అభ్యర్థుల ఎంపిక విషయమై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ వైకాపాలో భారీ కసరత్తే మొదలైంది. నియోజక వర్గాల వారీగా సర్వేలు, నివేదికలు, ఆశావహుల గురించి కేడరూ ప్రజల్లో అభిప్రాయాలున్నాయి… ఇలా అన్నింటిపైనా వైకాపా అధినాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అయితే, ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక సంబంధించి ఓ కొత్త ఫార్ములాను అనుసరించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ముందుగా, ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసి… ఆ తరువాత, ఎమ్మెల్యేల గురించి ఆలోచించాలని వ్యూహంలో ఉన్నట్టు సమాచారం.
ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎంపీ అభ్యర్థుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ భావిస్తోందట! అంటే, ఒక లోక్ సభ నియోజక వర్గ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాల్లో ఎవరిని నిలబెట్టొచ్చు అనేది ఎంపీ అభ్యర్థి కూడా డిసైడ్ చేస్తారన్నమాట! ఇలా ఎంపీ అభ్యర్థికి ప్రాధాన్యత ఇవ్వడంతో… ఆ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులతో సరైన సమన్వయం వస్తుందనీ, పార్టీ గెలుపుకోవడం పక్కాగా పనిచేయగలుతారనీ, ఎంపీలకు బాధ్యతల్ని అప్పగించడం ద్వారా పార్టీకి కొంత ఉపశమనంగా ఉంటుందనేది వైకాపా వ్యూహంగా తెలుస్తోంది. ముందుగా, రాజధాని ప్రాంతమైన గుంటూరు, నర్సరావుపేటల్లో ఇదే మోడల్ లో ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేస్తారని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ముందుగానే పార్టీ తయారుచేసి, ఎంపీ అభ్యర్థుల ముందు ఉంచుతారట! వారి అభిప్రాయాలు తీసుకున్నాక తుది నిర్ణయం తీసుకుంటారట. దీంతో ఎమ్మెల్యే టిక్కెట్ల చర్చలన్నీ ఎంపీ అభ్యర్థుల దగ్గరే జరుగుతాయని అంటున్నారు! ప్రతీ ఎంపీకీ తమకు నచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేల అభ్యర్థులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంటుందట. మిగతా స్థానాల్లో కూడా సదరు ఎంపీ అభ్యర్థి అభిప్రాయానికే ప్రాధాన్యత ఉంటుందనీ అంటున్నారు. ఇలా చెయ్యడం వల్ల పార్టీలో అసమ్మతి స్వరం కూడా తగ్గుతుంది అనేది వ్యూహంగా చెబుతున్నారు.
వినడానికి బాగానే ఉన్నా.. ఆచరణ సాధ్యమా అనేదే ప్రశ్న..? ఎందుకంటే, ఆశావహులందరూ అధినాయకత్వం చుట్టూ చక్కర్లుకొడతారుగానీ… ఎంపీ అభ్యర్థుల చుట్టూ తిరగాలంటే ఎలా..? ఇంకోటి, ఎంపీ అభ్యర్థులను అంతటి స్వేచ్ఛ ఇస్తే, వారు కూడా అధికార కేంద్రాలుగా మారే అవకాశం ఉంది. వైకాపాలో మరొకరు శక్తివంతులుగా కనిపించడం అనేది ఇంతవరకూ లేదు కదా! పైగా, ఈ ఎంపీ అభ్యర్థులు నిర్ణయాలను ఆశావహులు ప్రతిఘటించరనే నమ్మకం ఏముంది..? అయితే, ఒక ఎంపీ సెగ్మెంట్ లోని అన్ని అసెంబ్లీ స్థానాల బాధ్యతలూ ఒక అభ్యర్థికి అప్పగించడం అంటే… ఆర్థికంగా ఆయా ఎమ్మెల్యేల ప్రచారాలూ ఖర్చులూ వగైరావగైరాలు కూడా అప్పగించడం అనేది పార్టీ అసలు వ్యూహం అయి ఉంటుంది..!