క్లాస్ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ అంటూ రెండు వర్గాలున్నాయి. సున్నితమైన ఎమోషన్స్, వినోదం క్లాస్‌కి నచ్చుతాయని, ఫైట్లూ, పాటలూ మాస్ కోసమని కొన్ని లెక్కలున్నాయి. బీ, సీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని సీన్లు రాసుకోవడం దర్శకులకు మామూలే. ఊర మాస్ ఫైటింగు సీన్లు, ఓ ఐటెమ్ పాట ఉంటే… బీసీల్లో థియేటర్లు ఈలలు, గోలలతో దద్దరిల్లిపోతాయని సినీ జనాల నమ్మకం. నిన్నా మొన్నటి వరకూ ఇలానే నడిచిందేమో. ఇప్పుడైతే లెక్కలు మారాయి. బీ సీ ఆడియన్స్ అభిరుచులు, వాళ్ల ఇష్టాలు, అంచనాలు అన్నీ మారిపోయాయి. ఫైటు కోసం ఫైటు, పాట కోసం పాట అనగానే బీ,సీల్లోనూ పెదవి విరుస్తున్నారు. కేవలం ఫైట్లు, పాటలతో బీసీ మనసులు గెలవలేని ఇటీవల బాక్సాఫీసు ఫలితాలు తేల్చి చెప్పాయి. దానికి తాజా ఉదాహరణ ‘సామి’.
దర్శకుడు హరికి మాస్ పల్స్ బాగా తెలుసు. సింగం సిరీస్ విజయవంతం కావడానికి అది బాగా దోహదం చేసింది. హీరో – విలన్ల పోరాటాలు, సవాళ్లు ప్రతిసవాళ్లు, మాస్ మసాలా డైలాగులతో థియేటర్లు దద్దరిల్లించేవాడు హరి. సరిగ్గా అదే.. ఫార్ములాతో వండిన వంటకం `సామి`. ఓ విధంగా చెప్పాలంటే సింగం సిరీస్‌కి ఇది కొనసాగింపు లాంటిదే. పేరు, హీరో మారాడంతే. సింగంలో ఎలాగైతే హీరో, విలన్ల భీకరమైన అరుపులు, వాళ్ల సవాళ్లు ప్రతిసవాళ్లు, చొక్కాలు చించుకుని నడిరోడ్డుపై ఫైటింగులు చేసుకోవడం.. ఈ ఫార్ములా అంతా పూస గుచ్చినట్టు ఇరికించేశాడు. కానీ ఫార్ములా బెడసి కొట్టింది. ఫైటింగులకు తలలు పట్టుకుంటున్నారు. డైలాగులకు చెవులు మూసుకుంటున్నారు. పాటలొస్తే.. పారిపోవడానికి దాదాపుగా సిద్ధపడిపోతున్నారు ప్రేక్షకులు. బీ,సీ పల్స్ మారింది అనడానికి ఇంత కంటే ఉదాహరణ ఏం కావాలి??
పాటలూ, పాటలూ అవసరమే. కానీ బలవంతంగా ఇరికించేయకూడదు. మాస్ డైలాగులు పడాల్సిందే. కానీ మరీ లౌడ్ పనిచేయదు. హరి లాంటి తమిళ దర్శకులు కేవలం తమిళ జనాల్ని దృష్టిలో ఉంచుకుని సీన్లు రాసుకుంటారు. అలాంటి ఓవర్ లోడ్ సీన్లు తమిళంలో వర్కవుట్ అవుతాయేమో. తెలుగు ప్రేక్షకులకు ఇదంతా ఓ తలనొప్పి వ్యవహారంలా కనిపిస్తుంటుంది. ఇది వరకు తమిళం నుంచి యాక్షన్ చిత్రాలు భారీగా అనువద రూపంలో తెలుగులోకి వస్తుండేవి. వాటి నిండా ఫైట్లే. ఆయా చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులూ బాగానే ఆదరించారు. కానీ క్రమంగా… అరవ యాక్షన్ చిత్రాలపై మోజు తగ్గిపోయింది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాల్ని మినహాయిస్తే.. యాక్షన్ కథల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. లౌడ్ యాక్షన్ అయితే.. దాని జోలికి వెళ్లడం లేదు. తెలుగులోనూ తమ సినిమాల్ని మార్కెట్ చేసుకోవాలని భావించే తమిళ దర్శకులు, నిర్మాతలు… ఇక్కడ మారుతున్న ప్రేక్షకుల అభిరుచిని కూడా కాస్త గమనిస్తే మంచిది.