భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిని అంటే.. అన్నీ అడ్డదిడ్డంగా.. మాట్లాడటమేనని.. ఎంపీ జీవీఎల్ నరసింహారావు భావిస్తున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. యూపీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయిన తర్వాత ఆయన పూర్తిగా ఏపీ మీద దృష్టి కేంద్రీకరించారు. ఆయన బీజేపీని బలోపేతం చేసుకునే ప్రయత్నాలేమైనా చేశారో లేదో కానీ.. ఏపీ ప్రభుత్వంపై.. చిత్రవిచిత్రమైన రీతిలో ఆరోపణలు చేసి.. వాటిని కాదని నిరూపించుకోవాలని సవాళ్లు చేసి ఢిల్లీ వెళ్లి పోతూంటారు. ప్రత్యేక ప్యాకేజీ నిధుల దగ్గర్నుంచి పీడీ అకౌంట్ల వరకూ.. జీవీఎల్ నర్సింహారావు.. ఏపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ప్రతీ విషయంలోనూ… టీడీపీ నేతలు…పక్కాగా సమాధానాలు చెబుతున్నారు. ఎప్పుటికప్పుడు.. “కావొచ్చు.. కాకపోవచ్చు.. నాకొచ్చిన సమాచారం” అంటూ.. తప్పించుకున్నారు కానీ.. ఎప్పుడూ.. సిన్సియర్‌గా తను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉండలేదు.
ఏదో ఒక ఆరోపణ చేసి.. ప్రజల్లో అనుమానాలు కలిగేలా చేస్తే.. అదే వారి మనసుల్లో పడి ఉంటుందిలే అని జీవీఎల్ ఆశ పడుతున్నట్లుగా గా ఉంది. చివరికి ముఖ్యమంత్రి అమెరికా పర్యటన విషయంలోనూ ఆయన స్పందన అంతే ఉంది. ఐక్యరాజ్యసమితి నుంచి చంద్రబాబుకు ఆహ్వానం రాలేదని.. అదో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు అని తేల్చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని ఆహ్వాన లేఖ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నిజానికి ఆ లేఖను ప్రభుత్వం ఎప్పుడో బయట పెట్టింది. సరే జీవీఎల్ సవాల్ చేశాడు కదా.. అని ఏపీ సీఎంవో మళ్లీ ఆ లేఖను రిలీజ్ చేసింది. దానిపైనా అడ్డదిడ్డమైన ఆరోపణలు ప్రారంభించారు. ఆ లేఖను పంపించిన యూఎన్వో… అధికారిపై … అంతర్గతంగా ఏవో ఆరోపణలు ఉన్నాయట. అది వాళ్ల అంతర్గత వ్యవహారం.. దానికి సదస్సుకు ఏంటి సంబంధం ..!
నిజానికి చంద్రబాబు పర్యటనకు సంబంధించిన విరాలు కేంద్రం వద్ద ఉంటాయి. ఏ ముఖ్యమంత్రి.. విదేశీ పర్యటనకు వెళ్లాల్సి వచ్చినా.. కేంద్రం నుంచి కచ్చితంగా అనుమతి రావాల్సి ఉంటుంది. టూర్ డీటైల్స్ మొత్తం ఉంటాయి. నిజంగా.. ఐక్యారాజ్య సమితి నుంచి… చంద్రబాబుకు ఆహ్వానం రాకపోతే.. ఆ విషయం కేంద్రం కనుక్కోవడం.. నిమిషాల్లో పని. ఆ పని జీవీఎల్ నరసింహారవు చేయకుండా… ఓ సారి అసలు ఇన్విటేషన్ రాలేదని..మరోసారి.. ఇన్విటేషన్ పంపిన వ్యక్తిపై ఆరోపణలున్నాయని.. మరో సారి ప్రైవేటు సంస్థ అంటూ… మసిపూసి … మారేడుకాయ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో ఏదో ఓ అనుమానం రేకెత్తిస్తే.. తన టాస్క్ పూర్తయినట్లు అని జీవీఎల్ భావిస్తున్నారు. పీడీ అకౌంట్ల విషయంలోనూ అంతే. అవేవో ప్రభుత్వ అధికారుల వ్యక్తిగత ఖాతాలన్నట్లు ప్రచారం చేశారు. కానీ ఒక్క రూపాయి అవినీతిని నిరూపించలేకపోయారు. కానీ అనుమాబీజాలు మాత్రం ప్రజల మనసుల్లో నాటానని ఆయన సంతృప్తి పడిపోతున్నారు. అలాంటిదే.. ఇప్పుడు చంద్రబాబు అమెరికా టూర్‌పై జరుగుతున్న రచ్చ. ఎందుకీ రగడ.. ఒక్క రోజులో.. చంద్రబాబు యూఎన్వో మీటింగ్‌లో ప్రసంగిస్తారో లేదో తేలిపోతుందిగా..!