ప్రజలపై.. టీవీ మీడియా చూపించే ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో.. టీఆర్పీల కోసం… వేసే ఎమోషనల్ రియాల్టీ స్టోరీలతో ఎంత దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటాయో… సందీప్- మాధవిలపై జరిగిన హత్యాయత్నమే.. తిరుగులేని సాక్ష్యం. సందీప్ – మాధవి ప్రేమించుకున్నారు. వారి మధే కాదు.. వారి కుటుంబాల్లో కులాలు పెద్ద ఇష్యూ కాదు. కానీ ప్రేమ అనేది ఇష్యూనే. మాధవని.. మేనమామకి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడు తండ్రి మనోహరాచారి. కానీ మాధవికి ఇష్టం లేదు. ప్రేమించిన సందీప్‌ను పెళ్లి చేసుకుంది. ఇదంతా రెండు నెలల కిందట జరిగింది. ఆ తండ్రి బాధపడ్డాడు. కానీ తన కూతురి జీవితం .. తన ఇష్టం అని దాదాపుగా రియలైజ్ అయిపోయాడు. ఇంట్లో వాళ్లూ సర్దిచెప్పారు. అంతా సర్దుకుంటుదనుకున్న సమయంలో… హఠాత్తుగా… కన్న కూతుల్ని కాటికి పంపేయాలన్నంత కాఠిన్యంతో ఊగిపోయాడు. విచక్షణ మరిచి నడి రోడ్డుపైనే… కత్తి దూశాడు.
కూతురు ప్రేమ పెళ్లిని దాదాపుగా అంగీకరించి మనోహరాచారి .. మనసును.. కూతుర్ని చంపేయాలన్నంత కసిగా మార్చేసింది ఎవరు..? ఇంకెవరు మీడియానే. నాలుగు రోజులుగా.. మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కేసును.. మసాలా జోడించి.. అత్యంత నాటకీయంగా మార్చి..ఎమోషనల్ డైలాగులతో.. టీఆర్పీ రేటింగులు పండించుకున్న మీడియానే. ఆ తండ్రి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన కూతురి కోసం… ఒకరిని చంపించడానికి కూడా వెనుకాడలేదని… ప్రసారం చేయడమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రతి జంటకి… ఇంట్లో అంగీకారం దొరకని ప్రతీ ప్రేమ జంటకు.. ఈ నాలుగు రోజుల మీడియా కవరేజీ ఓ పీడకలే. అందరి మనసులతోనూ ఆడుకున్న మైండ్ గేమే. మనసును అదుపులో పెట్టుకోలేని.. తొందర పాటు.. తండ్రులు.. అంటే మనోహోరాచారి లాంటి వారు… ప్రేమించి పెళ్లి చేసుకున్న తన కూతురుల్ని చంపడం తప్ప… ఇంకేం చేసిన తప్పే అన్న స్థితికి.. మీడియా ప్రచారం ద్వారా చేరుకున్నారు.
మనోహరాచారి ఏం చేశాడో… పూర్తిగా తెలుసుకుంటే.. అతని పై ప్రణయ్ హత్య కేసు.. మీడియా చేసిన ప్రచారం.. ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు.. పోలీసు స్టేషన్లో రక్షణ కోరింది. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇప్పించింది. అప్పటికి మాధవి తల్లిదండ్రులు రియలైజ్ అవడానికి ప్రయత్నించారు. కానీ మనోహరాచారి మాత్రం… మాధవి అత్తవారిటికి వెళ్లి… కూతుర్ని ఇంటికి వచ్చేయమని అడుగుతూ ఉండేవాడు. కానీ మాధవి వచ్చేది కాదు. ప్రణయ్ హత్య గురించి కథనాలు ప్రసారమైన తర్వాత మనోహరాచారిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. కూతురు, ఆమె భర్తతో పద్దతిగా మాట్లాడటం ప్రారంభించాడు. పెళ్లిని అంగీకరించినట్లు నమ్మంచాడు. చివరికి నిన్న ఎలాగూ పెళ్లి చేసుకున్నారు కాబట్టి.. కొత్త బట్టలు కొనిస్తానని పిలిపించాడు. నడిరోడ్డుపై కత్తితో వేటు వేశాడు. ప్రణయ్ ను హత్య చేయాడనికి… అమృత తల్లిదండ్రులు కూడా.. మంచిగా మాట్లాడారని.. ఆ తర్వాత అదను చూసి చంపించారన్న టీవీ కథనాలే.. మనోహరాచారి మనసులో ముద్ర వేశాయి. ఫలితం.. కన్నకూతురిపై వేటు..!
నిజానికి మీడియా శక్తివంతమైనది. ప్రజలు కళ్ల ముందు కనిపించేదాన్ని కూడా నమ్ముతారో లేదో కానీ… టీవీల్లో వస్తే.. వంద శాతం నమ్మేస్తారు. అసాధ్యమైన విషయం అయినా సరే.. అదిగో టీవీలో కూడా చెప్పారంటారు. ప్రజల ఈ నమ్మకాన్ని టీవీ మీడియా టీఆర్పీల కోసం వాడుకుంటోంది. మనుషుల భావోద్వేగాలతో ఆడుకుంటుంది. ఫలితంగా… తనకు తెలియకుండానే.. వినాశకర పరిస్థితులకు దారి తీసేలా చేస్తోంది. దీనికి మందు ఉందో.. లేదో.. ఎవరికీ తెలియదు.