చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లతో పాటుగా చిత్రసీమకు నాలుగో స్థంభంగా నిలిచిన కథానాయకుడు నాగార్జున.
చిరు, బాలయ్య, వెంకీ ఇప్పుడు ఆచి తూచి సినిమాలు చేస్తుంటే – నాగ్ మాత్రం విజృంభిస్తున్నాడు. `మనం` తరవాత కథల ఎంపికలో తన పంథా పూర్తిగా మారిపోయింది. నవతరం దర్శకులతో, నటీనటులతో కలసి పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్న నాగ్.. అందుకు తగినట్టుగానే విజయాల్నీ అందుకుంటున్నాడు. మరోవైపు నిర్మాతగానూ విజయవంతమయ్యాడు. ఇద్దరు కొడుకుల కెరీర్‌పై దృష్టి పెడుతూనే, సోలోగా తన సినిమాల్ని విజయపథంవైపు నడిపిస్తున్నాడు. నాగ్ తాజా మల్టీస్టారర్ `దేవదాస్` ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నాగ్‌తో చేసిన చిట్ చాట్ ఇది.
పాత దేవదాస్‌కీ ఈ దేవదాస్‌కీ తేడా ఏమిటి?
నాన్నగారు చేసిన దేవదాస్ ఓ భగ్న ప్రేమికుడి కథ. ఓ ట్రాజెడీ సినిమా. ఈ దేవదాస్ అలా కాదు. ఈ సినిమా చూస్తున్నంతసేపూ నవ్వుతూనే ఉంటారు. ఇది నవ్వుల దేవదాస్. ఇది వరకు నేను డాన్ కారెక్టర్లు చాలా చేశా. వాటితో పోలిస్తే ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. గుండాయిజం, సెటిల్మెంట్లు చాలా తక్కువ. ఓ డాక్టర్‌తో తనకు స్నేహం ఎలా కుదిరింది? వాళ్లిద్దరి ప్రయాణం ఎలా మొదలైంది? అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
నానితో మీ కెమిస్ట్రీ ఎలా కుదిరింది?
నాని అంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఆయన సినిమాలు చాలా చూశా. ఇప్పుడు సెట్లో నటుడిగా చూశా. చాలా మంచి కెమిస్ట్రీ కుదిరింది. మల్టీస్టారర్ సినిమాలు చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇది వరకు కూడా చేశా. ఇప్పుడైతే యువ కథానాయకులతో చేయాలనిపిపిస్తోంది. నా వయసున్న హీరోలతో చేస్తే.. మళ్లీ మీరే `ఇది ముసలోళ్ల సినిమా` అని రాస్తుంటారు. యంగ్ హీరోలతో కాంబినేషన్ బాగుంటుంది కదా. ఇప్పుడు అలాంటి స్క్రిప్టులు ఎక్కువగా వస్తున్నాయి కూడా.
సోలో హీరోగా తగ్గించేసినట్టేనా?
సోలోగా కూడా సినిమాలు చేస్తున్నా. నిజం చెప్పాలంటే ఇప్పుడు అలాంటి కథలు చాలా తగ్గుతాయి. ఈ వయసులో లవ్ స్టోరీలు చేయలేను. సాఫ్ట్ వేర్ ఉద్యోగిగానూ చేయలేను. కొత్తగా కనిపించాలి. నా స్టైల్‌కి తగ్గ కథల్ని ఎంచుకోవాలి.
అదే ఇప్పుడు కష్టం అవుతోంది. బాలీవుడ్లో బ్రహ్మాస్త్ర చేస్తున్నా. అది చాలా మంచి మంచి కథ. షూటింగ్ ఇంకా చాలా ఉంది. ధనుష్‌తో ఓ సినిమా చేస్తున్నా. తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతుంది. అదో పీరియాడికల్ కథ. 600 ఏళ్ల క్రితం పాత్ర పోషిస్తున్నా. చాలా ప్రత్యేకంగా ఉంటుంది
అఖిల్‌ని కూడా బాలీవుడ్‌కి పంపుతున్నార్ట నిజమేనా?
