కుంతియా తెలంగాణ కాంగ్రెస్ కు పట్టిన శని అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలనే ఆదేశాలు హైకమాండ్ నుంచి.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అందాయి. వెంటనే దీనిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. కుంతియా, కమిటీల ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గతంలో కూడా ఆయనపై చాలా ఫిర్యాదులు వచ్చాయని కమిటీ తెలిపింది. ఏఐసీసీ ఇంఛార్జ్, కమిటీ సభ్యులపై అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించినట్లు గుర్తించామని క్రమశిక్షణా కమిటీ చెప్పింది. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ మీడియా ముందు పార్టీ వ్యతిరేకంగా మాట్లాడొద్దని సూచించినా పట్టించుకోకుండా పార్టీకి నష్టం జరిగేలా చేసిన వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని కమిటీ తెలిపింది. రెండు రోజుల్లో వివరణ ఇవ్వకుంటే కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది.
రెండు రోజుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివరణ ఇస్తారా లేదా అన్నదానిపై.. టీ కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. ఎవరికీ భయపడబోనని చెప్పారు కాబట్టి… ఆయన వివరణ ఇవ్వరని చెబుతున్నారు. వివరణ ఇవ్వకపోతే.. కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. కమిటీలపై రాజగోపాల్ రెడ్డి సోదరుడు… వెంకటరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. మ్యానిఫెస్టో కమిటీకి డిఫ్యూటీ చైర్మన్ గా వేయడం… పబ్లిసిటీ కమిటీకి చైర్మన్ గా వేయడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి మాత్రం భిన్నమైన స్వరం వినిపించారు. కొద్ది రోజుల కిందట ఢిల్లీలో రాహుల్ గాంధీతో జరిగిన సమావేశంలో.. కూడా.. పార్టీ అధ్యక్షుడు బహిరంగవ్యాఖ్యలు చేస్తే ఎంతటి వారనైనా క్షమించబోమని హెచ్చరించినట్లు ప్రచారం జరిగింది. అయినా రాజగోపాల్ రెడ్డి అన్నింటికీ తెగించే వ్యాఖ్యలు చేసినట్లు అనుమానిస్తున్నారు. సీనియర్ నేత వి. హనుమంతరావుపై కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంగా ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో నేతలందరూ.. సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే ఎన్నికల సమయంలో వీటిని పూర్తిగా కంట్రోల్ చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే .. రెండు రోజుల్లో వివరణ ఇవ్వకపోతే.. రాజగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి తొలగించే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే నిజమైతే కాంగ్రెస్ హైకమాండ్ డేరింగ్ స్టెప్ తీసుకున్నట్లే. మరొకరు బహిరంగంగా మట్లాడటానికి భయపడతారని చెప్పుకోవచ్చు.