఆర్థిక స్థోమత లేదు అన్న కారణాలు చూపి.. పక్కన పెట్టేస్తున్నారు. కొత్త కొత్త వాళ్లను తీసుకొచ్చి నియోజకవర్గా బాధ్యతలు అప్పగించేస్తున్నారు. జగన్ తీరు చూసి.. “మోసం గురూ..” అని బాధపడని నేత లేడు. ఎందుకంటే.. జగన్మోహన్ రెడ్డి.. తన పార్టీ రాజకీయ కార్యక్రమాలు.. తన పాదయాత్ర.. ఆ నియోజకవర్గం .. ఆ జిల్లా దాటే వరకూ.. ఆయా నేతలకు గట్టి నమ్మకం కలిగిస్తున్నారు. తీరా పనైపోయినాక.. కనీస సమాచారం లేకుండా.. ఇతరుల్ని ఇన్చార్జులుగా నియమించేస్తున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కోలా గురువులు అనే నేత వైసీపీ పెట్టి నప్పటి నుంచి ఉన్నారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. నిన్నామొన్నటి వరకూ… ఆయనే అభ్యర్థి అని… ఆ నియోజకవర్గంలో పర్యటించిన ప్రతీసారి విజయసాయిరెడ్డి చెప్పేవారు. కానీ రెండురోజుల క్రితం హఠాత్తుగా.. గరువుల్ని తప్పించి… రమణమూర్తి అనే ఓ హాస్పిటల్ ఓనర్ను సమన్వయకర్తగా ప్రకటించారు. ఆయనకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. అలాగే..గుంటురు పార్లమెంట్ స్థానంలో నాలుగేళ్లుగా పని చేసుకుంటున్న విజ్ఞాన అధినేత రత్తయ్య కుమారుడ్ని.. ఎన్నికలకు ముందు..నరసరావుపేటకు మారాలని చెప్పేశారట.
దాదాపుగా ప్రతీ జిల్లాలోనూ.. ఐదారు నియోజకవర్గాల్లో… వైసీపీ తరపున సమన్వయ కర్తలుగా ఆరు నెలల కుంటే ఎవరూ ఎక్కువ ఉండటం లేదు. అందరూ డబ్బులు ఖర్చుపెట్టేసుకుంటున్నారు. వెళ్లిపోతున్నారు… నిజం చెప్పాలంటే వెళ్లగొట్టేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ, 2019 ఎన్నికల్లో అయినా తమను ఆదరిస్తారనే ఆశాభావంతో గత నాలుగున్నరేళ్లుగా ప్రజల్లో ఉన్న నేతలున్నారు. ఆస్తులు అమ్ముకొనో… అప్పులు చేసో… పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయినా సరే జగన్ అవేమీ చూడటం లేదు. ఎన్నికల్లో రూ.20 కోట్లు ఖర్చుపెడతామని ఎవరైనా ముందుకువస్తే వారిని తక్షణం సమన్వయకర్తగా నియమించేస్తున్నారు. పార్టీ కోసం అహోరాత్రులు కష్టపడినవారిని నిర్దాక్షిణ్యంగా పదవి నుంచి తప్పించేస్తున్నారు. అందుకే అందరూ..”మడమ తిప్పుతారు.. మాట తప్పుతారంటూ..” జగన్పై మండి పడుతున్నారు.