తెలుగులో ‘అర్జున్‌రెడ్డి’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. విజయ్ దేవరకొండను ఓవర్‌నైట్ స్టార్‌ను చేసింది. ‘ఆర్‌ఎక్స్ 100’ వంటి సినిమాలకు దారి చూపింది. బోల్డ్ సినిమాలకు బాటలు వేసింది. ‘అర్జున్‌రెడ్డి’ని చూడని తెలుగు యువతీయువకులు లేరంటే అతిశయోక్తి లేదు. మ్యాగ్జిమమ్ తెలుగు ఆడియన్స్ చూసేసిన ఈ సినిమాను తమిళంలో విమర్శకులు ప్రశంసలందుకున్న సినిమాలు తీసిన దర్శకుడు బాల ‘వర్మ’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తమిళ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేస్తారా? అనే డౌట్స్ వస్తున్నాయి.
హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ ‘వర్మ’తో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఆదివారం ధృవ్ బర్త్‌డే సందర్భంగా సినిమాలో అతని ఫస్ట్‌లుక్, సినిమా టీజర్ విడుదల చేశారు. తెలుగు ప్రేక్షకులు టీజర్ మీద సెటైర్లు వేస్తున్నారుకోండి… ఆ విషయం పక్కన పెడితే, తెలుగులో కూడా ‘వర్మ’ పోస్టర్, లుక్ విడుదల చేశారు. తెలుగు సినిమాను తమిళంలో రీమేక్ చేస్తూ, ఆ సినిమా పోస్టర్లు తెలుగులో విడుదల చేయడం ఎందుకు?? దీని వెనుక విక్రమ్ వున్నాడని టాక్!! విక్రమ్‌కి తెలుగు మార్కెట్ విలువ తెలుసు. రజనీకాంత్, కమల్‌హాసన్ తరవాత తెలుగులో మార్కెట్ సంపాదించుకున్న హీరో విక్రమే. తనయుడికీ తెలుగులో మార్కెట్ ఏర్పాడాలని విక్రమ్ ఆశిస్తున్నాడట! అందుకని, తెలుగు సినిమా రీమేకైనా… విక్రమ్ తనయుడు ఎలా చేశాడోనని కొంతమంది ఆసక్తి కనబరుస్తారు కదా!! ఆ ఉద్దేశంతో విడుదల చేయాలనుకుంటున్నారేమో?