వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర మూడువేల కిలోమీటర్లకు చేరుకుంది. పాదయాత్ర ప్రారంభించి సుమారు 269 రోజులపాటు సాగిన ఈ పాదయాత్రలో విజయనగరం జిల్లాలో మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని జగన్ చేరుకుంటున్నారు. 2017 నవంబర్ 6వ తేదీన ప్రారంభించిన ఈ పాదయాత్ర దాదాపు 12 జిల్లాల లో కొనసాగి, ఇంకా శ్రీకాకుళం జిల్లాలో యాత్ర మిగిలి ఉండగానే మూడు వేల కిలోమీటర్ల మార్కును చేరుకుంది. అయితే ఈ పాదయాత్ర ద్వారా జగన్ పార్టీకి జరిగిన మంచి, జరిగిన నష్టం విశ్లేషిద్దాం.
పాదయాత్ర ద్వారా సాధించిన విజయాలు:
మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర అన్నది సాధారణమైన విషయం కాదు: దాదాపు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర అన్నది సాధారణమైన విషయం కాదు. అందులోనూ పాదయాత్ర నిరాటంకంగా, నిర్విఘ్నంగా కొనసాగడం ఆషామాషీ కాదు. శుక్రవారం కోర్టు కోసం బ్రేక్ ఇస్తున్నాడని ప్రత్యర్థి పార్టీలు ఎద్దేవా చేసినప్పటికీ, ఆ శుక్రవారాలు మినహా మిగతా సమయంలో అనవసరమైన ఆటంకాలు లేకుండా పాదయాత్ర సాగడం అభినందించాల్సిన విషయమే.
అన్ని వర్గాలతో మమేకం: పాదయాత్ర ద్వారా జగన్ సాధించిన ఒక విజయం ఏమిటంటే, ఇప్పుడున్న మిగతా నాయకులతో పోలిస్తే పూర్తి రాష్ట్రాన్ని చుట్టివచ్చి, దాదాపు అన్ని నియోజక వర్గాల ప్రజలతో ఒకసారి కలిసి, అనేక వర్గాల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన ఏకైక నాయకుడిగా జగన్ ప్రజలలో గుర్తింపు తెచ్చుకున్నాడు.
వ్యక్తిగతమైన అనుబంధం: అలాగే తమను ప్రత్యక్షంగా కలసి, తమ తో మాట్లాడి, తమ వినతులు స్వీకరించి, తమతో ఫోటోలు కూడా దిగిన నాయకుడి పై ప్రజలకు ఒక వ్యక్తిగతమైన అనుబంధం ఉంటుంది. ఎప్పుడో 1983లో ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫోటోలను కొంత మంది ప్రజలు ఇప్పటికీ ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. అలాగే వైయస్ తో పాదయాత్ర సందర్భంగా మాట్లాడిన వాళ్లు ఇప్పటికీ అనుభవం గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. జగన్ కొన్ని వేల మందిని కలిసి వారితో వ్యక్తిగతంగా మెలగడం ద్వారా వారితో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకోగలిగితే చెప్పవచ్చు.
పాదయాత్ర కారణంగా జరిగిన డ్యామేజ్:
అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కావడం: జగన్ పాదయాత్ర సందర్భంగా వచ్చే మొదటి విమర్శ అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కావడం. రాజకీయ పార్టీలతో పాటు విమర్శకులు కూడా, చట్టసభల ని వదిలేసి రోడ్లు అంట తిరగడం కోసం ప్రజలు నాయకులను అనుకోలేదని విమర్శిస్తూ ఉంటారు. ఈ విమర్శలు కొంత వాస్తవం లేకపోలేదు. ఉదాహరణకి కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానం జరిగినప్పుడు వైఎస్ఆర్సిపి అసెంబ్లీలో లేదు. అంటే భవిష్యత్తులో కాపు రిజర్వేషన్ల అంశం పూర్తి వాస్తవ రూపం దాల్చినా, ఒక్క శాతం క్రెడిట్ కూడా వైఎస్ఆర్సిపి పార్టీ కి చెందదు. ఇలాంటివి ఎన్నో.
