నందమూరి బాలకృష్ణ కనుసన్నల్లో రూపొందుతోన్న సినిమా ‘యన్.టి.ఆర్’. తండ్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా కనుక ప్రతి విషయంలో జాగ్రత్త వహిస్తున్నారు. చాలా అంశాలపై ఆయనకు అవగాహన ఉంది. ఎందులోనూ చిన్న చిన్న పొరపాట్లు దొర్లడానికి ఆయన ఇష్టపడటం లేదు. ఇదే సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాత్ర కూడా ఉంది. అక్కినేనిగా ఆయన మనవడు సుమంత్ నటిస్తున్నాడు. ఈ పాత్ర విషయంలో మాత్రం సుమంత్ సోదరి, అక్కినేని మనవరాలు సుప్రియ జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏయన్నార్‌గా సుమంత్ లుక్ కూడా ఆమె ఆమోదముద్ర వేశాక బయటకు వచ్చింది. ఈ విషయాన్ని సుమంతే స్వయంగా తెలిపాడు.
‘‘ఎన్టీఆర్ సినిమా ప్రారంభం నుంచి కాస్ట్యూమ్ డిజైనర్స్‌తో, దర్శకుడు క్రిష్‌తో సుప్రియ మాట్లాడుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ టీమ్‌కి తాతగారి పాత ఫొటోలు పంపిస్తూ, అవసరమైన విషయాలు చెబుతూ టచ్‌లో వుంది. కొంచెం ఇన్వాల్వ్ అవుతోంది. అందుకని, సినిమాలో నా ఫస్ట్‌లుక్‌ని తనకు పంపించా. నాకు పెద్ద క్రిటిక్ కూడా తనే. బాలేదంటే ముఖం మీద చెప్పేస్తుంది. లుక్‌కి సంబంధించి బిగినింగ్‌లో కొన్ని కరెక్షన్స్ అనుకున్నాం. కాని సుప్రియకు విడుదల చేసిన లుక్ పంపగానే… ‘ఏం మార్చవద్దు. ఇదే విడుదల చేయండి. మరో ఆలోచన వద్దు’ అని చెప్పింది. వెంటనే విడుదల చేశాం’’ అని తాజా ఇంటర్వ్యూలో సుమంత్ చెప్పాడు. అక్కినేని లుక్ విషయంలో ఆయన మనవరాలి ఆమోదముద్ర పడ్డాక బయటకు వచ్చిందన్న మాట!! మామూలుగా అన్నపూర్ణ స్టూడియో నిర్మించే సినిమాల పనులు, స్టూడియో నిర్మాణ వ్యవహారాలు సమర్ధవంతంగా నిర్వహిస్తారని సుప్రియకు ఇండస్ట్రీలో మంచి పేరుంది!!