మెగాస్టార్ చిరంజీవి అంటే ఆయన రాజకీయ నాయకుడు అనే సంగతి ఇప్పటికి ఎందరికి గుర్తున్నదో చెప్పడం కష్టం. ఎందుకంటే.. గత కొన్ని నెలలుగా ఆయన క్రియాశీల రాజకీయాలకు చాలా దూరంగా మెదలుతున్నారు. 150వ సినిమా చేయాలనే తహతహలో కొన్ని నెలలుగా (ఏళ్లుగానా?) ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేసుకుంటూ.. సఫలం కాలేకపోతున్న చిరంజీవి ఇటు రాజకీయాల్లో పార్టీ కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాడిని పక్కన పడేసి దూరం జరిగిపోయారనే విమర్శలను కూడా భరించవలసి వస్తోంది. ఏది ఏమైనప్పటికీ.. ప్రస్తుతం చిరంజీవి వైఖరి ‘ఓన్లీ సినిమా- నో పాలిటిక్స్’ అన్నట్లుగా కనిపిస్తోంది.
ఎందుకంటే.. ఇటీవల అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కూడా అనేకానేక కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నప్పటికీ.. ఒక్క సందర్భంలో కూడా తానుగా వచ్చి కనిపించని చిరంజీవి… హైదరాబాదులో ఐఫా అవార్డుల ప్రదానం ఉత్సవాలు జరగగానే అక్కడ మెరిసిపోతూ ప్రత్యక్షం అయ్యారు. తెలుగు సినీ పరిశ్రమ, తాను పర్యాటక మంత్రిగా ఉండగా ఐఫా ఉత్సవాలు దక్షిణాదిలో జరగడం గురించి చేసిన కృషి తదితర విషయాలన్నిటినీ పంచుకున్నారు.
ఏతావతా చిరంజీవి వైఖరిని గమనిస్తే.. సినిమా వేడుకలకు హాజరు కావడానికి, సినిమా సంబరాలను పంచుకోవడానికి ఆయనకు సమయం ఉన్నది గానీ.. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి మాత్రం ఆయనకు క్షణం తీరికలేదు అన్నట్లుగా ఉన్నదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి తీరు వల్ల చిరంజీవి మరో రకం విమర్శల్ని కూడా భరించాల్సి వస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్లో ఉంది. చిరంజీవి చరిష్మా ఏమైనా పార్టీకి ఉపయోగపడడం నిజమే అయితే గనుక.. ఇలాంటి సమయాల్లోనే ఆయన క్రియాశీలంగా ఉండాలి. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు.. సినిమాల్లోకి వెళ్లిపోయి, పార్టీ పరిస్థితి బాగుపడిన తర్వాత.. తగుదునమ్మా అంటూ పదవులు అనుభవించడానికి వస్తే.. అవకాశవాద రాజకీయ నాయకులకు – చిరంజీవికి తేడా ఏముంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగర ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిందిగా తెలంగాణ నాయకులు చిరంజీవికి విజ్ఞప్తి చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఆయన సున్నితంగానే తోసిపుచ్చినట్లు సమాచారం. సినిసెలబ్రిటీగా ఉన్న క్రేజ్‌ను పార్టీకి ఎన్నికల్లో ఉపయోగపడకుండా.. చిరంజీవి ఇంకెందుకు దాచుకుంటున్నారో అర్థం కావడం లేదని పార్టీలోనే నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.