ఒక్క ప్రజా సమస్య కూడా పరిష్కరించేలా చేయలేకపోవడం: పాదయాత్ర సందర్భంగా జగన్ పై వచ్చే మరొక విమర్శ, ఏదో అన్ని నియోజక వర్గాలను టచ్ చేస్తూ వెళ్తున్నాడు తప్పిస్తే ఏ ఒక్క ప్రజా సమస్య కూడా బయటకు తీయడం కానీ పరిష్కరించేలా చేయడం కానీ జగన్ చేయడం లేదు అన్నది. ఈ విమర్శ చేసేటప్పుడు, జనసేన పార్టీని ఉదాహరణగా చూపిస్తూ, పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీ సమస్య కానీ, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సమస్య కానీ, ఇంకా ఇలాంటి మరికొన్ని సమస్యలు కానీ కొద్దికాలంలోనే పరిష్కరించబడ్డాయి. జన్మభూమి కమిటీల అవినీతి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడితే కొద్దికాలంలోనే ప్రభుత్వం ఆ కమిటీలను రద్దు చేసింది. ఇలా నిజమైన ఫలితాలను సాధించే విధంగా సమస్యలను లేవనెత్తడం లో జగన్ విఫలమయ్యాడు అని విమర్శకులు విశ్లేషిస్తూ ఉంటారు.
జగన్ వేసుకున్న సెల్ఫ్ గోల్స్: ఇక పాదయాత్ర సందర్భంగా జగన్ వేసుకున్న సెల్ఫ్ గోల్స్ కూడా చాలామంది చర్చిస్తూ ఉంటారు. కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతాం అని ఆర్భాటంగా ప్రకటించడం, ఆ తర్వాత మళ్లీ ఆ ప్రకటనపై వెనక్కి తగ్గడం, కాపులకు రిజర్వేషన్ల విషయంలో మడమ తిప్పడం, ఆ తర్వాత మళ్లీ ఏదో ఆయింట్మెంట్ రాసినట్టుగా ఆ ప్రకటనను మరొకలా వివరించడం, ఇవన్నీ పాదయాత్ర సందర్భంగా జగన్ వేసుకున్న సెల్ఫ్ గోల్స్ అని విమర్శకుల తో పాటు ప్రజలు కూడా భావిస్తూ ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, పవన్ కళ్యాణ్ మీద నాటు భాషలో వ్యక్తిగత విమర్శలు చేసి సొంత పార్టీ నేతలే తలలు పట్టుకొని కూర్చునేలా జగన్ చేసిన తంతు జగన్ పాదయాత్ర లో అతిపెద్ద సెల్ఫ్ గోల్.
ముద్రగడ పద్మనాభం రివర్స్: ఇక ఈ పాదయాత్ర సందర్భంగా జరిగిన మరొక డ్యామేజ్ ఏమిటంటే, మొదటి నుండి వైఎస్సార్సీపీకి సహాయపడతాడు అనుకున్న ముద్రగడ పద్మనాభం పాదయాత్ర జరుగుతున్న సమయంలో జగన్ పై తీవ్ర విమర్శలు చేయడం. ముద్రగడ ద్వారా కాపు ఓట్లకు జగన్ గాలం వేస్తాడు అనుకుంటూ మొదటి నుండి చేసిన విశ్లేషణలు జగన్ పాదయాత్ర సందర్భంగా పటాపంచలైపోయాయి.
ఇక పాదయాత్ర ఇడుపులపాయలో మొదలుపెట్టిన నాటినుండి మంచి స్పందన వచ్చినప్పటికీ రాజమండ్రి బ్రిడ్జి దిగిన తర్వాత నుండి స్పందన కరువవడం గోదావరి జిల్లాలలో జగన్ కు తప్పుతుందా అన్న విశ్లేషణకు దారితీసింది. జగన్ యాత్ర ఇడుపులపాయ నుండి రాజమండ్రి బ్రిడ్జి వరకు బాగా సక్సెస్ అయితే, బ్రిడ్జి దిగిన నాటి నుండి ఉత్తరాంధ్ర వరకు జరుగుతున్న యాత్ర ఆ పార్టీ క్యాడర్ లోనే నిరుత్సాహానికి దారి తీసింది.
ఇక పాదయాత్ర ని పార్టీ ఎలా విశ్లేషించుకుంటుందనేది వేచి చూడాలి