తెలుగుదేశం పార్టీ నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు గ్రేటర్‌లోని తెలుగుదేశం నాయకులకు చిర్రెత్తిస్తున్నాయి. సరిగ్గా ఇది ఎన్నికల ప్రచార సమయం కావడంతో.. తమలో అసహనాన్ని బయటకు కక్కడానికి కూడా అనువైన సమయం కాదని వారు మండిపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తెలుగుదేశం పార్టీకి స్వతహాగా అంతో ఇంతో మంచి పట్టు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఎన్నికల పర్వం పూర్తయ్యేలోగా ఆ పట్టు పలుచబడుతుందేమోనని పార్టీ వర్గాల్లోనే భయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు రకరకాల కారణాలు దారితీయగలవని కూడా అనుకుంటున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంనుంచి వచ్చి హైదరాబాదులో స్థిరపడిన వారిసంఖ్య ఇక్కడ బాగా గణనీయంగానే ఉన్న సంగతి అందరికీ తెలిసిన సంగతే. ఈ వర్గం ఓట్లు విజయాన్ని ప్రభావితం చేసే స్థాయిలోనే ఉంటాయనే ఉద్దేశంతోనే తొలినుంచి తెరాస సహా అన్ని పార్టీలూ సెటిలర్ల ఓట్ల మీద ఆధారపడి ఉంటాయన్న సంగతి అందరికీ తెలుసు. అలాంటి సమయంలో ఏపీ ప్రాంతంనుంచి జనాకర్షణ కలిగిన నాయకుల్ని ఇక్కడ ఎన్నికల ప్రచారంలో మోహరిస్తే.. పార్టీకి అంతో ఇంతో ప్రయోజనం ఉండే అవకాశం ఉంది. అసలే డివిజన్ల విభజన, టికెట్ల కేటాయింపులోనే చాలా అవకతవకలు తెలిసీ పార్టీ అవకాశాలను పణంగా పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం యాజమాన్యం.. ఇప్పుడు ఏపీ నేతల్ని ప్రచారానికి పురమాయించడంలోనూ విమర్శల్ని ఎదుర్కొంటోంది.
గ్రేటర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించే బాధ్యతను చంద్రబాబు ప్రధానంగా నలుగురు మంత్రులకు అప్పగించారు. వారెవ్వరో తెలుసా.. రావెల కిశోర్‌బాబు, శిద్ధా రాఘవరావు, అయ్యన్నపాత్రుడు, కింజరాపు అచ్చెన్నాయుడు. నిజానికి సెటిలర్ల విషయంలో క్రౌడ్‌పుల్లర్ నేతలుగా వీరికి ఉన్న చరిష్మా ఏపాటిది? అని గ్రేటర్ నేతల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీలోనే తమ తమ సొంత జిల్లాల్లో తప్ప పక్క జిల్లాల్లో కూడా క్రేజ్ లేని ఈ నాయకులతో గ్రేటర్ ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లడానికేనా, లేదా, పడుకోబెట్టడానికా అని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.
అంతో ఇంతో జనాన్ని ఆకట్టుకోగల.. అడ్డంగా విమర్శలతో విరుచుకుపడుతూ ప్రజలను మెప్పించగల ధాటి ఉన్న వారు, కనీసం సినిమా క్రేజ్ ఉన్న బాలకృష్ణ వంటి వారిని గ్రేటర్లో ప్రచారానికి పురమాయించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. జనాకర్షణ పరంగా పెద్ద ఆకర్షణబలం లేని ఈ నలుగురు నేతలను ప్రచారినికి నియోగించడం ద్వారా గ్రేటర్ ఎన్నికలను పార్టీ సీరియస్‌గా తీసుకోవడం లేదనే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళతాయనే ఆందోళనలు కూడా వెల్లువెత్తుతున్నాయి