మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఓ సొంత భవనమంటూ లేదు. ఫిల్మ్ ఛాంబర్లో ‘మా’కి ఒక్క రూమ్ ఉందంతే! పేరున్న స్టార్లు, కోట్ల పారితోషికాలు తీసుకుంటున్న కథానాయికలు సభ్యులుగా ఉన్న ‘మా’కి సొంత భవనమంటూ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ”మా హయంలో సొంత భవనం తెస్తాం” అని వాగ్దానాలు చేసి ‘మా’ పీఠాలెక్కారెందరో. కానీ ఎవ్వరి వల్లా సాధ్యం కాలేదు. శివాజీ రాజా కూడా అదే మాట అన్నాడు. కానీ… అది ఆచరణ సాధ్యం కావడం లేదు. ‘మా’కి ఫండ్లు తీసుకొచ్చే పనిలో… ఇటీవలే అమెరికాలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిరంజీవి లాంటివాళ్లు ఆ కార్యక్రమంలో పాల్గొన్నా… దీని వల్ల ‘మా’కి వచ్చిన నిధి కేవలం కోటి రూపాయలు మాత్రమే. ఈ విషయమై ఇటీవల శివాజీ రాజా – నరేష్‌ల మధ్య వివాదం కూడా నడిచింది. ఆ తరవాత ‘మేమంతా ఒక్కటే’ అని అన్నారనుకోండి.. అది వేరే విషయం. చిరంజీవి లాంటి వాళ్లు వెళ్లినా.. కోటి రూపాయలు కూడా రాలేదేంటి? అని మీడియా ప్రశ్నించింది. దానికి ‘మా’ నుంచి సరైన సమాధానం రాలేదు.
అయితే ఈమధ్య దుబాయ్‌లో ‘సైమా’ అవార్డు వేడుకలు జరిగాయి. వీటి వల్ల ‘సైమా’ నిర్వాహకులకు అధమ పక్షంలో రూ.5 కోట్ల వరకూ మిగిలాయని ఓ టాక్ వినిపిస్తోంది. సినిమాలకు ఏమాత్రం సంబంధం లేని ఓ ప్రైవేటు వ్యక్తి నిర్వహించిన ఓ అవార్డు కార్యక్రమానికి ఈ స్థాయిలో నిధులు వచ్చాయంటే… ‘మా’ పూనుకుంటే ఇంత కంటే… గొప్పగా సాధిస్తుంది కదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడున్న స్టార్లంతా ‘మా’ సభ్యులే. వాళ్లంతా ఓ తాటిపై ఉంటే.. ‘సైమా’లాంటి కార్యక్రమం ఏడాదికి ఒక్కటి నిర్వహించినా… ఈపాటికి ‘మా’కంటూ సొంత భవనం, స్థిరమైన నిధి ఏర్పడిపోయేవి. కానీ ఆ దిశగా ఎవ్వరూ ఆలోచించడం లేదు. కనీసం నలుగురైదుగురు స్టార్లు ముందుకొచ్చి.. హైదరాబాద్‌లోనే ఓ ఈవెంట్ నిర్వహించుకుంటే… స్పాన్సర్ షిప్‌ల రూపంలో భారీగా సొమ్ములు రాబట్టొచ్చు. నిజంగా ‘మా’కి సొంత భవనం కావాలన్న చిత్తశుద్దే ఉంటే… ఈ పాటికి ఈ పని ఎప్పుడో చేసి ఉండేవారేమో. ‘మా’లో దాదాపు 800 వరకూ సభ్యులున్నారు. వాళ్లలో ‘మా’ వ్యవహారాల గురించి లోతుగా ఆలోచించేది, పరిశీలించేది పది మందికి మించరేమో. ‘మా’ అవసరాలు చాలా ఉన్నాయి. పించన్లు, ఆరోగ్య భీమా లాంటివి ‘మా’ చూసుకుంటోంది. వీటికి నిధులు కావాలన్నా.. మొహమొహాలు చూసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇవన్నీ రాకుండా ఉండాలంటే… ‘సైమా’ని స్ఫూర్తిగా తీసుకుని ‘మా` కూడా పక్కా ప్రణాళికలతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి. లేదంటే ‘మా’ కి సొంత భవనం ఎప్పటికీ ఓ కలలానే మిగిలిపోతుంది.