కరణ్ జోహార్, అఖిల్ ఇద్దరూ మంచి స్నేహితులు. వారిద్దరూ కలసి బాలీవుడ్లో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. నేనే కొంతకాలం ఆగమని చెప్పా. ఎందుకంటే అఖిల్ ఇప్పుడిప్పుడే తెలుగులో నిలదొక్కుకుంటున్నాడు. తనకో మంచి హిట్ పడాలి. తెలుగులో ఓ సినిమా బాగా ఆడాక.. అప్పుడు హిందీలో అడుగుపెడితే బాగుంటుంది. `ఎప్పటికైనా అఖిల్‌ని నువ్వే బాలీవుడ్లో పరిచయం చేద్దువు గానీ` అని కరణ్‌కి కూడా చెప్పా. చూద్దాం ఏం జరుగుతుందో..?
మిస్టర్ మజ్ను చూశారా?
చూశా. చాలా బాగా తీశాడు. అఖిల్‌కి మంచి సినిమా పడినట్టే.
నాని సెల్‌ఫోన్ పిచ్చోడంటూ ఓ వీడియో విడుదల చేశారు..
అవును.. నాని ఎప్పుడూ సెల్‌ఫోన్ చూస్తుంటాడు. చెప్పిన టైమ్ కి షూటింగ్ రావడం, సింగిల్ షాట్లో ఓకే చేసుకోవడం ఇవన్నీ పక్కాగా ఉంటాయి. కానీ సెల్‌ఫోన్ మాత్రం వదలడు. షాట్ అవ్వగానే పక్కకు వెళ్లి సెల్ ఫోన్ చూస్తూ కూర్చుంటాడు. ` నేను సెల్ ఫోన్‌కి ఎడిక్ట్ అయ్యా` తనే చెప్పాడు. ఈ తరం కుర్రాళ్లని చూస్తున్నా కదా.. చాలా మంది ఇదే తరహా.
మీ స్క్రీన్ ప్రెజెన్స్ ఇప్పటికీ అలానే ఉంది.. ఆ రహస్యం ఏమిటి?
నా వయసు 59… అయినా ఆలోచనలన్నీ అఖిల్ వయసు దగ్గరే ఆగిపోయాయేమో అనిపిస్తుంది. నా మనసులో ఏదీ ఉంచుకోను. ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడుతుంటా. అదే నా గ్లామర్‌సీక్రెట్ ఏమో. కుర్రాళ్లలో కుర్రాళ్లగా కలిసిపోతా. కేవలం సలహాలు ఇచ్చినప్పుడు మాత్రమే ఓ పెద్ద మనిషిలా మాట్లాడతా.
ఈనెల బాగా అచ్చొచ్చినట్టుంది?
అవును.. `శైలజారెడ్డి అల్లుడు` గురించి ఎలాంటి రివ్యూలు రాసినా… ఆ సినిమాకి డబ్బులొచ్చాయి. `యూ టర్న్` వసూళ్ల పరంగా, రివ్యూల పరంగానూ బాగుంది. ఇప్పుడు `దేవదాస్` వస్తోంది. కచ్చితంగా ఈ సెప్టెంబరు మాకు హ్యాట్రిక్ విజయాల్ని అందిస్తుందన్న నమ్మకం ఉంది.
బంగార్రాజు, రాహుల్ రవీంద్రన్తో సినిమాలెప్పుడు?
బంగార్రాజు స్క్రిప్టు రెడీ అవుతోంది. రాహుల్ రవీంద్రన్ కూడా కథ సిద్దం చేస్తున్నాడు. ఈ రెండింటిలో ఏ స్క్రిప్టు ముందు పూర్తయితే.. దాన్నే సెట్స్ పైకి తీసుకెళ్తా.