ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు తెరాస నేత తుమ్మల నాగేశ్వరరావు! కార్యకర్తలతో మాట్లాడుతూ… ఈ ఎన్నికల్ని ఆషామాషీగా తీసుకోవద్దన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి తాను మాటిచ్చాననీ, జిల్లాలో అన్ని సీట్లూ గెలవడం ఎంత ముఖ్యమో… సత్తుపల్లి నియోజక వర్గం అంతకంటే ముఖ్యమని తుమ్మల చెప్పారు. ‘ఒకవేళ మీరు ఆషామాషీగా తీసుకుంటే… మీ మనిషి తుమ్మల నాగేశ్వర్రావు వచ్చే క్యాబినెట్ లో ఉండడు. కాబట్టి, అది మీరందరూ గమనించాల. అది నేను ఎంత అవసరంగా చెప్తున్నానో మీరు గుర్తు చేసుకోవాలి’ అన్నారు.
జిల్లాలోని నియోజక వర్గాలన్నీ ఒకెత్తు అయితే… సత్తుపల్లి మాత్రం మరొకెత్తు, దానిపై చాలా శ్రద్ధ పెట్టాలని తుమ్మల ఎందుకు అంత ఇదిగా చెప్తున్నట్టు అనే అనుమానం కలుగుతోంది కదా! గతంలో ఆయన మూడుసార్లు సత్తుపల్లి నుంచి గెలిచారు. ప్రస్తుతం పాలేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఇప్పుడు సత్తుపల్లి మీద ప్రత్యేక దృష్టికి కారణం… అక్కడ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ సత్తుపల్లి నుంచే సండ్ర పోటీ చేయడం దాదాపు ఖాయం. పైగా, ప్రస్తుతం టీడీపీకి అక్కడ మంచి పట్టు ఉంది. పైగా, చంద్రబాబుకి సండ్ర తిరుగులేని శిష్యుడనే ఇమేజ్ ఉండటంతో… ఇక్కడ తెరాస ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెప్పుకోవచ్చు.
తుమ్మల వ్యాఖ్యల్లో కొంత బెదిరింపు ధోరణి కూడా కనిపిస్తోంది. దానికీ కారణం లేకపోలేదు. ప్రస్తుతం అక్కడ తెరాసలో ఉన్న చాలామంది గతంలో టీడీపీ నుంచి వలస వచ్చినవారే. కాబట్టి, రాబోయే ఎన్నికల్లో వారంతా మరోసారి టీడీపీవైపు మొగ్గితే… తెరాస ఓటమి పక్కా! అందుకే, అలాంటి పరిస్థితి రాకూడదనీ, ఇది తన ప్రతిష్ఠకు సంబంధించిన అంశమనీ, రాష్ట్రంలో తన ఇజ్జత్ కా సవాల్ అన్నట్టుగా కార్యకర్తలకూ ఇతర నేతలకూ స్వీట్ వార్నింగే ఇచ్చారని చెప్పొచ్చు. నిజానికి, ఖమ్మంలో టీడీపీకి మొదట్నుంచీ మంచి పట్టుంది. అందుకే, ఇప్పుడీ జిల్లా బాధ్యతల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తుమ్మలకి ఇచ్చారు. అన్ని సీట్లూ గెలవడం ఒకెత్తు అయితే, సత్తుపల్లిని కైవసం చేసుకోవడం మరో ఎత్తు అనేది కూడా తుమ్మలకి కేసీఆర్ నిర్దేశించిన కీలక లక్ష్యంగా కనిపిస్తోంది. తుమ్మల కూడా సత్తుపల్లి నియోజక వర్గానికి చెందినవారే కదా! ఆయన కూడా టీడీపీ నుంచి తెరాసకు వలస వచ్చినవారే. ఆయన వచ్చేశారేమోగానీ.. టీడీపీ కేడర్ ఇంకా బలంగా ఉందనే నమ్మకం ఆయనకీ ఉందని తాజా వ్యాఖ్యల ద్వారా తుమ్మల చెబుతున్నట్టుగానూ అనుకోవచ్చు.