ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాకి మించిన ప్రయోజనాలను భాజపా ఇచ్చిందన్నారు రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. 2019లో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ(?) భాజపా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా గురించి కనీస పరిజ్ఞానం లేకుండా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో భాజపా పోటీ చేస్తుందన్నారు! ‘ఈ రాష్ట్రంలో ప్రజలను ఓటు అడిగే హక్కు ఒక్క భాజపాకి మాత్రమే ఉంది. అధికారంలో ఉన్న టీడీపీకీ లేదు, ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్యూర్ అయిన జగన్మోహన్ రెడ్డికీ లేదు, కొత్తగా పుట్టిన జనసేనకీ లేదు. ఎందుకంటే, ప్రధాని నరేంద్ర మోడీ ఈ రాష్ట్ర కోసం అనేక (?) అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు కాబట్టి’ అన్నారు కన్నా.
రాష్ట్రానికి చాలా చేశామని చెప్పుకుని ప్రజల్లోకి వెళ్లే అజెండా ఒక్క భాజపా దగ్గర మాత్రమే ఉందన్నారు! ఆంధ్రాలో అధికారం తమదేననీ, ప్రజలు నిజం తెలుసుకున్న రోజున ఒక్క భాజపాకి మాత్రమే ఓటేస్తారన్నారు. రైల్వేజోన్ చట్టంలో పరిశీలించమని చెప్పినా కూడా, విశాఖ జోన్ ఇస్తామని రాజ్ నాథ్ సింగ్ పార్లమెంటు సమావేశాల్లో చెప్పారన్నారు. చట్టం పదేళ్లు సమయం ఇచ్చినా కూడా ఐదోళ్లలోనే చట్టంలో ఉన్నవీ లేనివీ కూడా చేశామన్నారు! పోలవరం నిర్మాణంలో అవినీతి జరిగిందని కాగ్ చెప్పిందనీ, ఒక ప్రొసీజర్ ప్రకారం ఈ విషయమై ముందుకు పోతామన్నారు. చంద్రబాబు నాయుడు జ్వరం వచ్చినా అది మోడీ కుట్ర అనేలా ఉన్నారనీ, ప్రధానిని చూసి ముఖ్యమంత్రి భయపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు కన్నా!
అన్నీ చేసేశామనడం భాజపా నేతలకు ఒక అలవాటైపోయింది. ఈ మాటలపై ప్రజలు ఎలా స్పందిస్తున్నారనే ఫీడ్ బ్యాక్ తెప్పించుకోరేమో. రైల్వేజోన్ ఏదీ కడప ఫ్యాక్టరీ ఏదీ రెవెన్యూ లోటు భర్తీ ఏదీ అంటూ ఇలా ఒక్కో పాయింట్ అడిగేసరికి… అన్నీ పరిశీలనలో ఉన్నాయంటారు! విభజన చట్టంలో లేనివి కూడా చేసేశామని చెబుతున్నారే, ఉన్నవి ఎందుకు చేయడం లేదో కన్నా సరిగా ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. ఇక, ఆంధ్రాలో ఓటు అడిగే హక్కు కేవలం భాజపాకి మాత్రమే ఉందీ, అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పడం మరీ హాస్యాస్పదంగా ఉంది. ఓట్లు అడిగే హక్కు ఎవ్వరికీ లేదంటే… మరి, రాష్ట్రంపై భాజపా అంత బాధ్యతతో ఉందని ప్రజలు నమ్ముతున్నారని ఏపీ నేతలు అనుకుంటోందా..? ఏపీలో భాజపాపై ఎంతమంది విశ్వాసంతో ఉన్నారు అనేది ఒక సర్వే చేయించుకుంటే… ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటో అర్థమౌతుంది. అయినా, జాతీయ స్థాయిలో ఏపీ మీదున్న భాజపా వైఖరి రాష్ట్ర నేతలకు ఎప్పటికీ అర్థం కాదు. రాష్ట్ర నేతల మాటలకీ, కేంద్రంలో భాజపా నేతలకీ ఎక్కడా పొంతన ఉండటం లేదు. ఇది ఏపీ నేతలకు అర్థమౌతోందా, లేదంటే.. అర్థమైనా సరే తమ నిస్సహాయతను బయటపెట్టుకోవడం ఎందుకూ అనే అభిప్రాయంతో ఉన్నారా అనేది వారికే తెలియాలి.