పాత్రధారుల ఎంపిక, వాళ్ల మేకొవర్లపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడు క్రిష్. అది ‘ఎన్టీఆర్’ బయోపిక్‌కి సరికొత్త వన్నెను తీసుకొస్తోంది. చంద్రబాబు నాయుడు పాత్రలో రానాని తీసుకున్నప్పుడు కొన్ని సందేహాలు పుట్టుకొచ్చాయి. అవన్నీ… రానా ఫస్ట్ లుక్‌తో పటాపంచలైపోయాయి. ఇప్పుడు ‘ఏఎఎన్నార్’ ఫస్ట్ లుక్ వచ్చింది. ఈ పాత్రలో సుమంత్ కనిపించనున్నాడు. సుమంత్‌లో అక్కినేని పోలికలు కొన్ని కనిపిస్తాయి. మరి ఏఎన్నార్ గెటప్‌లో ఎలా ఉంటాడో అన్న ఉత్సుకతకు సమాధానం దొరికేసింది. ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు జయంతి. ఈ సందర్భంగా ఏఎన్నార్ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. అందులో సుమంత్ అచ్చుగుద్దినట్టు తాతయ్యని దింపేశాడు. అక్కినేని పోజుల్లో చాలా ప్రసిద్ది పొందిన స్టిల్ ఇది. దాన్ని రిప్లికా చేసుకుని ఈ లుక్‌ని తీర్చిదిద్దారు. ఈరోజు సాయంత్రం మరో స్టిల్ బయటకు రాబోతోంది. అందులో అక్కినేని, ఎన్టీఆరూ ఇద్దరూ ఉంటారు. ఈ లుక్కు మాత్రం అక్కినేని అభిమానుల్లో జోష్ నింపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.