టీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు నోటి వెంట రాజకీయ రిటైర్మెంట్ ప్రకటనలు వస్తున్నాయి. సిద్దిపేట నియోజకవర్గంలో తాను దత్తత తీసుకుని అభివృద్ధి చేసిన ఇబ్రహీంపూర్ సభలో వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. మీ ప్రేమతో ఇక రాజకీయాల నుంచి విరమించుకుంటే బాగుండననిపిస్తోందని.. హరీష్ రావు ప్రకటించారు ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేనిదని గద్గద స్వరంతో వ్యాఖ్యానించారు. రాజకీయాలలో ఉన్నా.. లేకున్నా మీ రుణం తీర్చుకుంటానంటూ కొనసాగింపు మాటలు మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్ోల తమ ఓటు హరీశ్రావుకేనంటూ ఇబ్రహీంపూర్ గ్రామస్తులంతా.. ఏకగ్రీవ తీర్మానం చేశారు.
రాజకీయాల నుంచి విరమించుకుంటానంటూ.. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం కావడం ఖాయంగా కనిపిస్తోంది. కొన్నాళ్ల నుంచి టీఆర్ఎస్ నుంచి.. హరీష్ రావు దూరం పెడుతున్నారని.. ఆయనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లుగా.. పార్టీ వ్యవహారాలలో హరీష్ రావు ప్రాధాన్యం దక్కడం లేదు. పార్టీ, ప్రభుత్వం తరపున కీలక నిర్ణయాల కోసం జరిగే చర్చల్లో హరీష్ రావుకు ప్రాతినిధ్యం దక్కడం లేదు. కొద్ది రోజుల కిందట నిర్వహించిన ప్రగతి నివేదన సభకు.. తన నియోజకవర్గం నుంచి ప్రజలను తరలించడం తప్ప.. మరే బాధ్యతను .. హరీష్ రావుకు కేసీఆర్ అప్పగించలేదు. కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ ను వారసునిగా తెరపైకి తీసుకు రావడానికి .. హరీష్ రావును సైడ్ చేస్తున్నారన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది.
ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తోంది. టిక్కెట్లు పొందని నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. భారీ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దీని వెనుక టీఆర్ఎస్ ముఖ్యనేతలున్నారన్న ప్రచారం జరిగింది. హరీష్ ప్రొద్భలంతోనే… నిరసనలు జరుగుతున్నాయని చెబుతున్నారు. అదే సమయంలో.. హరీష్ రావుపై .. నిఘా పెట్టారన్న ప్రచారం కూడా టీఆర్ఎస్ లో కలకలం రేపుతోంది. చాలా రోజుల నుంచి హరీష్ రావు.. ప్రధాన మీడియాకు ఇంటర్యూలు ఇస్తున్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతూ వస్తున్నారు. అయినా కేసీఆర్ నుంచి సానుకూల సందేశం రాకపోవడంతో.. చివరికి.. రాజకీయాల నుంచి విరమించుకుంటాననే ప్రకటనలు చేస్తున్నారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.మొత్తానికి ఈ వ్యవహారం చూస్తే.. టీఆర్ఎస్ లో అంతర్గత రాజకీయం క్లిష్ట దశకు చేరుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.