తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చ… క్యాబినెట్ విస్తరణ! చాన్నాళ్లుగా ఇది నానుతూ వస్తోంది. ఇప్పుడు ఎన్నికలకు దగ్గరకి వచ్చేస్తుండటంతో ఇప్పుడున్న మంత్రివర్గంలో మార్పులు చేర్పులే చేసేంత అవసరం దాదాపు ఉండదనే స్పష్టతే ఇప్పుడు పార్టీ వర్గాల్లో ఉంది. అయితే, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని… సామాజిక సమీకరణాల దృష్ట్యా ఇద్దరికి క్యాబినెట్ లో చోటు కల్పించే అవకాశం ఉంది! కేంద్రంలో ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలిగాక, ఏపీ క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్న ఇద్దరు భాజపా సభ్యులు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు బెర్తులనూ భర్తీ చేస్తారనే ప్రచారం ఆ మధ్య చాలారోజుగా సాగింది. క్యాబినెట్ లో ముస్లింలకు ప్రాధాన్యత కల్పిస్తారనీ, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ షరీఫ్ కి అవకాశం దక్కుతుందనే ప్రచారం కొన్నాళ్లు సాగింది.
ఆ తరువాత, రాయలసీమ ప్రాంతానికి చెందినవారికే ఇవ్వాలన్నది చంద్రబాబు ఆలోచన అన్నారు. చాంద్ బాషా పేరు వినిపించినా… ఆయన వైకాపా టిక్కెట్ మీద గెలిచి, టీడీపీలో చేరినవారు. ఇప్పటికే అలా వచ్చినవారు మంత్రి వర్గంలో ఉండనే ఉన్నారు. దాంతో కొన్నాళ్లపాటు వార్తల్లో ఆయన పేరు కూడా వినిపించి, పక్కకు వెళ్లింది. చివరికి, మండలి ఛైర్మన్ గా ఉన్న ఫరూఖ్ కి దక్కుతుందని ప్రచారం జరిగింది. ఈ చర్చ కూడా ఈ మధ్య పక్కకు వెళ్లింది. ఈ మధ్య జలీల్ ఖాన్ కూడా అవకాశం ఇస్తే తానూ బాధ్యతలు నిర్వహిస్తానంటూ సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పార్టీ వర్గాల నుంచి ఇప్పుడు వినిపిస్తున్న అభిప్రాయం ఏంటంటే… ఎన్నికల ముందు రెండు స్థానాలూ భర్తీ చేయకపోయినా, కనీసం ముస్లింలకు అవకాశం ఇస్తే ఎన్నికల్లో ఉపయోగపడుతుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
నిజానికి, ముస్లింలకు ఈ పదవి ఇద్దామని అనుకున్నా… అనూహ్యంగా ఆశావహుల పోటీ పెరిగిపోయింది. దీంతో ఒకరికి ఇస్తే, మరొకరి అసంతృప్తికి గురౌతారేమో అనే ఉద్దేశంతో చంద్రబాబు ఏదీ తేల్చలేదనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే, భాజపా సభ్యులు రాజీనామా చేసిన వెంటనే భర్తీ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనీ కొందరు అంటున్నారు! ఎన్నికల ముందు సామాజిక వర్గ సమీకరణాలను దృష్టి పెట్టుకుని ఇప్పుడైనా భర్తీ చేస్తేనే మంచిదనే చర్చా జరుగుతోంది. ఏదేమైనా, ముఖ్యమంత్రి అమెరికా టూర్ ముగించుకుని వచ్చిన తరువాత దీనిపై చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. వాస్తవానికి, ఇప్పటికిప్పుడు కొత్తగా మంత్రి పదవి ఇచ్చినా ఆ సభ్యులు ప్రత్యేకంగా చెయ్యగలిగేదంటూ ఏమీ ఉండదు! కేవలం ఎన్నికల్లో ప్రచారానికే ఉపయోగపడుతుంది. పైగా, ఎన్నికలు దగ్గరకి వచ్చాకే ఫలానా సామాజిక వర్గం చంద్రబాబుకు గుర్తొచ్చిందనే విమర్శలకు ఆస్కారం ఇచ్చినట్టూ అవుతుంది.