తన పాలనలో సివిల్ సప్లయిస్ శాఖ సరిగా పనిచేయడం లేదనే సంగతి చంద్రబాబునాయుడుకు హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆ శాఖకు చెందిన అధికారుల మీద ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహ జ్వాలలను కురిపించారు. చంద్రన్న కానుకల రూపంలో పండగలకు పబ్బాలకు రేషన్ వినియోగదార్లకు సరుకులు ఇచ్చేసి.. మంచి పేరు మూటగట్టుకోవాలని చూస్తోంటే.. నాసిరకం నాణ్యతలేని సరుకులు అంటగడుతూ అధికారులు ప్రభుత్వం పరువు తీస్తున్నారని చంద్రబాబునాయుడు మండిపడ్డారు.
అంతా బాగానే ఉంది. మరి ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ వ్యవస్థలో ఒక లోపం జరిగిందంటే.. అది కేవలం అధికారుల ఇష్టాయిష్టాల ప్రకారమే జరుగుతుందా? అందులో మంత్రుల, రాజకీయ నాయకుల ప్రమేయం ఒత్తిళ్లు ఏమాత్రం ఉండవా? అనేది జనానికి రేకెత్తుతున్న సందేహం. పౌరసరఫరాల శాఖ ప్రస్తుతం అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల సునీత చేతిలో ఉంది. ఆమె మీద డైరక్టుగా ఆగ్రహం వ్యక్తం చేయలేక, అధికారుల మీద చంద్రబాబునాయుడు విరుచుకుపడుతుండవచ్చునని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే మంత్రులు ఎవరికి వారు వారికి చేతనైన రీతిలో తప్పొప్పులకు పాల్పడుతుండడం చాలా సహజంగానే జరుగుతూ ఉంది. మరి పరిటాల సునీత శాఖ మీదనే పనిగట్టుకుని చంద్రబాబు ఆగ్రహం కురిపించడం ఎందుకు..? అంటే.. ఆమెను పదవినుంచి తప్పించడానికి ఆయన రంగం సిద్ధం చేస్తున్నారని అంతా అనుకుంటున్నారు. ‘బ్రాండ్ ఏ డాగ్ యాజ్ మ్యాడ్.. బిఫోర్ యూ కిల్ ఇట్‘ అన్న సామెత చందంగా … కుక్కను చంపేయాలనుకుంటే.. ముందుగా అది పిచ్చిదనే ముద్ర వేయాలనే సిద్ధాంతాన్ని చంద్రబాబు అనుసరిస్తున్నారు. పరిటాల సునీత ను తొలగించడానికి, ముందుగా ఆమె శాఖ పనితీరు బాగాలేదనే ముద్ర వేస్తున్నారు.. ఆ మాటకొస్తే ఎవరి శాఖ సవ్యంగా ఉంది అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
మరో కీలకమైన మతలబు ఏంటంటే.. అనంతపురం జిల్లానుంచి ఇటీవల ఎమ్మెల్సీ అయిన పయ్యావుల కేశవ్ కు మంత్రిపదవి కట్టబెట్ట వలసి ఉంది. ఆ జిల్లానుంచి ఇప్పటికే ఇద్దరు మంత్రులు పల్లె రఘునాధరెడ్డి, పరిటాల సునీత ఉన్నారు. మరి కేశవ్ కు పదవి ఇవ్వాలంటే.. ఒకరిని తొలగించాలి. కుల సమీకరణల పరంగా ఒకేజిల్లాలో ఇద్దరికి కుదరదు గనుక.. సునీతను తొలగించి ఆ ఖాళీని కేశవ్ తో భర్తీ చేస్తారని, అలా చేయడానికి పూర్వ రంగం లాగానే.. ఇప్పుడిలా ఆమె శాఖపై పనిగట్టుకుని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు వ్యూహచతురత మరి కొన్నాళ్లకు గానీ తేలే అవకాశం లేదు.