రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్ల వ్యవహారంలో.. కొన్ని వేల కోట్ల అవినీతి జరిందని కాంగ్రెస్ పార్టీ … బీజేపీ, మోడీపై.. ఓ రేంజ్ యుద్ధాన్నే చేస్తోంది. ఎలా సమర్థించుకోవాలో తెలియని బీజేపీ నేతలు.. రాహుల్ గాంధీపై జోకులేసుకుని.. టైం పాస్ చేస్తున్నారు. కానీ రాఫెల్ విషయంలో.. బయటకు వస్తున్న ఒక్కొక్క నిజం.. బీజేపీని, మోడీని.. వెంటాడి.. వేటాడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ.. రాఫెల్ డీల్ విషయంలో ఎన్నో అనుమానాలు నిపుణులు వ్యక్తం చేసినా.. ఒక్క దానికి క్లారిటీ ఇవ్వలేదు కేంద్రం. ప్రభుత్వ రంగం సంస్థ.. పూర్తి వనరులు ఉన్న హెచ్ఏఎల్ను కాదని… అప్పటికి ప్రారంభమై పదిహేను రోజులే అయిన.. అనిల్ అంబానీ కంపెనీకి.. ఈ కాంట్రాక్ట్ దక్కిందనేది.. ఈ స్కాంలో చాలా కీలకమైన అంశం.
అయితే.. ఫ్రాన్స్ కు చెందిన.. దస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ.. అనిల్ అంబానీ కంపెనీని ఎంచుకుందని.. దానికి.. కేంద్రంతో సంబంధం లేదని… మోడీ చెప్పుకొచ్చారు. కానీ అసలు నిజం ఏమిటో.. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే ప్రకటించారు. ఈయన హయాంలోనే..మోడీ ఒప్పందాలు చేసుకున్నారు. రాఫెల్ జెట్ ఒప్పందంలో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ ఇండస్ట్రీస్‌ను ఇండియన్ పార్టనర్‌గా నియమించాలని భారత ప్రభుత్వమే ఫ్రెంచ్ ప్రభుత్వాన్ని కోరిందని ఆయన స్పష్టంగా ప్రకటించారు. దస్సాల్ట్ ఏవియేషన్‌కు భారత భాగస్వామిగా ఎవరు ఉండాలన్నదానితో ఫ్రాన్స్ ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. సర్వీస్ ప్రొవైడర్‌గా అనిల్ అంబానీ కంపెనీ పేరును భారత ప్రభుత్వం ప్రతిపాదించిందని డస్సాల్ట్ కంపెనీ ఎంచుకోలేదని ఆయన కుండ బద్దలు కొట్టి చెప్పేశారు.
కాగా 2016లో భారత ప్రభుత్వం, ప్రాన్స్ ప్రభుత్వంతో డస్సాల్ట్ కంపెనీకి చెందిన 36 రఫెల్ ఫైటర్ జెట్ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఎవరు హెచ్‌ఏల్‌ను తొలగించారు.. ఎవరు అంబానీ కంపెనీకి కాంట్రాక్ట్ వెళ్లేలా చేశారన్నదానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. హోలాండ్ వ్యాఖ్యలు నిజమని తేలితే మోదీ సర్కార్ ను ఎవరూ కాపాడలేరు. ఈ విషయం బయటకు తెలిసిన వెంటనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. సైనికుల రక్తతర్పణాలను అవమానపరిచారని మండి పడ్డారు. ఈ రాఫెల్ యుద్ధ విమానం.. ఎన్డీఏ ప్రభుత్వాన్ని నేరుగా వచ్చి ఢీకొట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.