గ్రేటర్ ఎన్నికలలో విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలు రకరకాల వ్యూహాలు అమలు చేస్తున్నాయి. తెరాస ఒకవైపు ప్రతిపక్షాల నేతలను, కార్యకర్తలను పార్టీలోకి ఆకర్షించడం ద్వారా వాటి ఆత్మవిశ్వాసాన్ని, మనోబలాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూనే, మరోవైపు ఆంద్ర ప్రజలను ప్రసన్నం చేసుకొని విజయం సాధించేందుకు ప్రయత్నోస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే ఈ ఎన్నికలలో తెరాసకు సారద్యం వహిస్తున్న మంత్రి కె.టి.ఆర్. మొదట్లో కొంచెం స్పీడుగా వెళ్ళిపోయి “100 సీట్లు లేదా మంత్రి పదవికి రాజీనామా” ప్రకటన చేసేసి ప్రతిపక్షాల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయబోయి సెల్ఫ్ గోల్ చేసుకొన్నారు.
ఇక తెదేపా-బీజేపీ కూటమి తమకు అధికారం కట్టబెడితే కేంద్రం నుండి నిధులు ఏరులై పారించేసి హైదరాబాద్ ని అభివృద్ధి చేసిపడేస్తామని హామీ ఇస్తున్నాయి. కానీ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీలనే అమలు చేయించలేనప్పుడు, ఇక హైదరాబాద్ మళ్ళీ ఏవిధంగా నిధుల వరదలు పారిస్తారో వారికే తెలియాలి.
కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని పార్టీలలాగే హామీలను గుప్పిస్తోంది. మెట్రో రైల్ ప్రాజెక్టు మొదలు డ్రైనేజీల వరకు అన్నిటినీ పూర్తి చేసిపడేస్తామని చాలా నమ్మకంగా చెపుతున్నారు. కానీ అటు కేంద్రంలో కానీ ఇటు రెండు రాష్ట్రలలోగానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు, ఏవిధంగా తన హామీలను అమలుచేయగలదో దానికే తెలియాలి. ఈ ఎన్నికలలో తాము రికార్డు సృష్టించబోతున్నామని కాంగ్రెస్ నేతలు చెపుతుంటే, ‘అవును సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యి రికార్డు సృష్టించబోతోందని’ తెరాస నేతలు కాంగ్రెస్ పార్టీ మీద జోకులు వేస్తున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో తామే తప్పకుండా గెలువబోతున్నామని సూచిస్తున్నట్లుగా తన మేయర్ అభ్యర్ధి పేరుని కూడా ప్రకటించింది. మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ ని మేయర్ అభ్యర్ధిగా ప్రకటించింది. తద్వారా జంట నగరాలలోని చాల అధికంగా ఉన్న గౌడ్ కులస్థుల ఓట్లను పొందవచ్చని ఆశిస్తోందేమో.
ఇక మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ఇవ్వాళ్ళ రంగ ప్రవేశం చేసి జంట నగరాలలో ముస్లిం ప్రజలు బీఫ్ తినాలనుకొంటే మజ్లీస్ పార్టీకే ఓటేయాలని ఒక వివాదాస్పద నినాదం చేసారు. దానికి ఆయన మంచి రీజనింగ్ కూడా ఇచ్చేరు. మహారాష్ట్రాలో బీజేపీ-శివసేన కూటమికి ఓటేస్తే, అవి ఆ రాష్ట్రంలో వారం రోజుల పాటు బీఫ్ పై నిషేధం విధించాయని గుర్తు చేసి, ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికలలో పాల్గొంటున్న తెదేపా, బీజేపీ, తెరాస, కాంగ్రెస్ పార్టీలన్నీ ఒక వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి కనుక వాటికి ఓటేసి గెలిపిస్తే నగరంలో ముస్లిం ప్రజలు ఇకపై బీఫ్ తినే అవకాశం కోల్పోతారని హెచ్చరించారు. పేద ప్రజలు బీఫ్ కాక మరేమీ తినగలరని ఆయన ప్రశ్నించారు. కనుక బీఫ్ తినదలచుకొన్న వారు అందరూ మజ్లీస్ పార్టీకే ఓటేయాలని ఆయన కోరారు. నగర అభివృద్ధి, ప్రజల జీవనప్రమాణాలు పెంచడం, ముస్లిం యువత ఐసిస్ ఉగ్రవాదులవైపు ఆకర్షితులు అవుతుండటం వంటి విషయాల గురించి మాట్లాడకుండా ప్రజలను రెచ్చగొట్టేందుకు బీఫ్ ని అసదుద్దీన్ తన ఎన్నికల ఆయుధంగా వాడుకోవాలనుకోవడం విశేషం.
ఎవరు ఎన్ని వాగ్దానాలు చేసినప్పటికీ ఈ ఎన్నికలలో ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాదని నారా లోకేష్ ముందే జోస్యం చెప్పేశారు. తెదేపా-బీజేపీ కూటమి కింగ్ మేకర్ అవుతుందని కూడా చెప్పేశారు. ఇంతకీ ఆయన జోస్యం ఫలిస్తుందా..లేక కేంద్రం నుండి పారబోయే నిధుల వరదలలో ఆ కూటమికి ఓట్లు కొట్టుకొని వచ్చేస్తాయా…లేకపోతే బీఫ్ సరిగ్గా ఉడుకుతుందా లేదా…కాంగ్రెస్ మేయర్ అభ్యర్ధి ఆ పార్టీని ఒడ్డున పడేస్తాడా లేదా..ఆంధ్రా వాళ్ళు తెరాసని భుజానికెక్కించుకొంటారా లేదా…వంటి అన్ని ప్రశ్నలకు వచ్చే నెల ఐదున ఫలితాలు వెల్లడయినప్పుడు సమాధానాలు దొరుకుతాయి.