తెలంగాణలో వామపక్షాలు ఎప్పుడైనా కలసి ఉన్నాయా..? కనీసం ఉమ్మడి రాష్ట్రంలో అయినా ఆ రెండు పార్టీలను.. మీడియా కానీ.. ఇతరులు కానీ.. ఒకే భావజాలం ఉన్న పార్టీలుగా చెప్పుకుని.. లెఫ్ట్ పార్టీలు.. వామపక్ష పార్టీలు అని చెప్పుకుంటాయి కానీ.. నిజానికి ఈ రెండు పార్టీలు ఎప్పుడూ ఒక్క మాట మీద ఉండలేదు. తామంటే.. తాము గొప్ప అనుకుని… ఆధిపత్యం చూపించుకునేందుకు… వేర్వేరుగా పోటీ చేసిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ విషయంలో సీపీఎం చాలా పెడసరంగా వ్యవహరిస్తుందని.. అందరికీ తెలుసు. కలసి పోటీ చేద్దామని..సీపీఐ .. ఒత్తిడి చేసినా మా దారి మాదేనన్నట్లు ఉంటుంది సీపీఎం. అలాంటి సీపీఎం తెలంగాణ కార్యదర్శి… తమ్మినేని వీరభద్రం.. తమ ఐక్యతకు విఘాతం కల్గించేది.. మహాకూటమి అని తేల్చేశారు. కేసీఆర్ పై పోరాటానికి అందరూ మహాకూటమి కట్టారు. మీరెందుకు అందులో చేరడం లేదన్నదానికి చాలా పెద్ద పెద్ద కారణాలే చెప్పారు వీరభద్రం.
ఎవర్నో గెలిపించడానికో.. ఓడంచడానికో తాము లేమన్నారు. ఈ సందర్భంలోనే ఆయన చెప్పిన గొప్ప మాట.. ” మహాకూటమితో వామపక్షాల ఐక్యతకు విఘాతం” కలిగిందట. సీపీఐ కావాలంటున్న సామాజిక న్యాయం కాంగ్రెస్‌తో సాధ్యం కాదని వీరభద్రం తేల్చేశారు. సీపీఎం బలంగా లేని చోట సీపీఐ లేదా కాంగ్రెస్‌కు మద్దతిస్తారట. కానీ మహాకూటమిలో చేరే ప్రసక్తే లేదంటున్నారు. కొద్ది రోజుల కిందట.. సీపీఎంతో పాటు.. మరికొన్ని ఉనికిలో లేని పార్టీలతో కలిసి. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరుతో ఓ కూటమి ఏర్పాటు చేశారు. ఈ కూటమితోనే పోటీ చేస్తామని చాలా రోజులుగా చెబుతున్నారు. ఈ కూటమిలో పోటీ చేయగలిగే పార్టీ సీపీఎం ఒక్కటే. ఈ పార్టీ కూడా.. గట్టిగా.. మూడు, నాలుగు స్థానాల్లో మాత్రమే రేసులో ఉన్నామన్నట్లుగా పోటీ పడగలదు. అయినా సరే.. తమ్మినేని వీరభద్రం… మాత్రం మా దారి మాది అంటున్నారు.
పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకుంటే.. ఎంతో కొంత గ్లామర్ వస్తుందని.. తమ్మినేని వీరభద్రం చాలా ఆశ పడ్డారు. పవన్ పట్టించుకోకపోయినా.. వెంట పడ్డారు. లేఖలు రాశారు. చివరికి పవన్ కల్యాణ్.. అత్యంత దారుణంగా హ్యాండిచ్చారు. మాట్లాడదామని చెప్పి.. సైలెంటయిపోయారు. దీంతో వీరభద్రానికి క్లారిటీ వచ్చేసినట్లయింది. ఇప్పుడు అభ్యర్థుల్ని ప్రకటిస్తానంటున్నారు. ఈ నెల 24న అభ్యర్థుల తొలి జాబితా ప్రకటిస్తారట. అంటే పొత్తులపై ఆశలు వదిలేసుకున్నట్లే..!