తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఒంటరిగా మిగిలిపోయారు. ముందస్తు ఎన్నికలు ముంచుకొచ్చిన తరుణంలో.. ఆయనను పార్టీలోకి తీసుకోవడానికి కానీ.. పార్టీ తరపున టిక్కెట్ ఇవ్వడానికి కానీ.. ఏ ఒక్క పార్టీ.. ముందుకు రాలేదు. చివరికి జనసేన అధినేత కూడా.. మొహం చాటేయడంతో.. మోత్కుపల్లి నర్సింహులు.. స్వతంత్ర అభ్యర్థిగా.. ఆలేరు నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తన కార్యాచరణ ప్రకటించారు. ఈనెల 27న యాదాద్రిలో మోత్కుపల్లి శంఖారావం సభ నిర్వహిస్తున్నట్లు… ప్రకటించారు. ఆలేరుకు గోదావరి జలాలు అందించడమే నా అంతిమ లక్ష్యంగా ప్రకటించారు. ఆలేరు గోదావరి జలాలు అందించి రాజకీయ జీవితాన్ని ముగిస్తానని శపధం చేశారు. వచ్చే ఎన్నికలే నాకు చివరి ఎన్నికలని సెంటిమెంట్ అస్త్రం కూడా ప్రయోగిస్తున్నారు.
ఎన్టీఆర్ జయంతి రోజు… చంద్రబాబును.. అత్యంత దారుణంగా.. తిట్టి .. టీడీపీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యాడు మోత్కుపల్లి. నిజానికి అంతకు ముందు … టీ టీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని వ్యాఖ్యానించిప్పటి నుంచి.. ఆయనకు పార్టీతో సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి. ఆ తర్వాత క్షమాపణలు చెప్పినా… పార్టీ నుంచి పిలుపు రాలేదు. చివరికి మహానాడుకు కూడా ఆహ్వానం లేదు. దాంతో.. ఇక టీడీపీలో భవిష్యత్ లేదనుకున్నారేమో కానీ.. ఎన్టీఆర్ జయంతి రోజే.. స్టాండ్ మార్చేశారు. చంద్రబాబుపై బూతులు లంకించుకున్నారు. అంతకు ముందు వరకూ.. కేసీఆర్‌ను తిట్టిన నోటితోటే… ఆయనను ఎన్టీఆర్‌తో పోల్చారు. టీఆర్ఎస్‌లోకి ఎంట్రీ అయినా వస్తుందనే ఉద్దేశంతో కావొచ్చు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్‌లో చేరబోతున్నారనే ప్రచారం జరిగింది. కానీ టీఆర్ఎస్ నేతలు పట్టించుకోలేదు.
కాంగ్రెస్ పార్టీలోనూ… చోటు దొరకడం అసాధ్యం. అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇక బీజేపీలోకి వెళ్లినా ఒకటే వెళ్లకపోయినా ఒక్కటే. చివరికి.. పవన్ కల్యాణ్ పార్టీ జనసేనను.. తెలంగాణలో లీడ్ చేద్దామని ఆశ పడ్డాడు. కానీ.. పవన్ కల్యాణ్ రాజకీయ ప్లాన్లు.. మానవమాత్రుడికి అర్థం కావు. ఆయన అసలు తెలంగాణలో రాజకీయాలు చేద్దామనుకున్నారో లేదో కానీ.. కలుద్దామని.. మాట ఇచ్చి మరీ.. మొహం చాటేశారు. దాంతో మోత్కుపల్లి ఒంటరిగా మిగిలిపోయారు. మధ్యలో చంద్రబాబును విమర్శించడానికి వైసీపీతో ప్రత్యేకమైన ఒప్పందం చేసుకున్నారు. ఓ సారి తిరుపతికి వెళ్లి హడావుడి చేశారు.. వర్కవుట్ కాలేదనేమో… వైసీపీ కూడా తర్వాత మోత్కుపల్లిని పట్టించుకోవడం మానేసింది. మరి చివరి చాన్స్ అంటూ వస్తున్న మోత్కుపల్లిని ఆలేరు ప్రజలైనా పట్టించుకుంటారా..?