జనసేన అధినేత పవన్ కల్యాణ్… ప్రజా పోరాటయాత్రను తిరిగి ప్రారంభించబోతున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి.. పశ్చిమగోదావరి జిల్లాలో పునం ప్రారంభమవుతుంది. అంతకు ముందు 22వ తేదీన నెల్లూరు వెళ్తారు. 23వ తేదీన అక్కడ జరుగుతున్న రొట్టెల పండుగలో పాల్గొంటారు. రొట్టె అందుకుంటారు . బారాషాహీద్ దర్గాలో ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడ్నుంచి నేరుగా పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చి ప్రజాపోరాటయాత్ర ప్రారంభిస్తారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్… ప్రజల్లో కనిపించి నెల దాటిపోయింది. ఏ ముహూర్తాన.. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజాపోరాటయాత్ర ప్రారంభించారో కానీ పదే పదే అడ్డంకులు ఎందురయ్యాయి. తొలి రోజే కాలు బెణకడంతో వాయిదా పడింది. ఆ తర్వాత నాలుగైదు నియోజకవర్గాల్లో పోరాటయాత్ర చేసే సరికి.. కన్ను సమస్య వచ్చింది. ఆపరేషన్ చేయించుకుని కోలుకుని.. పార్టీ వ్యవహారాలు చక్క బెట్టుకునే సరికి.. నెల దాటిపోయింది.
24 వ తేదీ నుంచి వారం రోజులపాటు జిల్లాలో యాత్ర నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ చేయబోయే మలివిడత యాత్రలో ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి. పోలవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, ఏలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో సాగే యాత్ర సాగనుంది. ప్రతీ నియోజకవర్గ కేంద్రంలోను భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, జనసైన్యం సమీకరణ, స్థానికంగా ప్రజా మద్ధతు కూడగట్టుకోవాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. మొదటి విడతలో భీమవరం కేంద్రంగా చేసుకుని, అక్కడే మకాం వేసి నేరుగా వివిధ సామాజిక వర్గాలతో ముఖాముఖి చర్చలు నిర్వ హించడం పవన్‌కు సంతృప్తి కలిగించింది. రెండో విడతలో ఇలాంటి పరిస్థితులే ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఏలూరులో వారం పాటు బస చేస్తారు.
ఇటీవలి కాలంలో.. ఉభయగోదావరి జిల్లాల నుంచి పలువురు నేతలు.. జనసేనలో చేరారు. వారితో కలిసి.. జనసేనను పటిష్టం చేసేలా.. కమిటీలను కూడా ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుోతంది. కలవకొలను తులసీ, యర్రా నవీన్, తదితరులంతా పవన్ పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గతంలోయాత్ర నిలిపివేసే సమయానికి.. ఇప్పటికి.. రాజకీయ పరిస్థితుల్లో చాలా తేడాలు వచ్చాయి. మరి పవన్ రాజకీయ వ్యూహం ఏమైనా మారుతుందో లేదో చూడాలి..!